ఉదయం పెందలాడే నిద్ర లేవటం, రాత్రి పెందలాడే పడుకోవటం ఎంతో మంచిదని డాక్టర్లు తరచూ చెబుతున్నదే. ఇది భోజనానికీ వర్తిస్తున్నట్టు ఫ్రాన్స్ అధ్యయనం పేర్కొంటోంది. ఉదయం 8 గంటలకు తొలి భోజనం(అల్పాహారం)తో ఆరంభించి రాత్రి 8 గంటలకు చివరి భోజనంతో తిండి తినటాన్ని ముగిస్తే గుండె, రక్తనాళాలకు మేలు చేస్తున్నట్టు బయటపడింది మరి. రోజులో తొలి భోజనం ఆలస్యమవుతున్నకొద్దీ.. ప్రతి గంటకూ 6% చొప్పున గుండెజబ్బు ముప్పు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఉదాహరణకు- ఉదయం 8 గంటలకు అల్పాహారం చేసేవారితో పోలిస్తే ఉదయం 9 గంటలకు టిఫిన్ తినేవారికి 6% ఎక్కువగా గుండెజబ్బు వచ్చే అవకాశం ఉంటోందని తేల్చారు. ఇక రాత్రి 8 గంటలకు ముందే చివరి భోజనం చేసేవారితో పోలిస్తే రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేసేవారికి గుండెజబ్బు ముప్పు 28% ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. కాబట్టి ఆహారం విషయంలో అంతా జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కొక్కరి ఆహార అవసరాలు ఒక్కోలా ఉన్నప్పటికీ వేళకు తినటం, భోజనానికీ భోజనానికీ మధ్య తగినంత విరామం ఉండేలా చూసుకోవటం, పడుకునే ముందు మరీ ఎక్కువగా తినకపోవటం మంచిదని చెబుతున్నారు. ఈ అధ్యయన ఫలితాలు మనదేశం విషయంలో మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్షకు సగటున 235 మంది గుండెరక్తనాళ జబ్బు(సీవీడీ)తో మరణిస్తుండగా.. మనదేశంలో సగటున 272 మంది చనిపోతున్నట్టు 2020 నాటి గ్లోబల్ బర్డెన్ డిసీజ్ అధ్యయనం పేర్కొంటోంది. గుండెకు, మెదడుకు రక్త సరఫరా చేసే నాళాల్లో తలెత్తే పూడికలు, రుమాటిక్ గుండె జబ్బు వంటి వాటినీ గుండె రక్తనాళ జబ్బులుగానే పరిగణిస్తారు. వీటి మూలంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 1.86 కోట్ల మంది మృత్యువాత పడగా.. వీటిల్లో 79 లక్షల మరణాలకు అనారోగ్యకర ఆహారమే కారణం కావటం గమనార్హం. అల్పాహారం, చివరి భోజనం పెందలాడే పూర్తి చేస్తే రాత్రి పూట తగినంత సేపు ఉపవాసం ఉన్నట్టు అవుతుంది. అలాగే త్వరగా, క్రమం తప్పకుండా, నిర్ణీత వేళల ప్రకారం ఆహారం తీసుకోవటం వల్ల శరీరంలోని వివిధ అవయవాల జీవగడియారాలు సమ్మిళితమవుతాయి. ఇవి రక్తపోటు వంటి గుండె జీవక్రియ పనితీరు మీద ప్రభావం చూపుతున్నాయని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ఫలితంగా గుండెజబ్బుల ముప్పు సైతం తగ్గుతోందన్నమాట.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z