ScienceAndTech

మానవ మెదడులో చిప్ పెట్టిన “న్యూరాలింక్”

మానవ మెదడులో చిప్ పెట్టిన “న్యూరాలింక్”

మానవ మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. సోమవారం తొలిసారి ఓ వ్యక్తికి విజయవంతంగా చిప్‌ను అమర్చామని న్యూరాలింక్‌ (Neuralink) వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ వెల్లడించారు. అతనిప్పుడు వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. ఆరంభ ఫలితాల్లో స్పష్టమైన ‘న్యూరాన్‌ స్పైక్‌ డిటెక్షన్‌’ను గుర్తించినట్లు పేర్కొన్నారు.

కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్‌ -కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌’ (BCI) ప్రయోగాలకు అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA)’ గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది. న్యూరాలింక్‌ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని వెల్లడైనట్లు ఆ సంస్థ నిపుణులు చెప్పారు. దీని సాయంతో ఒక కోతి ‘పాంగ్‌’ వీడియో గేమ్‌ను ఆడింది.

న్యూరాలింక్‌ బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ (BCI)లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్‌1 అనే చిప్‌ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్‌1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్‌నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌నకు పంపుతాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్‌స్టాల్‌ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్‌ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథమ్‌లుగా మారుస్తుంది. తరచూ వార్తల్లో ఉండడం వల్ల న్యూరాలింక్ (Neuralink) ప్రాజెక్టు గురించి మాత్రమే ఎక్కువగా బయటకు వస్తోంది. కానీ, ఈ తరహా ప్రయోగాలు మరికొన్ని కంపెనీలు కూడా చేపడుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జులైలోనే యూఎస్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ తరహా చిప్‌ను అమర్చింది. అయితే, న్యూరాలింక్ తరహాలో తాము పుర్రెకు ఎలాంటి కోత పెట్టలేదని ఆ కంపెనీ వెల్లడించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z