Business

యూనియన్ బ్యాంకులో 606 ఉద్యోగాలు-వాణిజ్యం

యూనియన్ బ్యాంకులో 606 ఉద్యోగాలు-వాణిజ్యం

* యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(Union Bank of India)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. వివిధ కేటగిరీల్లో మొత్తం 606 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వివిధ విభాగాల్లో చీఫ్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాల కోసం అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

*** నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..
విద్యార్హతలు: బీఎస్సీ/బీఈ/బీటెక్‌/ఎంసీఈ/ఎంటెక్‌/ఎమ్మెస్సీ (కంప్యూటర్స్‌)/గ్రాడ్యుయేషన్‌, సీఏ విద్యార్హతలతో పాటు గతంలో పనిచేసిన అనుభవం తప్పనిసరి.
ఆయా ఉద్యోగ హోదాలను అనుసరించి వయో పరిమితి కనిష్ఠంగా 20 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 45 ఏళ్ల వరకు ఉంది. ఫిబ్రవరి 1 వ తేదీని కటాఫ్‌ తేదీగా నిర్ణయించారు. ఆయా వర్గాలకు వయో పరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ: ఈ పోస్టులకు అందిన దరఖాస్తులు, అభ్యర్థుల అర్హతలను బట్టి ఆన్‌లైన్‌ పరీక్ష/గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ పరీక్ష ఇంగ్లిష్‌/హిందీలో ఉంటుంది.
పరీక్ష కేంద్రాలివే.. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, చండీగఢ్‌/మొహాలి, కోల్‌కతా, లఖ్‌నవూ, పట్నా, భువనేశ్వర్‌, భోపాల్‌, ముంబయి/నవీ ముంబయి/గ్రేటర్‌ ముంబయి/ఠానే, అహ్మదాబాద్‌/గాంధీనగర్‌
ఆన్‌లైన్‌ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జాబితా రూపొందించి పర్సనల్‌ ఇంటర్వ్యూలు/గ్రూప్‌ డిస్కషన్‌ నిర్వహిస్తారు. మెరిట్‌, రిజర్వేషన్‌ ఆధారంగా తుది జాబితాను విడుదల చేస్తారు. ఒకవేళ ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించకపోతే పర్సనల్‌ ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగానే ఎంపిక తుది జాబితాను ప్రకటిస్తారు.
ఈ పరీక్ష మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉంది.
ఆన్‌లైన్‌ పరీక్షలో ఒక తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు రుసుం జనరల్‌ /ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్థులకు రూ.850; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.175. పూర్తి వివరాలు ఈ కింది పీడీఎఫ్‌లో తెలుసుకోవచ్చు.

* ‘పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (PPBL)’పై ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో వ్యాపారులకు విక్రయదారుల సమాఖ్య కాయిట్‌ (కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌- CAIT) కీలక సూచన చేసింది. పేటీఎంకు (Paytm) బదులు లావాదేవీల కోసం చట్టబద్ధమైన ఇతర చెల్లింపు యాప్‌లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ఈ సలహా ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇది కేవలం సూచన మాత్రమేనని తెలిపింది. ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎంపై (Paytm) ఆందోళనలు రేకెత్తుతున్నాయని.. భద్రత విషయంలో చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారని కాయిట్‌ (CAIT) గుర్తుచేసింది. ఈ వేదిక అందించే ఆర్థిక సేవల కొనసాగింపుపైనా అనుమానాలు నెలకొన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిరంతరాయ లావాదేవీలు, వాటి భద్రత కోసం పేటీఎం నుంచి ఇతర యాప్‌లకు మారడం మేలని సూచించింది. డైరెక్ట్‌ యూపీఐ లావాదేవీలు, బ్యాంకులు అందించే పేమెంట్‌ యాప్‌లను ఉపయోగిస్తే మంచిదని చెప్పింది.

* మనీలాండరింగ్‌ జరుగుతుందన్న ఆందోళన, నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) నిబంధనల ఉల్లంఘనలతో పాటు పేటీఎం వ్యాలెట్‌, సంబంధిత బ్యాంక్‌ల మధ్య వందల కోట్ల రూపాయిల సందేహాస్పద లావాదేవీలు జరగడంతో పేటీఎం బ్యాంక్‌పై రిజర్వ్‌బ్యాంక్‌ నిషేధం విధించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తక్షణమే డిపాజిట్ల సేకరణను నిషేధించడంతో పాటు పరపతి లావాదేవీల నిర్వహణ, కస్టమర్‌ ఖాతాలకు టాప్‌అప్‌లు ఇవ్వడం, ప్రీపెయిడ్‌ సాధనాలు, వ్యాలెట్లు, కార్డులు జారీచేయడం తదితర పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌) నిర్వహించే కార్యకలాపాలను ఈ నెల 29 తర్వాత చేపట్టరాదని ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల ప్రకారం ఆ బ్యాంక్‌ ఖాతాదారులు ప్రస్తుత డిపాజిట్లను తీసుకోవడం, వారి వ్యాలెట్లలో నిల్వ ఉన్న సొమ్ముద్వారా చెల్లింపులు జరపడం ఫిబ్రవరి 29 వరకే చేయగలుగుతారు. అలాగే పీటీఎం వ్యాలెట్‌లోకి టాప్‌అప్‌ నిలిచిపోతుంది. దాని ద్వారా ఎటువంటి లావాదేవీలు జరగవు.

* యోగా గురువు బాబా రామ్‌దేవ్‌..తాజాగా ఐటీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తున్నది. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న టెక్నాలజీ సేవల సంస్థ రోల్టా ఇండియాను కొనుగోలు చేయడానికి పతంజలి ఆయుర్వేద ఆసక్తి చూపుతున్నట్లు ఎకనమిక్స్‌ టైం ప్రత్యేక కథనాన్ని ప్రచూరించింది. పుణెకు చెందిన ఆష్దాన్‌ ప్రాపర్టీస్‌ అత్యధిక బిడ్డింగ్‌ ప్రకటించిన తర్వాత పతంజలి ఆయుర్వేద సంస్థ రూ.830 కోట్ల నగదు ఆఫర్‌ చేసింది.

* ముఖేష్ అంబానీ భారతీయ మీడియా పరిశ్రమలో రికార్డ్‌ సృష్టించబోతున్నారు. అంబానీ దేశంలో రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు 100కి పైగా ఛానెల్‌లను కలిగి ఉండనున్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీని ముఖేష్ అంబానీ విలీనం చేయడం దాదాపు ఖాయమని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. స్టార్ ఇండియా, వయాకామ్ 18 విలీనం తర్వాత 100 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉంటుంది. ఒప్పందం తర్వాత, స్టార్-వయాకామ్‌లో రిలయన్స్ వాటా 2018లో 51 శాతానికి పెరుగుతుంది. మరోవైపు, డిస్నీలో ఈ షేర్ 40 శాతానికి చేరుకుంటుంది. ఉదయ్ శంకర్, జేమ్స్ మర్డోక్‌ల బోధి ట్రీ సిస్టమ్స్ 7-9 శాతం వాటాను సొంతం చేసుకోనున్నాయి. విలీనం తర్వాత ఈ యూనిట్‌లో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అందువల్ల, కొత్త కంపెనీకి అనుబంధ సంస్థలను తయారు చేయడంలో ఎటువంటి సమస్య ఉండదు. మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో స్టార్, వయాకామ్18 రూ. 25,000 కోట్ల ఆదాయాన్ని సేకరించాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z