Business

మాల్దీవుల పర్యాటకం కుదేలు-వాణిజ్య వార్తలు

మాల్దీవుల పర్యాటకం కుదేలు-వాణిజ్య వార్తలు

* భారత్‌తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవుల (Maldives)కు గట్టి షాక్‌ తగిలినట్లు కనిపిస్తోంది. నిత్యం పెద్దఎత్తున భారత్‌ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. మాల్దీవుల పర్యాటక ర్యాంకింగ్‌లో మన దేశ స్థానం గణనీయంగా పడిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గతేడాది డిసెంబరు 31 వరకు భారత్‌ నుంచి 2,09,198 మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. నాడు ద్వీపదేశ పర్యాటక మార్కెట్‌లో 11 శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రష్యా రెండో స్థానంలో.. చైనా మూడో స్థానంలో కొనసాగాయి. నాలుగో స్థానంలో బ్రిటన్‌ నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్‌ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.. సాహసాలు చేయాలనుకున్నవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. ఇది ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసే స్థాయికి చేరింది. గత మూడు వారాలుగా మాల్దీవుల పర్యాటక జాబితాను పరిశీలిస్తే.. అప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగిన భారత్‌ కొంతకాలంలోనే ఐదో స్థానానికి పడిపోయింది. 13,989 మంది మాత్రమే మాల్దీవులను సందర్శించారు. 18,561 మంది పర్యాటకులతో రష్యా మొదటి స్థానంలో నిలిచింది. 18,111 మంది పర్యాటకులతో ఇటలీ రెండో స్థానానికి ఎగబాకింది. చైనా 16,529.. బ్రిటన్‌ 14,588 మంది పర్యాటకులతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

* దేశంలో ఒకవైపు ఇంటర్నెట్‌ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. 4జీ, 5జీ అంటూ టెలికం సంస్థలు తమ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. అయినప్పటికీ 2జీ, 3జీ సర్వీసులు వాడేవాళ్లు దేశంలో చాలానే ఉన్నారు. గ్రామాలు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో పెద్దవాళ్లు ఇంకా ఫీచర్‌ ఫోన్లనే వాడుతున్నారు. అందులో 2జీ సేవలనే వినియోగించుకుంటున్నారు. అయితే అలాంటి వాళ్లకు షాక్‌ ఇచ్చేందుకు జియో, వొడాఫోన్‌ ఐడియా సిద్ధమయ్యాయి. 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా 2జీ, 3జీ సేవలు అందించడం అవసరం లేదని.. వాటిని పూర్తిగా నిలిపివేయాలని తాజాగా టెలికం నియంత్రణ సంస్థ ( ట్రాయ్‌)కు ప్రతిపాదించాయి. దీనికి సంబంధించి కేంద్రమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సూచించాయి. 2జీ/3జీ సేవలను పూర్తిగా నిలిపివేసేలా కేంద్ర ప్రభుత్వమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ట్రాయ్‌కు జియో కోరింది. ఆ రెండు స్పెక్ట్రమ్‌లను మూసివేసినప్పుడే ప్రజలంతా 4జీ, 5జీలోకి మారతారని అభిప్రాయపడింది. దీనివల్ల అనవసరపు నెట్‌వర్క్‌ వినియోగ భారం తగ్గుతుందని వివరించింది. అంతేకాకుండా 5జీ ఎకో సిస్టమ్‌ వృద్ధిలో వేగవంతమవుతుందని తెలిపింది. వివిధ రంగాల్లో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో 5జీ ఎకోసిస్టమ్‌ కీలక పాత్ర పోషిస్తుందని జియో అభిప్రాయపడింది. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ ద్వారా యువతలో నైపుణ్యాలు పెంచుకోవడంతో పాటు తమ కలలను సాకారం చేసుకునేందుకు అవకాశాలను ఇస్తాయని పేర్కొంది.

* ఇప్ప‌టికీ రిమోట్ వ‌ర్కింగ్‌లో ఉన్న మేనేజ‌ర్ల‌కు ఐబీఎం గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది. కంపెనీ స‌మీపంలో నివ‌సించాల‌ని లేదా సంస్ధ నుంచి వైదొల‌గాల‌ని అల్టిమేటం జారీ చేసింది. వారానికి క‌నీసం మూడు రోజులు కార్యాల‌యంలో లేదా క్లైంట్ లొకేష‌న్‌లో త‌క్ష‌ణ‌మే రిపోర్ట్ చేయాల‌ని అమెరికా కేంద్రంగా కంపెనీలో ప‌నిచేసే మేనేజ‌ర్లంద‌రినీ ఐబీఎం హెచ్చ‌రించింది. వైద్య‌ప‌ర‌మైన కార‌ణాల‌తో రిమోట్ వ‌ర్క్‌ మిన‌హాయింపు పొందుతున్న వారు ఆగ‌స్ట్ నాటికి ఐబీఎం కార్యాల‌యాల స‌మీపానికి రీలొకేట్ కావాల‌ని కోరింది. ఐబీఎం కార్యాల‌యాల‌కు ద‌గ్గ‌ర‌గా చేరుకోని వారు, రిమోట్ అప్రూవ్ క‌లిగిన ఉద్యోగాల్లో లేని వారు ఐబీఎం నుంచి నిష్క్ర‌మించ‌వ‌చ్చ‌ని కంపెనీ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ గ్రాంగ‌ర్ పేర్కొన్నారు. ముఖాముఖి సంప్ర‌దింపులు, వెసులుబాటు మ‌ధ్య స‌మ‌తూకం పాటించే ప‌ని వాతావ‌ర‌ణం క‌ల్పించే దిశ‌గా ఐబీఎం దృష్టి సారిస్తుంద‌ని కంపెనీ ప్ర‌తినిధి చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజ‌ర్లు వారానికి క‌నీసం మూడు రోజులు కార్యాల‌యాల్లో ప‌నిచేయాల‌ని తాము కోరుకుంటున్నామ‌ని చెప్పారు. ఇక ఐబీఎం సీఈవో అర్వింద్ కృష్ణ కార్యాల‌యంలో ప‌నిచేయ‌డం అవ‌స‌రాన్ని గ‌తంలో ప‌లుమార్లు నొక్కిచెప్పారు. ఆన్ సైట్‌లో ప‌నిచేయ‌ని వారికి పదోన్న‌తులు ద‌క్క‌డం అరుద‌ని బ్లూమ్‌బ‌ర్గ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలతో సూచీలు లాభాల్లో మొదలవగా.. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత దశలోనూ సూచీలు కోలుకోలేదు. క్యాపిటల్ గూడ్స్, పవర్, ఎఫ్‌ఎంసీజీ పేర్లలో అమ్మకాలతో అస్థితరకు గురయ్యాయి. మార్కెట్‌ ప్రారంభంలో వచ్చిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి తీవ్రతరం కావడంతో నష్టాలు తప్పలేదు. ఉదయం 2,000.20 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్‌ ఒక దశలో 72,142.23 పాయింట్ల గరిష్ఠానికి చేరుకుంది. ఇంట్రాడేలో 71,075.72లో పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 801.67 పాయింట్ల నష్టంతో 71,139.90 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 215.50 పాయింట్ల నష్టంతో 21,522.10 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్ నష్టపోగా అత్యధికంగా నష్టపోయాయి. టాటా మోటార్స్, బిపీసీఎల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లాభపడ్డాయి. రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్‌ మినహా అన్ని రంగాల్లోనూ క్యాపిటల్‌ గూడ్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, పవర్‌ 0.5-1 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పతనం కాగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది.

* టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) ఛైర్మన్‌గా అనిల్‌ కుమార్‌ లాహోటీ నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఇంతకుముందు భారతీయ రైల్వే బోర్డు చీఫ్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. పీడీ వాఘేలా పదవీకాలం ముగియడంతో గత నాలుగు నెలలుగా ట్రాయ్‌ ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. ఆ స్థానంలో ఈ నియామకం జరిగింది. 65 ఏళ్లు వయసు వచ్చేవరకు, లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అనిల్‌ కుమార్‌ లాహోటీ ట్రాయ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. అనిల్‌ కుమార్‌ నియామకంపై ఇండస్ట్రీస్‌ బాడీ COAI డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్‌ హర్షం వ్యక్తంచేశారు. దేశీయ టెలికాం రంగం వృద్ధికి ఇలాంటి అనుభవమైన వ్యక్తుల మార్గదర్శకం అవసరమన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z