హెచ్-1బీ వీసా (H-1B visa) రెన్యువల్ విధానాన్ని మరింత సరళీకరించేలా అమెరికా (USA) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విదేశీ వృత్తి నిపుణులు తమ హెచ్-1బీ వీసాలను అమెరికాలోనే రెన్యువల్ (Renewal) చేసుకునేలా ఓ పైలట్ ప్రోగ్రామ్‌కు బైడెన్ సర్కారు ఇటీవల పచ్చజెండా ఊపింది. తాజాగా ఇది అందుబాటులోకి వచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం జనవరి 29 నుంచి ఈ పైలట్ ప్రోగ్రామ్ ప్రారంభమైనట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులోభాగంగా 20వేల వీసాలను అమెరికాలోనే రెన్యువల్ చేయనున్నారు. తొలి దశ ఈ అవకాశాన్ని కేవలం భారతీయులు, కెనడియన్లకు మాత్రమే కల్పించారు. ఐదు వారాల పాటు ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుంది. ప్రతి వారం 4వేలు చొప్పున వీసాలను రెన్యువల్ చేయనున్నారు. 2020 జనవరి 1 నుంచి 2023 ఏప్రిల్ 1 మధ్య మిషన్ కెనడా జారీ చేసిన వీసాలు, 2021 ఫిబ్రవరి 1 నుంచి 2021 సెప్టెంబరు 30 మధ్య మిషన్ ఇండియా జారీ చేసిన వీసాలను మాత్రమే రెన్యువల్ చేసుకునేందుకు వీలు కల్పించారు.
అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు హెచ్-1బీ వీసా (H-1B visa) అవకాశం కల్పిస్తుంది. ఈ వీసాలను వినియోగిస్తున్న వారిలో భారతీయులే అధికం. సాధారణంగా వీటి గడువు మూడేళ్లలో తీరిపోతుంది. గతంలో హెచ్-1బీ వీసా కలిగినవారు రెన్యువల్ కోసం అమెరికాను విడిచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. 2004 వరకు ఇదే విధానం అమలయ్యేది. ఆ తర్వాత దీనిలో మార్పు చేయడంతో.. రెన్యువల్ కోసం స్వదేశం తిరిగిరావడమో లేక మరేదైనా దేశానికి వెళ్లి పునరుద్ధరించుకోవడమో చేయాల్సివస్తోంది. అయితే, గతేడాది జూన్‌లో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చినపుడు హెచ్-1బీ వీసాలను అగ్రరాజ్యంలోనే పునరుద్ధరిస్తామని బైడెన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా పైలట్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z