అన్నవరం సత్యదేవుని ఆలయ శిఖరాన్ని స్వర్ణతాపడం చేయనున్న విషయం తెలిసిందే. దీనికి ఎంత బంగారం అవసరమవుతుందో అంచనా వేసేందుకు ఎండోమెంట్స్ ప్రధాన స్తపతి పరమేశ్వరప్ప శనివారం అన్నవరం దేవస్థానానికి వచ్చారు. దేవస్థానం ఈఓ కె.రామచంద్ర మోహన్‌తో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. అనంతరం దేవస్థానం ఈఈ నరసింహారెడ్డితో కలిసి ప్రధాన ఆలయాన్ని, ఆలయ శిఖరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆలయ శిఖరాన్ని స్వర్ణమయం చేసేందుకు సుమారు 11.50 కేజీల బంగారం అవసరమవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. ప్రస్తుత ఉన్న బంగారం ధర ప్రకారం దీనికి సుమారు రూ.7 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశామన్నారు. దాతల విరాళాలతో ఆలయాన్ని స్వర్ణమయం చేయనున్నట్టు తెలిపారు. కాగా, ఆలయాన్ని స్వర్ణమయం చేసేందుకు దాతల నుంచి విరాళాలు కోరుతూ దేవస్థానం అధికారులు ఇప్పటికే ప్రత్యేక అకౌంట్ తెరిచారు. ఆలయ శిఖరాన్ని స్వర్ణమయం చేసేందుకు పూర్తి సొమ్ము భరించి, ఎవరైనా దాత ముందుకు వస్తే అవకాశం ఇస్తామని అధికారులు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z