Kids

పిల్లలు తల్లిదండ్రుల వద్ద నిద్రపోవచ్చా?

పిల్లలు తల్లిదండ్రుల వద్ద నిద్రపోవచ్చా?

మన దేశంలో పిల్లలతో కలిసి నిద్రించే తల్లిదండ్రుల సంఖ్య ఎక్కువ. కుటుంబమంతా ఒకే చోట నిద్రపోతుంది. పిల్లలకు టీనేజీ వయసు వచ్చేదాకా తల్లిదండ్రుల దగ్గరే ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. మనదేశంలో ఆర్థిక పరిస్థితులు కూడా అందరూ ఒకే చోట నిద్రపోయేలా చేస్తున్నాయి. గదులు తక్కువగా ఉండడం, ఇల్లు చిన్నగా ఉండడం వంటి వాటి వల్ల ఎక్కువమంది తల్లిదండ్రులు పిల్లలను తమతోనే నిద్రపోయేలా చేస్తున్నారు. కానీ విదేశాల్లో మాత్రం చిన్నప్పటినుంచే పిల్లలను విడిగా పడుకోబెడతారు. ఏడాది వయసున్న పిల్లలను విడిగా వారి గదిలోనే నిద్రపుచ్చుతారు. తల్లితండ్రులతో పిల్లలతో కలిసి పడుకుంటే మంచిదా? లేక పిల్లలను విడిగా వేరే గదిలో నిద్ర పుచ్చితే మంచిదా? ఈ సందేహం ఎంతో మందిలో ఉంది. దీనికి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

తల్లిదండ్రులతో నిద్రపోవడానికి పిల్లలు కంఫర్ట్ గా ఉంటే వాళ్ళు అలానే నిద్రపోవడం మంచిదని వివరిస్తున్నారు. కొంతమంది పిల్లలు చీకటిని చూసి భయపడతారు, అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఉండడాన్ని కొంతమంది జీర్ణించుకోలేరు. అలాంటి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భద్రత, సౌలభ్యం సాన్నిహిత్యం అనేవి ఎక్కడ నిద్రపోవాలనుకునే పరిస్థితిని నిర్ణయిస్తాయి. పిల్లలు ధైర్యంగా పడుకునే వారైతే విడిగా పడుకోబెట్టినా ఎలాంటి సమస్య లేదు. కానీ పిల్లలు భద్రంగా ఉండాలంటే తల్లిదండ్రులు వారికి దగ్గరగానే ఉండాలి.

పిల్లలకు ఒక వయసు వచ్చాక విడిగానే పడుకునేందుకు ఇష్టపడతారు. ఆ వయసు వచ్చేవరకు తల్లిదండ్రులు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారి భావోద్వేగాలు, అంతర్లీన అవసరాలను కూడా తల్లిదండ్రులు అర్థం చేసుకొని వారికి నిద్రా ఏర్పాట్లను చేస్తే అన్ని విధాల ప్రయోజనకరం. పిల్లలు తల్లిదండ్రులతో కలిసి నిద్రించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. వారిలో లోతైన భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరుస్తుంది. పిల్లల్లో ఒకోసారి పీడకలలు వస్తాయి. అలాంటప్పుడు నిద్రలో అకస్మాత్తుగా లేస్తూ ఉంటారు. వారికి అనారోగ్యాలు ఉన్నా, ఆందోళన చెందినా.. వెంటనే పక్కన తల్లిదండ్రులు ఉంటే వారు కోలుకునే అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రుల పక్కన నిద్రపోయే పిల్లలకి నిద్ర చక్కగా పడుతుంది. వారు శాంతంగా ఉంటారు.

కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇలా పక్కన పడుకోబెట్టుకోవడం వల్ల వారి లైంగిక జీవితం ప్రభావితం అవుతుందని అనుకుంటారు. అందుకే పిల్లలను వేరే గదిలో పడుకోబెట్టెందుకు ఇష్టపడతారు. పిల్లల స్వభావం బట్టి తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవాలి. తమ అవసరాల కోసం పిల్లల్ని దూరం పెడితే అది వారి భావోద్వేగాలపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీ పిల్లల పరిస్థితి, ఆరోగ్యం, ఆలోచనలను బట్టి మీరు వారితో కలిసి పడుకోవాలా? లేక విడిగా పడుకోవాలా అనేది నిర్ణయించుకుంటే మంచిది. ఏదైనా మీ వైపు నుంచి కాకుండా మీ పిల్లల వైపు నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z