* సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కుమారి అనే మహిళ నిర్వహిస్తున్న ఫుడ్‌స్టాల్‌ను కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు డీజీపీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ, ఐటీసీ కోహినూర్ హోటల్ పక్కన కొంతకాలంగా కుమారి స్టాల్ నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారంతో గత కొన్ని రోజులుగా భోజన ప్రియులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. దీంతో రద్దీ ఏర్పడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ క్రమంలో పోలీసులు మంగళవారం అక్కడికి చేరుకుని స్థలం మార్చాలని కుమారికి సూచించారు. ఈ విషయం మళ్లీ వైరల్ కావడంతో సీఎం రేవంత్ స్పందించారు. ఆమె స్టాల్ కొనసాగింపునకు అనుమతించాలని డీజీపీని ఆదేశించారు.
* మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే సమయం ఆసన్నమైంది. రేపు ( గురువారం ) మధ్యాహ్నం 12:45 నిమిషాలకు స్పీకర్ ఛాంబర్ లో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు 12గంటలకే అసెంబ్లీకి చేరుకోనున్న కేసీఆర్ నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.
* రాష్ట్రంలో 1500 రేషన్ దుకాణాల్లో మోదీ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర సహకార, ఆహారశాఖకు కేంద్ర ఆహార శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉచిత బియ్యం పథకం ఈనెల నుంచి ఐదేళ్లకు పొడిగించారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో ఉచిత బియ్యం పథకాన్ని ప్రజలకు తెలిసేలా దేశవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో ప్రధానమంత్రి(Prime Minister) ఫొటో ఉన్న సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోనూ 1500 రేషన్ దుకాణాల్లో ఈ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
* హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇక మీదట తమిళనాడులోని అన్ని హిందూ దేవాలయాల్లోకి అన్య మతస్థులను కోడిమారం (ధ్వజస్తంభం) దాటి అనుమతించరాదని తెలిపింది. అనుమతి నిరాకరణకు సంబంధించిన బోర్డులను సైతం ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా హిందువులకు కూడా తమ మతం, వృత్తిని అభ్యసించే ప్రాథమిక హక్కు ఉందని పేర్కొంది.
* 17వ లోక్‌సభ చివరి సమావేశాలు (Parliament) నేటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9వ తేదీ వరకూ కొనసాగే ఈ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఇక ఈ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము .. ఉదయం రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్‌కు (Parliament building) సంప్రదాయ గుర్రపు బగ్గీ (traditional buggy)లో వెళ్లారు. అనంతరం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.
* ప్రజలలో చైతన్యం రావాలి.. ఏపీకి ప్రత్యేక హోదా విషయం పోరాడాలి అని పిలుపునిచ్చారు జై భారత్ పార్టీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాణ.. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పాస్ కాకుండా చూడాలి.. బడ్జెట్‌ను స్తంభింపజేస్తే కేంద్రం ఆలోచిస్తుందన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధించేందుకు అనేక అవకాశాలు వచ్చాయి.. 2019 నుంచి ప్రతిసారీ రాష్ర్టానికి చెందిన ఉభయపార్టీలు.. ఎన్టీఏకు మద్దతు పలికారు. అడకముందే మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేక హాదాపై టీడీపీ, వైసీపీకి చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు.. ముగించిన హామీగా పేర్కొన్నారు. హోదా వద్దు ప్యాకేజీనే ముద్దు అని టీడీపీ, జనసేన నేతలు మాట్లాడారని దుయ్యబట్టారు.
* ఈ ఫిబ్రవరి నెలలో యాత్ర 2 సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఒక పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏమిటి? అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గతంలో పాఠశాల, యాత్ర లాంటి సినిమాలు చేసి సైతాన్ లాంటి వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన మహి వి రాఘవ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. సొంత నిర్మాణంలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన పోటీ నెలకొంది. అదేమిటంటే గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మంచి క్రేజ్ అందుకున్న కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కూడా ఈ సినిమాకి పోటాపోటీగా రిలీజ్ చేస్తున్నారు.
* ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనం అవుతారు. రేపుకూడా సీఎం జగన్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు కు నిధులు , ప్యాకేజీ, కేంద్రం నుంచి రావాల్సిన రాయితీలను జగన్ కోరనున్నారు. ఇదే సందర్భంలో ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపైకూడా మోదీ, అమిత్ షాలతో సీఎం జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరో రెండుమూడు నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షాలతో జగన్ భేటీ అవుతుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
* మలేషియాకు కొత్త రాజు వచ్చారు. కౌలాలంపూర్ లోని జాతీయ ప్యాలెస్ లో బుధవారం జరిగిన కార్యక్రమంలో మలేషియా దక్షిణ రాష్ట్రమైన జోహోర్ కు చెందిన సుల్తాన్ ఇబ్రహీం దేశ నూతన రాజుగా ప్రమాణ స్వీకారం చేశారు. మలేషియాలో ఇంకా రాచరికం కొనసాగుతున్నప్పటికీ అది ఉత్సవ విగ్రహ పాత్రనే పోషిస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల కిందట నుంచి దాని ప్రభావం కూడా పెరిగింది. ఇక్కడి రాజుకు విచక్షణాధికారాలు ఉంటాయి. రాజకీయ అస్థిరతను అణచివేయడానికి ఆ అధికారులు ఇటీవల ఉపయోగపడుతున్నాయి.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగసంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో పనిచేస్తోంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏపీ రాష్ట్రవాసులకు అనేక ఉచిత సేవలు అందిస్తూ, వారికోసం నిరంతరాయంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీఎన్ఆర్‌టీఎస్ సంస్థ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి, సీఈఓ పి. హేమలత రాణి .. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో “మీట్ ది ప్రెస్” చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకట్ ఎస్. మేడపాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్‌టీఎస్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్టులకు వివరించారు.మేడపాటి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్‌టీఎస్) ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత, అభివృద్ది ధ్యేయంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో ముందుకేల్తోందని అన్నారు.
* భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అమెరికాలో వైభవంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో సిటీ హాల్‌లో జరిగిన వేడుకలకు ప్రవాసులు భారీగా తరలివచ్చారు. ముఖ్య అతిథిలుగా ‘శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా’ డాక్టర్ శ్రీకర్ రెడ్డి, ‘చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ మరియం’ హాజరై, ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని మాతృభూమిపై వారికున్న ప్రేమాభిమానాలను చాటిచెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z