ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ప్రార్థనా మందిరంలో సీలు వేసి ఉన్న భూగర్భ గృహంలో గల హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు స్థానిక పూజారి కుటుంబానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అనుమతి మంజూరు చేసింది. జిల్లా జడ్జి ఎ.కె.విశ్వేష్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. హిందూ వర్గ న్యాయవాది మదన్‌మోహన్ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కోర్టులో హిందూ వర్గం దాఖలు చేసిన పిటిషను ప్రకారం… 1993లో అధికారులు భూగర్భ గృహాన్ని మూసివేసే వరకు పూజారి సోమనాథ్ వ్యాస్ అక్కడ పూజలు చేసేవారు. ములాయంసింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘బాబ్రీ’ వివాదంతో ఇక్కడ పూజలను నిలిపివేశారు. భూగర్భ గృహం మసీదులో భాగమేనని, అక్కడ పూజలకు అనుమతి ఇవ్వరాదని ముస్లిం వర్గం వాదిస్తూ వచ్చింది. తాజాగా మళ్లీ పూజలకు అనుమతి మంజూరుచేసిన నేపథ్యంలో దీనికనుగుణంగా వజూఖానా ముందున్న బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించి ఏర్పాట్లు చేయాలని, కాశీ విశ్వనాథ ట్రస్టు దీనికి సహకరించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించినట్లు మదన్‌మోహన్ తెలిపారు. సోమనాథ్ వ్యాస్ మనవడైన శైలేంద్రకుమార్ పాఠక్ (పిటిషనరు) ఇపుడు పూజలు చేస్తారు. వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆలోక్‌కుమార్ ఈ తీర్పును స్వాగతించారు. ఈ తీర్పును తాము హైకోర్టులో సవాలు చేస్తామని ముస్లిం వర్గ న్యాయవాది ముంతాజ్ అహ్మద్ తెలిపారు.
వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు విషయంలో యాజమాన్య హక్కుల కోసం గత కొన్నేళ్లుగా న్యాయపోరాటం జరుగుతోంది. దీనిపై విచారణ జరిపిన వారణాసి జిల్లా కోర్టు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేకు గతేడాది జులై 21న ఉత్తర్వులిచ్చింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీలు వేసిన వజూఖానా మినహా మసీదు ప్రాంగణమంతా కార్బన్ డేటింగ్, ఇతర పద్ధతుల్లో భారత పురావస్తు విభాగం (ఏఎస్‌ఐ) సర్వే చేసింది. హిందూవర్గ సమాచారం మేరకు.. మసీదు కింద ఆలయానికి సంబంధించిన అవశేషాలున్నట్లు సర్వే నివేదిక తేల్చింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z