Politics

నాది విజన్ ఆయనది పాయిజన్-తాజావార్తలు

నాది విజన్ ఆయనది పాయిజన్-తాజావార్తలు

* తనపై బిజినెస్‌ మాజీ భాగస్వాములు వేసిన పరువు నష్టం దావాను కొట్టేయాలని.. దానికి విచారణ అర్హత లేదని దిల్లీ హైకోర్టుకు భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ (MS Dhoni) నివేదించాడు. మాజీ భాగస్వాములు మిహిర్‌ దివాకర్‌, అతడి భార్య సౌమ్యాదాస్‌ హైకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తమ పరువుకు భంగం వాటిల్లేందుకు కారణమైన ధోనీతో పాటు కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, మీడియా సంస్థలపై నష్టపరిహారంతో పాటు ఎలాంటి కథనాలు ప్రచురించకుండా నిరోధించాలని పిటిషన్‌లో కోరారు.

* శ్రీశైల భ్రమరాంబదేవికి ఓ భక్తుడు బంగారు, వెండి పుష్పాలు కానుకగా సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన మురళి.. కుటుంబసభ్యులతో కలిసి సోమవారం పుష్పాలను బహూకరించారు. వీటి విలువ సుమారు రూ.5.45 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.

* కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో వెలసిన రాఘవేంద్ర స్వామి మఠంలో జనవరి నెలకు సంబంధించి హుండీ కౌంటింగ్ ప్రారంభించినట్లు ఏఏఓ మాధవ్ శెట్టి, మేనేజర్లు శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి తెలిపారు. సోమవారం ఉదయం ప్రారంభమైన హుండీ కౌంటింగ్ సాయంత్రానికల్లా పూర్తి చేస్తామని వారు తెలిపారు.

* పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు (Budget session) జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం (All-party Meet) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సమాచారం అందించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంటు (Parliament) బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) ముందు నిర్వహించనున్న చివరి సమావేశాలు ఇవే. కీలక బిల్లులన్నింటికీ గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ (Interim Budget) పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఏప్రిల్‌-మేలో జరిగే ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది.

* వచ్చే ఎన్నికల్లో పొన్నూరు ప్రజలు తమ పౌరుషాన్ని చూపించాలని.. తెదేపాను తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. పిల్లలు, తెలుగుజాతి భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజలపై ఉందన్నారు. పల్నాడు జిల్లా పొన్నూరులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్‌ మార్క్‌ అంటూ కొత్త నాటకాలకు సీఎం తెరలేపారు. విద్యుత్‌ బిల్లులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెంచడం, రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగం, రివర్స్‌ నిర్ణయాలతో రివర్స్‌ పాలన.. ఇదీ సీఎం జగన్‌ మార్క్‌. గంజాయి సరఫరాలో ఏపీని నంబర్‌ వన్‌ చేశారు. ఈ ఘనతా ఆయనకే దక్కుతుంది. డ్వాక్రా మహిళలతో పొదుపు చేయించడం, పేద పిల్లల కోసం విదేశీ విద్య అందించడం, దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ చేయడం, రైతు బిడ్డలను లక్షాధికారులను చేయడం తెలుగుదేశం పార్టీ మార్క్‌. నాది విజన్‌ అయితే.. జగన్‌ది పాయిజన్‌.” అని చంద్రబాబు అన్నారు.

* రాజమహేంద్రవరం ‘రా.. కదలిరా’ బహిరంగసభ ముగింపు సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు అభిమానులు, పార్టీ నేతలు పెద్దఎత్తున నెట్టుకురావడంతో ఆయనకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఒక దశలో ఆయన కింద పడిపోయే పరిస్థితి చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఇతర నేతలు.. ఆయన్ను పడిపోకుండా పట్టుకున్నారు. చంద్రబాబు చుట్టూ వలయంగా ఏర్పడి.. క్షేమంగా వేదిక పైనుంచి కిందకు తీసుకొచ్చారు.

* ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌(Congress)ను చీల్చి చెండాడుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) హెచ్చరించారు. సోమవారం నాడు చేవెళ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… కార్యకర్తలు, నేతలు అధైర్య పడవద్దు…. కారు సర్వీసింగ్‌కు పోయింది… మళ్లీ వంద స్పీడుతో దూసుకొస్తుందని తెలిపారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని….ప్రజల తరపున ప్రశ్నిస్తాం.. పోరాడుతామని అన్నారు. గత పదేళ్లల్లో మన మధ్య సమన్వయం లోపించిందన్నది వాస్తవం… ఇప్పుడు అలా జరగకుండా చూస్తామని వ్యాఖ్యానించారు. 119 సీట్లలో 39 సీట్లతో బలవంతమైన ప్రతిపక్షంగా ఉన్నామని తెలిపారు. 14 సీట్లు ఐదు వేల ఓట్లతో ఓటమి పాలయ్యామని… అందులో సగం గెలిచినా హంగ్ వచ్చేదన్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదన్న కేసీఆర్ మాటలను ఈ సర్కార్ నిజం చేస్తోందన్నారు. మార్పు కావాలి అనోళ్లు ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు రైతు బంధు పైసలు పడలేదని…కేసీఆర్ ప్రభుత్వంలో వారం రోజుల్లోనే రైతు బంధు పడేదన్నారు. కాంగ్రెస్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

* ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే తాను మొబైల్ ఫోన్ ఉపయోగిస్తానని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. అతి ఎప్పుడూ మంచిది కాదని వ్యాఖ్యానించారు. కొన్ని వారాల్లో పరీక్షలు జరగనున్న తరుణంలో విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టే నిమిత్తం నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha)’ కార్యక్రమంలో మోదీ ఈవిధంగా సలహా ఇచ్చారు. ‘నేను అవసరం ఉంటేనే ఫోన్ వాడతాను. మొబైల్‌ వినియోగాన్ని తగ్గించుకునేందుకు.. మీ ఫోన్లలో స్క్రీన్‌ టైం అలర్ట్‌ టూల్స్‌ను ఉపయోగించండి. మొబైల్స్‌ చూస్తూ సమయాన్ని మర్చిపోకూడదు. మనం సమయాన్ని గౌరవించాలి. అలాగే పిల్లల ఫోన్ల పాస్‌వర్డ్‌లు కుటుంబసభ్యులు తప్పకుండా తెలుసుకోవాలి. టెక్నాలజీ నుంచి ఎప్పుడూ దూరంగా జరగకూడదు. కానీ దానిని సానుకూల ప్రభావం చూపేలా మాత్రమే వాడాలి’ అని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలు చేశారు. ‘పరీక్షలకు సన్నద్ధమవుతోన్న తరుణంలో పిల్లలు చిన్నచిన్న లక్ష్యాలు విధించుకొని, క్రమంగా పాఠ్యాంశాలపై పట్టు సాధించాలి. ఈరకంగా చదువుతూ వెళితే.. పరీక్షలకు పూర్తిగా సిద్ధం అవుతారు’ అని ప్రధాని తెలిపారు.

* దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ శాంసంగ్‌ (Samsung) ఈ ఏడాది నుంచి భారత్‌లో ల్యాప్‌టాప్‌లు తయారుచేయనుంది. సంస్థ ఉన్నతోద్యోగి ఒకరు సోమవారం ఈవిషయాన్ని వెల్లడించారు. నోయిడాలోని తయారీ యూనిట్‌లో వీటి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ‘‘శాంసంగ్‌ సంస్థకు భారత్‌లోని తయారీ కేంద్రాలు ఎంతో కీలకమైనవి. సంస్థ ప్లాంట్‌లలో నోయిడా యూనిట్‌ రెండో అతి పెద్దది. దీని ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఎంతగానో సహకరించాయి. ఈ ఏడాది నుంచే ఇందులో ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభిస్తాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రపంచ స్థాయి డిమాండ్‌కు తగినట్లు ఉత్పత్తుల తయారీకి ప్లాంట్‌లో కొన్ని మార్పులు చేస్తాం’’ అని శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్‌ టీఎమ్‌ రోహ్‌ తెలిపారు.

* జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్‌ షర్మిల ఆరోపించారు. వైకాపా కోసం నిస్వార్థంగా పని చేస్తే.. ఇప్పుడు తనపైనే వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తనకు ఎప్పుడూ పదవీ కాంక్ష లేదని, ఎన్ని అవరోధాలు కల్పించినా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు. ‘‘వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా తన మార్క్ రాజకీయం, సంక్షేమ పాలన అందించారు. అదిప్పుడు జగనన్న పాలనలో ఎక్కడ ఉంది. వైకాపాని అధికారంలోకి తీసుకొచ్చేందుకు 3,200 కి.మీ పాదయాత్ర చేశా. అలాంటిది ఇప్పుడు నాపైన మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. రోజుకొకరితో నాపై వ్యక్తిగతంగా దూషణలు చేయిస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీతో నా భర్త అనిల్ కలిసి రాజకీయం చేశారని మాట్లాడుతున్నారు. జగన్‌ను జైల్లో పెట్టి నేను ముఖ్యమంత్రి కావాలని అనిల్ కోరినట్లు విష ప్రచారం చేస్తున్నారు. అదంతా అబద్ధం. సోనియా గాంధీ దగ్గరికి అనిల్.. భారతి రెడ్డితో కలిసే వెళ్లేవారు. వైకాపా నేతలకు దమ్ముంటే ప్రణబ్ ముఖర్జీ కుమారుడిని అడిగి తెలుసుకోండి. జగన్‌ పత్రికలో నా పైన వ్యక్తిగతంగా వార్తలు రాయిస్తున్నారు. ఆ పత్రికలో జగన్‌కు ఎంత భాగస్వామ్యం ఉందో నాకూ అంతే ఉంది. ఆ విషయం మరిచి ఆ పత్రిక ఇష్టానుసారం వార్తలు రాస్తోంది. వైకాపా నాయకులు ఏం రాసినా, ఏం చేసినా భయపడే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి’’ అని షర్మిల తీవ్రంగా మండిపడ్డారు.

* మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘శ్రీమంతుడు’ (Srimanthudu). 2015లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే, ఈ చిత్ర కథ విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టులోనూ దర్శకుడు కొరటాల శివకు చుక్కెదురైంది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్‌ కేసు ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘శ్రీమంతుడు’ స్టోరీని స్వాతి పత్రికలో ప్రచురించిన కథ ఆధారంగా కాపీ చేశారని రచయిత శరత్‌ చంద్ర గతంలో హైదరాబాద్‌ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ, కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z