Business

ఎయిర్‌టెల్ లాభం ₹2442కోట్లు – వాణిజ్య వార్తలు

ఎయిర్‌టెల్ లాభం ₹2442కోట్లు – వాణిజ్య వార్తలు

* ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.2,442.2 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ మొత్తం రూ.1588.2 కోట్లుగా ఉంది. నికర లాభంలో 54 శాతం వృద్ధి నమోదైందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 5.8 శాతం వృద్ధి చెందింది. రూ.35,804.4 కోట్లుగా ఉన్న ఆదాయం రూ.37,899.5 కోట్లకు పెరిగింది. ఎయిర్‌టెల్‌ దేశీయ ఆదాయం 11.4 శాతం పెరిగి రూ.27,811 కోట్లుగా నమోదైంది.

* నిర్ణీత గడువులోగా శాశ్వత సంఖ్య (PAN) పాన్‌ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం (PAN Aadhaar Link) చేసుకోని వారికి కేంద్రం ₹1,000 చొప్పున అపరాధ రుసుం విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫైన్‌ ద్వారా కేంద్రానికి ఇప్పటివరకు సమకూరిన ఆదాయం వివరాలను కేంద్ర ఆర్థికశాఖ సోమవారం వెల్లడించింది. గతేడాది జులై 1 నుంచి, 2024 జనవరి 31 వరకు రూ.601.97 కోట్లు వసూలుచేసినట్లు తెలిపింది. ఆధార్‌- పాన్‌ అనుసంధానంపై లోక్‌సభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మాలరాయ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అలాగే, పాన్‌తో అనుసంధానం కాని ఆధార్‌ కార్డుల సంఖ్య 2024 జనవరి 29 నాటికి దేశవ్యాప్తంగా 11.48 కోట్లు (మినహాయింపు వర్గాలు కాకుండా)గా ఉన్నట్లు పేర్కొన్నారు.

* పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (Paytm payments bank) భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్న వేళ.. కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ (Vijay Shekhar Sharma) ఉద్యోగులతో భేటీ అయ్యారు. కంపెనీ భవిష్యత్‌పై ఆందోళన చెందొద్దని, ఉద్యోగులకు ఎలాంటి ముప్పూ లేదని భరోసానిచ్చారు. కంపెనీలో ఎలాంటి లేఆఫ్‌లు చేపట్టడం లేదన్నారు. ఆర్‌బీఐతో సంప్రదింపులు జరుపుతామన్నారు. వివిధ బ్యాంకులతోనూ చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఉద్యోగులతో విజయ్‌ శేఖర్‌ శర్మ టౌన్‌హాల్‌లో మీటింగ్‌ నిర్వహించారు. దాదాపు 800-900 మంది ఉద్యోగులతో గంటకు పైగా మాట్లాడారు. సరిగ్గా ఏం జరిగిందనేది తెలీనప్పటికీ.. మరికొన్ని రోజుల్లో సమస్యలు పరిష్కరించుకోగలమని భరోసా ఇచ్చారు. ‘‘పేటీఎం కుటుంబంలో మీరంతా సభ్యులు. మీ ఉద్యోగాలపై ఆందోళన అవసరం లేదు’’ అని విజయ్‌శేఖర్‌ శర్మ చెప్పినట్లు కొందరు సీనియర్‌ ఉద్యోగులు తెలిపారు.

* బీజేపీయేత‌ర రాష్ట్రాలకు రావాల్సిన‌ జీఎస్టీ బ‌కాయిలు, ప‌న్ను వాటాల‌ను చెల్లించ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌధ‌రి చేసిన ఆరోప‌ణ‌ల‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తోసిపుచ్చారు. లోక్‌స‌భ‌లో సోమ‌వారం ఆమె మాట్లాడుతూ అధిర్ రంజ‌న్ ఆరోప‌ణులు రాజకీయ కోణంలో ఉన్నాయ‌ని త‌ప్పుప‌ట్టారు. రాష్ట్రానికో ర‌కంగా త‌న ఇష్టానుసారంగా నిబంధ‌న‌ల‌ను మార్చే హ‌క్కు త‌న‌కు లేద‌ని, ఇది త‌మ పార్టీ రాజ‌కీయాల‌కూ విరుద్ధ‌మ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ స్ప‌ష్టం చేశారు. త‌న‌కు నిబంధ‌న‌ల‌ను మార్చే బాధ్య‌త ఉండ‌ద‌ని, తాను నిబంధ‌న‌ల‌ను నూరు శాతం అనుస‌రించాల్సిందేన‌ని పేర్కొన్నారు. ప‌న్నుల వాటా రాష్ట్రాల మ‌ధ్య పంపిణీని ఫైనాన్స్ క‌మిష‌న్ నిర్ధేశిస్తుంద‌ని ఆమె వివ‌రించారు.

* రుణాలు, వాటి వడ్డీ – వాయిదాల చెల్లింపులతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ బైజూ’స్ తమ ఉద్యోగులకు జనవరి వేతనాలను చెల్లించింది. తాము ఎంతో శ్రమకోర్చి వేతనాలు చెల్లించామని బైజూ’స్ సీఈఓ బైజూ రవీంద్రన్ స్వయంగా తెలిపారు. కంపెనీ ఇన్వెస్ట‌ర్లు సృష్టించిన కృత్రిమ కొర‌త వ‌ల్లే ఆల‌స్య‌మైంద‌ని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z