Politics

ఏపీలో 60శాతం ప్రజలు మా వెంటే ఉన్నారు:జగన్

ఏపీలో 60శాతం ప్రజలు మా వెంటే ఉన్నారు:జగన్

రాష్ట్రంలో 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగనుందని.. దానికి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘నేను చేసిన మంచి కారణంగా చంద్రబాబుతో సహా అందరూ ఓడిపోవాల్సిందే. ప్రతిపక్షాలన్నీ జగన్‌, వైకాపా, పేదవాడి భవిష్యత్తు నాశనం లక్ష్యంగా ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దేవుడి దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి సిద్ధమవుతున్నా’ అని పేర్కొన్నారు. ‘సిద్ధం’ పేరిట విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలోని సంగివలసలో శనివారం నిర్వహించిన సభలో నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘అబద్ధానికి-నిజానికి, మోసానికి-విశ్వసనీయతకు మధ్యే ఈ యుద్ధం. చంద్రబాబు 2014 మ్యానిఫెస్టోలో 650 వాగ్దానాలు ఇచ్చి పది శాతమైనా అమలు చేయలేదు. మెరుగైన పాలన చేయొచ్చని ఆయనకు అనిపించలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా వైకాపా, జగన్‌ మార్కు ప్రగతి కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ సైన్యంగా పనిచేస్తూ ప్రతిపక్షాల దాడులు, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. బూత్‌ కమిటీల సభ్యులు, గృహసారథులు, వాలంటీర్లతోపాటు కార్యకర్తలనుంచి రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలి. ప్రతి గ్రామం నుంచి 60 శాతం ప్రజలు, కుటుంబాలు మన వెంట ఉంటే రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలన్నీ ఎందుకు రావు?’ అని జగన్‌ ప్రశ్నించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z