రాజ్యసభ మాజీ సభ్యుడు, పద్మశ్రీ, పద్మభూషణ్, రెండు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ వ్రాశారు. ఎల్.కె.అడ్వాణీ, కర్పూరీ ఠాకూర్‌లకు భారరత్న ప్రకటించిన దరిమిలా మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావులను కూడా భారతరత్నకు సూచిస్తూ ఆయన ప్రధానికి ఈ లేఖ వ్రాశారు. సామాన్య గ్రామీణ కుటుంబాల్లో జన్మించి, స్వశక్తితో, సమర్థతో అత్యున్నత శిఖరాలు అధిరోహించి బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఈ ఇరువురు తెలుగు ముద్దుబిడ్డలు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నకు పూర్తిగా అర్హులని తన అభిప్రాయాన్ని ప్రధానికి తెలిపారు.
ప్రధానిగానే గాక, ఆర్థిక విప్లవ పితామహుడిగా పీవీ నిత్యస్మరణీయుడని, కాంగ్రెస్ కోటలను ఓటు దెబ్బతో బీటలు వార్చి 9నెలల్లో అధికారపగ్గాలు చేపట్టిన ఎన్‌టీఆర్ దేశవ్యాప్తంగా రాజకీయ పెను విప్లవాలకు పాలు పోశారని యార్లగడ్డ తన లేఖలో శ్లాఘించారు. MGRకు, ప్రణబ్ ముఖర్జీలకు భారతరత్న ఇచ్చారని, వారి కోవలో, వారి స్థాయిలోని ఈ ఇరువురు వ్యక్తులకు కూడా భారతరత్న ఇవ్వడం మోడీ హయాంలోనే పూర్తి కావాలని లక్ష్మీప్రసాద్ కోరారు. కర్పూరీ ఠాకూర్‌కు అనువాదకునిగా, అడ్వాణీకి సహచరుడిగా, పీవీకి ఆత్మీయుడిగా, ఎన్‌టీఆర్‌కు అభిమానిగా తాను ఈ లేఖను వ్రాస్తున్నానని, తన అభ్యర్థనను పరిశీలించి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానని లక్ష్మీప్రసాద్ ప్రధాని మోడీని కోరారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z