ప్రముఖ నటి, కళాభారతి డాక్టర్ జమున నటనా వైదుష్యంపై విశ్లేషణా ప్రసంగాలతో “మీరజాలగలడా నా యానతి” కార్యక్రమం అంతర్జాల వేదికగా ఘనంగా నిర్వహించారు. వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్ధల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత్, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియా, హాంకాంగ్, ఖతార్ , యుగాండా, కెనడా, అమెరికా దేశాల నుంచి దాదాపు 35 మంది ప్రఖ్యాత రచయితలు పాల్గొన్నారు. జమున నటించిన చిత్రాల నుంచి 35 ఆణిముత్యాల్లాంటి సినిమాలను ఎంపిక చేసుకుని.. అందులో ఆమె కనబరిచిన నటనా ప్రావీణ్యం, ఆయా పాత్రల్లో ఆమె ఇమిడిపోయిన తీరు గురించి విశ్లేషిస్తూ అద్భుతమై ప్రసంగాలు చేశారు.
ఈ కార్యక్రమంలో అమెరికాలో నివాసం ఉంటున్న జమున కుమారుడు వంశీకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొని.. తన మాతృమూర్తి చిత్ర పటం జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 7 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆసాంతం వీక్షించి, అందరి ప్రసంగాలను విని ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వంశీ -సింగపూర్ సంస్థలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమానికి సినీ రచయిత భువనచంద్ర ముఖ్య అతిథిగా హాజరై.. జమున నటనా ప్రభావ విశేషాలతో పాటు.. నిజ జీవితంలో ఆమె వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేశారు. హైదరాబాద్ నుంచి ప్రముఖ రచయితలు ఆచార్య టీ గౌరీ శంకర్, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, డాక్టర్ కేవీ కృష్ణకుమారి, డాక్టర్ తిరునగిరి దేవకీదేవి తదితరులు ప్రసంగించారు.
“తాము కార్యక్రమం ఉద్దేశాన్ని చెప్పగానే పది దేశాల నుంచి 35మంది రచయితలు ముందుకొచ్చి విశ్లేషణ వ్యాసాలను అందించడం చాలా సంతోషకరంగా ఉందని, త్వరలో ఈ వ్యాసాలు అన్నింటితో వంశీ ప్రచురణగా, పుస్తకాన్ని ప్రచురిస్తామని” కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు, వంశీ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు, సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. రచయిత్రి రాధిక మంగిపుడి, వంశీ అధ్యక్షురాలు డా తెన్నేటి సుధా దేవి, మేనేజింగ్ ట్రస్టీ శైలజా సుంకరపల్లి తదితరులు సహకరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z