Business

12 నుండి బంగారం బాండ్స్ ఇలా కొనుగోలు చేయవచ్చు-వాణిజ్య వార్తలు

12 నుండి బంగారం బాండ్స్ ఇలా కొనుగోలు చేయవచ్చు-వాణిజ్య వార్తలు

* పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై భారతీయ రిజర్వు బ్యాంక్‌ ఆంక్షలు విధించిన నేపథ్యంలో వినియోగదారులు ఇతర పేమెంట్‌ యాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఫోన్‌ పే, భీమ్‌-యూపీఐ, గూగుల్‌ పే డౌన్‌లోడ్స్‌ గణనీయంగా పెరిగాయి. ఫిబ్రవరి 3వ తేదీ ఒక్కరోజే ‘ఫోన్‌ పే’ను 2.79 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ‘యాప్‌ ఫిగర్స్‌’ సంస్థ వెల్లడించింది. గత వారంతో పోలిస్తే ఇది 45 శాతం పెరుగుదలని తెలిపింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 మధ్య మొత్తంగా 10.4 లక్షల డౌన్‌లోడ్స్‌ జరిగాయని నివేదికలో పేర్కొంది. వినియోగదారులు, వ్యాపారులను ఆకర్షించేందుకు కొంతకాలంగా ఫోన్‌ పే మార్కెటింగ్‌లో కొత్త విధానాలను అవలంబిస్తోంది. దీంతో గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ లో ఉచిత యాప్‌ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. తాజా గణాంకాల ప్రకారం జనవరి 31 నాటికి ప్లేస్టోర్‌లో ‘ఫోన్‌ పే బిజినెస్’ యాప్‌ 188వ స్థానంలో ఉండగా.. ఫిబ్రవరి 5న 33వ స్థానానికి చేరుకుంది. యాప్‌ స్టోర్‌లో 227 నుంచి 72కి ఎగబాకింది.

* బంగారంలో మదుపు చేయాలనుకునే వారి కోసం కేంద్రం తీసుకొచ్చిన సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ త్వరలో ప్రారంభం కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సబ్‌స్క్రిప్షన్‌ ఫిబ్రవరి 12న ప్రారంభమై.. 16 వరకు అందుబాటులో ఉంటుంది. బంగారం ధరను త్వరలో ఆర్‌బీఐ ఖరారు చేయనుంది. సబ్‌స్క్రిప్షన్‌ ముందు వారం చివరి మూడు పనిదినాల్లో 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ నిర్ణయించిన సగటు ధర ఆధారంగా గ్రాము రేటును ఆర్‌బీఐ నిర్ణయిస్తుంది. కనీసం 1 గ్రాము ఒక యూనిట్‌ కింద కొనుగోలు చేయాల్సిఉంటుంది. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్ఛేంజీల (NSE, BSE) ద్వారా SGB కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ కొనుగోలుపై రూ.50 డిస్కౌంట్‌ లభిస్తుంది. సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను నివాసితులు, ట్రస్ట్‌లు, హెచ్‌యూఎఫ్‌లు, స్వచ్ఛందసంస్థలు కొనుగోలు చేయొచ్చు. మైనర్ల తరఫున ఒక వ్యక్తి లేదా ఇతర వ్యక్తులతో జాయింట్‌గా కూడా కొనొచ్చు. బాండ్‌ నామమాత్రపు విలువపై సంవత్సరానికి 2.50% ఫిక్స్‌డ్‌ రేటుతో అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. బాండ్ల కాలవ్యవధి 8 ఏళ్లు. బాండ్ల మెచ్యూరిటీపై వచ్చే మూలధన లాభాలపై SGB పన్ను మినహాయింపును అందిస్తుంది. మూడేళ్ల ముందు బాండ్లను విక్రయిస్తే.. స్వల్పకాలిక మూలధన లాభాల కింద మీకు వర్తించే శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బంగారంలో పెట్టుబడి పెట్టేవారు గోల్డ్‌ బాండ్లను పరిశీలించొచ్చు.

*** ఆన్‌లైన్‌లో కొనుగోలు ఎలా?
* మీ నెట్‌బ్యాంకింగ్‌కు (ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్‌) లాగిన్‌ అవ్వండి.
మెనూలో ఈ సర్వీసెస్/ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే సెక్షన్‌లో ‘సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌’ ఆప్షన్‌ ఎంచుకోండి. (స్కీమ్‌ అందుబాటులో ఉన్నప్పుడు ఈ విండో తెరుచుకుంటుంది)
* టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ చదివి తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్‌ చేయండి.
* సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌కు అవరమైన వివరాలు ఇచ్చి డిపాజటరీ పార్టిసిపేట్‌ (ఎన్‌ఎస్‌డీఎల్‌ లేదా సీడీఎస్‌ఎల్‌)ను ఎంచుకోండి.
తర్వాత రిజిస్ట్రేషన్‌ ఫారాన్ని సమర్పించండి.
* రిజిస్ట్రేషన్‌ తర్వాత పర్చేజ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.
* మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న యూనిట్లు, నామినీ వివరాలు ఇవ్వాలి.
* మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా ప్రక్రియ పూర్తవుతుంది.

*** ఇలా కూడా చేయొచ్చు..
* నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా మాత్రమే కాకుండా ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ వెబ్‌సైట్‌, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (SHCIL), స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయలేనివారు దగ్గర్లోని బ్యాంక్‌ శాఖ, ఎంపిక చేసిన పోస్టాఫీసుకు వెళ్లి ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన యూనిట్లను అందులో పొందుపరిచి చెక్‌, డీడీ రూపంలో పేమెంట్‌ పూర్తి చేయాలి. ఆధార్‌, పాన్‌ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయం ఓ మోస్తరు లాభాలతో ప్రారంభమైన సూచీలకు ఐటీ షేర్లు దన్నుగా నిలిచాయి. దీంతో నిఫ్టీ 21,900 పాయింట్ల ఎగువన ముగిసింది. ఉదయం 71,970.82 (క్రితం ముగింపు 71,731.42) పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే ఒరవడిని కొనసాగించింది. ఇంట్రాడేలో 72,261.40 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 454.67 పాయింట్ల లాభంతో 72,186.09 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 157 పాయింట్ల లాభంతో 21,929.40 వద్ద స్థిరపడింది.

* దేశీయ మార్కెట్లలో ఐపీఓ సందడి కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లలో అనుకూల పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమవుతున్నాయి. కొత్త ఏడాదిలో ఇప్పటికే ఐదు కంపెనీలు రూ.3,266 కోట్లు మార్కెట్ల నుంచి సమీకరించగా.. తాజాగా మరో మూడు కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. రాశి పెరిఫెరల్స్‌, జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌.. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.1700 కోట్లు సమీకరించనున్నాయి. ఫిబ్రవరి 7న వీటి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమై.. 9న ముగియనున్నాయి. 2024లో ఐపీఓ మార్కెట్‌లో బుల్లిష్‌ ఔట్‌లుక్‌ ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కొత్త రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇదే అదునుగా నిధులు సమీకరించుకునేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గతేడాది సైతం మార్కెట్లో ఇదే ఉత్సాహం కనిపించింది. మొత్తం 58 కంపెనీలు రూ.52,637 కోట్ల నిధులను సమీకరించాయి. 2022లో 40 కంపెనీలు రూ.59,302 కోట్లు సమకూర్చుకున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ ఎల్‌ఐసీ అప్పుడే ఐపీఓకు వచ్చింది.

* వచ్చే 5-6 ఏళ్లలో భారత ఇంధన రంగంలోకి (Energy sector) 67 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) తెలిపారు. భారత ఇంధనరంగ వృద్ధిలో భాగస్వాములు కావాలని అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానించినట్లు చెప్పారు. భారత ఇంధన వారోత్సవాలను (India Energy Week) మంగళవారం ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థికవ్యవస్థ 7.5 శాతం వార్షిక వృద్ధి రేటుతో దూసుకెళ్తోందని మోదీ (Modi) అన్నారు. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో ఇంధన రంగంలో (Energy sector) భారత్‌ పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. 2045 నాటికి దేశ ఇంధన అవసరాలు రెట్టింపవుతాయన్నారు. ప్రపంచంలో భారత్‌ మూడో అతిపెద్ద ముడిచమురు, ఎల్‌పీజీ వినియోగదారు అని గుర్తుచేశారు. అలాగే ఎల్‌ఎన్‌జీ వినియోగంలో నాలుగో స్థానంలో ఉందని తెలిపారు.

* ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ పాలసీ విక్రయాలు 2024, ఫిబ్రవరి 6వ తేదీ నుంచే మొదలు అయ్యాయి.. ఈ రోజు నుంచే ఈ పాలసీ అందుబాటులోకి వచ్చింది.. యూనిట్ లింక్డ్ పాలసీల ద్వారా లైఫ్ కవర్ తో పాటు గా మీరు మీ దీర్ఘకాలికి లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు పెట్టుబడులు పెడుతుంది సంస్థ. ఒకే పాలసీ తో డబుల్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. ఎల్ఐసీ ఇండెక్స్ ఫండ్ ప్లాన్ అనేది ఒక యూనిట్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యూవల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఫిబ్రవరి 6వ తేదీన లాంఛ్ చేస్తున్నారు.. ఈ పాలసీ అనేది ఈ దేశంలో ఉండే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పాలసీని తీసుకొనేవారికి కనీసం కనీసం 90 రోజుల నుంచి 50 లేదా 60 ఏళ్ల వయసు వరకు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీస మెచ్యూరిటీ వయసు 18 ఏళ్లు. గరిష్ఠ మెచ్యూరిటీ వయసు 75 లేదా 85గా ఉంది. కనీస ప్రీమియం రేంజ్ ఏడాదికి రూ.30 వేలు. 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ తర్వాత పెట్టుబడి పెట్టిన యూనిట్స్ లో మీకు కావలసిన అమౌంట్ ను డ్రా చేసుకోవచ్చు.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z