Politics

కేంద్రంలో ఏ పార్టీకీ మెజార్టీ రాకూడదంటున్న జగన్-తాజావార్తలు

కేంద్రంలో ఏ పార్టీకీ మెజార్టీ రాకూడదంటున్న జగన్-తాజావార్తలు

* ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా సాగుతున్నాయి. పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ప్రధాన పార్టీల అధినేతలు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఢిల్లీకి పయనం అవనున్నారు. బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకుని.. అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలనున్నారు చంద్రబాబు. ఈ భేటీలో బీజేపీతో పొత్తు అంశంపై ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే టీడీపీ-జనసేన మధ్య పొత్తు కన్ఫామ్ అయ్యింది. ఇక బీజేపీ కూడా కలిసొస్తే బాగుంటుందని టీడీపీ, జనసేన అధినేతలు భావిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి ఏపీలో పోటీ చేశాయి. ఇప్పుడు ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం మిగిలి ఉండటంతో.. పొత్తుల అంశాన్ని తేల్చాలని డిసైడ్ అయ్యారు మూడు పార్టీల అగ్రనేతలు. టీడీపీతో జత కట్టేందుకు ఇంతకాలం ఊగిసలాడుతూ వస్తున్న బీజేపీ.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోందట. దాదాపు పొత్తు పెట్టుకుంటేనే బెటర్ భావిస్తోందట కమలం పార్టీ. ఈ క్రమంలోనే పొత్తులకు సంబంధించి సంకేతాలను టీడీపీ, జనసేన అధినేతలకు పంపించారట. చంద్రబాబు ఢిల్లీ టూర్‌లో ఈ పొత్తుల అంశం దాదాపు ఫైనల్ అవుతుంది. బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. 2014 మాదిరిగానే.. 2024లోనూ మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ పొత్తుల అంశంపై ఏ టర్న్ తీసుకుంటుందో మరో రెండు రోజుల్లో తేలిపోతుందని మాత్రం కన్ఫామ్‌గా చెప్పుకోవచ్చు.

* రాబోయే ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే సీఎం జగన్ మైండ్‌ బ్లాంక్ కావాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అన్నారు. మంగళవారం చిత్తూరు, గంగాధర, నెల్లూరు ‘‘ రా.. కదలిరా’’ సభల్లో జగన్‌పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చామని అన్నారు. పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది తన జీవితాశయమని తెలిపారు. పెరిగిన సంపద పేదలకు చేరాలనేది తన సంకల్పమని అన్నారు. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్‌వన్‌గా ఉండాలని చంద్రబాబు ఆకాక్షించారు. ఏపీలో హింసా రాజకీయాలు.

► వైసీపీను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
► రాతియుగం వైపు ఏపీ వెళ్లకుండా స్వర్ణయుగం వైపు వెళ్లాలి.
► ఓడిపోతామని తెలిసి జగన్ మానసిక ఆందోళనలో ఉన్నారు.
► వైసీపీ హయాంలో ప్రజలపై ధరల పెంపుతో పాటు పన్నుల భారం మోపారు.
► రాష్ట్రంలో హింసా రాజకీయాలు పెరిగిపోయాయి.
► ఏపీలో ఉపాధి లేక వలస వెళ్లే దుస్థితి ఉంది.
► వలంటీర్లకు తాము వ్యతిరేకం కాదు.. ప్రజలకు సేవ చేయాలి.
► వలంటీర్లు వైసీపీకు సేవ చేస్తే టీడీపీ అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టం.
► జగన్‌ను నమ్ముకుంటే వలంటీర్లు జైలుకు వెళ్లాల్సిందే.
► టీడీపీ అధికారంలోకి వస్తే.. వలంటీర్ ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
► వలంటీర్లలో జగన్‌ అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

* బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చిత్తుగా ఓడించినా సుమన్‌కు బుద్ది లేదన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ నోటి కొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయాల్లో ఈ తిట్లకు సృష్టి కర్త కేసీఆర్ అని, అధికారం తల కెక్కి అందర్నీ ఇష్టమొచ్చినట్టు కేసీఆర్ తిట్టారని, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మార్పు రావడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్‌కు భవిష్యత్ లేదని, ఆ పార్టీ ఖాళీ అవుతుందని ఎమ్మెల్యే వివేక్ వ్యాఖ్యానించారు.

* బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (BRS Chief KCR) తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణభవన్‌కు చేరుకున్న పార్టీ చీఫ్‌కు నిమ్మకాయ, గుమ్మడి కాయతో దిష్టి తీసి మంగళ హారతితో కార్యకర్తలు స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రావడంతో పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ తల్లి’, ప్రొఫెసర్ జయశంకర్‌ల విగ్రహాలకు కేసీఆర్ నివాళులు అర్పించారు. మరికాసేపట్లో కృష్ణా పరివాహక ప్రాంతం నేతలతో గులాబీ బాస్ సమావేశమవుతారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తే జరిగే నష్టం, చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై ప్రధానంగా చర్చించనున్నారు. పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్‌లోకే కేసీఆర్ లంచ్ చేయనున్నారు.

* ప్రముఖ సినీ నటుడు విజయ్‌ (Vijay) ఇటీవల రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ‘తమిళగ వెట్రి కట్చి’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ నెలకొల్పుతున్నట్టు స్వయంగా ప్రకటించారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై అగ్ర నటుడు రజనీకాంత్‌ (Rajinikanth) స్పందించారు. కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘లాల్‌ సలామ్‌’. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రజనీ మాట్లాడుతూ.. ‘విజయ్‌కు నా శుభాకాంక్షలు’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రజనీకాంత్‌ కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. అయితే, ఆరోగ్యం సహకరించకపోవడంతో వెనక్కి తగ్గినట్లు ప్రకటించారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే అంతర్గత కుమ్ములాటలతో ప్రాభవం తగ్గడం, ఇటీవల డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం) అధినేత విజయ్‌కాంత్‌ కన్నుమూయడంతో తమిళ రాజకీయాల్లో శూన్యం ఏర్పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావించారు. అధికార డీఎంకేను సీఎం స్టాలిన్‌, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ మరింత బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్న నేపథ్యంలో విజయ్‌ పార్టీని ప్రకటించి, తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని చెప్పిన ఆయన, ఆ తర్వాత జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి అభ్యర్థులు నిలబడతారని అన్నారు. మరో అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ కూడా ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీ స్థాపించి తమిళ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న సంగతి తెలిసిందే.

* ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి సీఎం జగన్‌ మానసిక ఆందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏర్పాటుచేసిన ‘రా.. కదలిరా’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అన్యాయం చేసిన భస్మాసురుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని పిలుపునిచ్చారు. ‘‘ఎన్నికల్లో ప్రజలు బటన్‌ నొక్కితే జగన్‌ మైండ్‌ బ్లాంక్‌ అవ్వాలి. జగన్‌ను నమ్ముకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాలని వాలంటీర్లను కోరుతున్నా. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కావాలనే వారిలో అభద్రతాభావం సృష్టిస్తున్నారు. వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే మేం వ్యతిరేకం కాదు. కానీ, వైకాపాకు సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాలంటీర్లకు రాజకీయాలొద్దు. మంచి పనులు చేసేవారికి సహకరిస్తాం.

* కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పూర్తి మెజారిటీతో రాకూడదని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడే రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకుంటారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..మనపై ఆధారపడే కేంద్ర ప్రభుత్వం ఉంటే ఏదైనా సాధించుకోవచ్చునని జగన్ అభిప్రాయపడ్డారు.

* ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ముందుందని తెలిపారు రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్ నజీర్.. మంగళవారం విజయవాడలో జరిగిన వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ 26వ వార్షిక స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఛాన్సలర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిగ్రీలు అందుకున్న విద్యార్థులకు, మెరిట్‌గా నిలిచిన విద్యార్థులను గవర్నర్ అభినందించారు. మరోవైపు.. ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం వైద్య విద్యకు పెద్ద పీట వేస్తోందన్న ఆయన.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఏపీ చాలా ముందు ఉందని కితాబిచ్చారు.. ఇక, కోవిడ్ సమయంలో వైద్యులు కీలకంగా వ్యవహరించారు.. కోవిడ్ మహమ్మారితో పోరాడి ఎంతోమంది ప్రాణాలను కాపాడారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో 1,0132 విలేజ్ హెల్త్ కేర్ క్లినిక్ లు ఏర్పాటు చేశారు.. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్నారని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌పై ప్రశంసలు కురిపించారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్.. 1,0142 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 53 ఏరియా హాస్పిటల్స్, 12 జిల్లా ఆసుపత్రులు, 11 టీచింగ్ హాస్పిటల్స్, 15 స్పెషాలిటీ హాస్పిటల్స్, 542 అర్బన్ పీహెచ్‌సీల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని వెల్లడించారు.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 3,257 వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయని ప్రశంసించారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంచారని పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలో ఏర్పటు అవుతోన్న 17 కొత్త మెడికల్ కాలేజీల్లో 5 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్ నజీర్.

* న్యాయవాదుల సంక్షేమ నిధి సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి.. న్యాయవాదుల గుమస్తాల సంక్షేమ నిధి చట్టం సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది.. ఇక, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఇచ్చిన మేనిఫెస్టోని 99 శాతం అమలు చేసిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌ విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారు.. గవర్నర్ ప్రసంగం అక్షరసత్యం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు.. విద్య తోనే పేదరికం నిర్మూలన జరుగుతుంది.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దేశానికి ఆదర్శం.. సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనే అన్నారు. తెలుగుదేశం సభ్యులకు అభివృద్ధి ఎక్కడుందో కుప్పం వస్తే చూపిస్తాం.. అని సవాల్‌ చేశారు. ఇక, సీఎం వైఎస్‌ జగన్‌ త్వరలోనే వెలుగొండ ప్రాజెక్ట్ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు అని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.

* అన్నమయ్య జిల్లాలో స్మగ్లర్ల దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ రామకృష్ణ.. అసలు ఆ ఘటన ఎలా జరిగిందో వివరించారు.. ఎర్రచందనం తరలిస్తున్నారన్న రహస్య సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ఘటన జరిగిందన్నారు.. ఆ సమయంలో పొరపాటుగా స్మగ్లర్ల వాహనం కానిస్టేబుల్ ను ఢీకొట్టిందన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. మృతుడు కానిస్టేబుల్ గణేష్ కుటుంబానికి ప్రభుత్వం 30 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిందని వెల్లడించారు.. అతని కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు. ఇక, ఈ ఘటనలో పరారైన ముగ్గురు స్మగ్లర్లు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా ఎస్పీ రామకృష్ణ.

* ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. దీంతో, పొత్తులపై ఆయా పార్టీలు చర్చలు ముమ్మరం చేస్తున్నాయి.. ఏపీలో ఇప్పటికే బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉందని.. రెండు పార్టీల నేతలు చెబుతున్నారు.. మరోవైపు.. టీడీపీ-జనసేన మధ్య కూడా పొత్తు కుదిరింది.. కానీ, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి నడుస్తాయా అనేది తేలాల్సి ఉండగా.. త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తులపై చంద్రబాబుతో మంతనాలు జరపనున్నారు బీజేపీ ఢిల్లీ పెద్దలు. ఈ నెల 8వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందంటున్నారు.. ఎనిమిదో తేదీన భేటీ కావాలని చంద్రబాబు – పవన్ కల్యాణ్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.. ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కల్యాణ్‌ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు.. మొత్తంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తులపై క్లారిటీ వస్తుందని నేతలు చెబుతున్నారు. 8వ తేదీన చంద్రబాబు హస్తినకు వెళ్తి చర్చలు జరిపితే.. 10వ తేదీన పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు.

* తెలంగాణలో అప్పుడే భానుడి భగభగలు మొదలయ్యాయి. వింటర్‌ సీజన్ పూర్తిగా పోకుండానే సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. ఎండలు ఎడతెరిపి లేకుండా మండిపోవడంతో హైదరాబాద్‌లోని మోండా మార్కెట్‌, హయత్‌నగర్‌, బేగంపేట ప్రాంతాల్లో మంగళవారం 36.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) గణాంకాల ప్రకారం, కాప్రా, సరూర్‌నగర్, చార్మినార్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌తో సహా అనేక ఇతర ప్రాంతాలలో కూడా గత 24 గంటల్లో ఉష్ణోగ్రతల స్థాయిలు 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగాయి. మంగళవారం ఉదయం 8.30 గంటలకు గత దశాబ్దంలో ఫిబ్రవరి 23, 2016న గమనించిన రికార్డు సగటు గరిష్ట ఉష్ణోగ్రతతో పోల్చితే నగరంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా ఉందని, దాదాపు ఐదు డిగ్రీల సెల్సియస్ తగ్గిందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కార్యాలయం నివేదించింది. ఉధృతమైన రోజులతో పాటు, రాత్రులు కూడా అసాధారణంగా వాతావరణం వేడిగా ఉంటోంది.

* తెలంగాణ ప్రభుత్వం చిల్డ్రన్ ఆఫ్ చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్‌ హైదరాబాద్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ధృవీకరణ పత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇంఛార్జి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఆయనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, ఇతర ఉన్నతాధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దల సంరక్షణ కరువైన, పేరెంట్స్ లేని ప్రభుత్వ ,ప్రైవేట్ చిల్డ్రన్ హోమ్స్ లో ఉన్న పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా బర్త్, కాస్ట్ , సదరం సర్టిఫికెట్లు ,ఆధార్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 2700 మంది పిల్లలకు సర్టిఫికెట్లు అందిస్తుంది జీహెచ్ఎంసీ. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సర్టిఫికెట్ పొందుతున్న పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, టీమ్ అంతా కలిసి 2700 మంది పిల్లలకు తక్కువ సమయంలో వివిధ రకాల సర్టిఫికెట్ లు అందిస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ ఉన్న శిశు విహార్ పిల్లలకు తల్లిదండ్రుల సంరక్షణ లేని పిల్లలకు ,బాధ్యత నుండి తప్పించుకున్న వారు ప్రభుత్వం మీద వేశారు.. ప్రభుత్వం తరుపున శిశు విహార్ రక్షణ గా నిలబడుతుందన్నారు. విద్యా, ఉపాధి, భవిష్యత్ లో సమాజంలో గుర్తింపు లేని వారికి ప్రభుత్వం గుర్తింపు ప్రామాణిక కార్డు ని ఇస్తుందన్నారు.

* మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని హర్దా టౌన్‌ (Harda Town) లో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా ఫ్యాక్టరీ (firecracker factory)లో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 65 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. ఫైరింజన్లు, సహాయక బృందాలు హుటాహుటినా సంఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. మంటలు చుట్టుపక్కల ఉన్న భవనాలకు కూడా విస్తరించడంతో పలువురు పరుగులు తీయగా, మరికొందరు ఫ్యాక్టరీలో చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. పరిస్థితిని సమీక్షించారు. హెలికాప్టర్ ద్వారా పరిస్థితిని అంచనా వేసి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులకు, అధికారులకు ఆదేశించారు. క్షతగాత్రుల తక్షణ చికిత్సకు భోపాల్, ఇండోర్‌లోని మెడికల్ కాలేజీలు, భోపాల్ ఏఐఐఎంఎస్ బర్న్ యూనిట్‌కు తరలించాలని అదేశాలిచ్చారు.

జింబాబ్వే టూర్కు భారత్.. ఐదు మ్యాచ్ల సిరీస్ షెడ్యూల్ ఖరారు..
త్వరలో టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టూర్.. టీ20 వరల్డ్‌కప్‌ 2024 ముగిసిన తర్వాత ఉండనుంది. అన్ని మ్యాచ్ లు హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో జరుగనున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను జింబాబ్వే క్రికెట్‌ బోర్డు మంగళవారం వెల్లడించింది. బీసీసీఐతో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ సిరీస్‌ ఖరారైనట్లు తెలుస్తుంది. జింబాబ్వే క్రికెట్‌ చైర్మన్‌ తవెంగ్వా ముకుహ్లానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ ట్విట్టర్ లో తెలిపాడు. అంతేకాకుండా.. ట్విట్టర్ లో ఇలా రాశాడు..’మా దేశంలో ఈ సంవత్సరం జరిగే అతిపెద్ద అంతర్జాతీయ ఈవెంట్‌ ఇదే. టీమిండియాకు ఆతిథ్యమిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా దేశ పర్యటనకు ఒప్పుకున్నందుకు బీసీసీఐకి ధన్యవాదాలు’ అంటూ తవెంగ్వా తెలిపాడు.

* ఇండియాలో డిజిటల్ చెల్లింపుల్లో ఒక సందర్భంలో వెలుగు వెలిగిన పేటీఎం ఇప్పుడు చీకట్లను ఎదుర్కొంటోంది. ఈ సంస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫెమా, ఫారెక్స్ ఉల్లంఘటన నేపథ్యంలో ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పేటీఎం కార్యకలాపాలను నిలిపేయాలని జనవరి 31న ఆదేశించింది. ఫిబ్రవరి 29 నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపింది. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా విచారణలోకి ఎంటరైంది. మరోవైపు ఆర్బీఐ అధికారులు కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ వర్మను కలిశారు. పేటీఎంకి సంబంధించిన లావాదేవీల గురించి సమాచారాన్ని సేకరించాలని ఈడీ అధికారులు ఆర్బీఐని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం UPI సేవలను కొనసాగిస్తుందా..? లేదా.? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై పేటీఎం సోమవారం క్లారిటీ ఇచ్చింది. తన యూపీఐ సేవలు సాధారణంగా పనిచేస్తాయని.. సేవల కొనసాగింపును నిర్ధారించడానికి బ్యాక్ ఎండ్‌లో మార్పుల కోసం కంపెనీ ఇతర బ్యాంకులతో కలిసి పనిచేస్తుందని తెలిపింది.

* మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఉపాసనను అందరూ ట్రోల్ చేసినవారే. ఆమె లుక్ చూసి చరణ్ కు సరైన జోడీ కాదని చెప్పుకొచ్చారు. ఆ తరువాత పదేళ్లుగా వీరికి పిల్లలు లేకపోవడంతో ఆమెకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ట్రోల్ కూడా చేశారు. ఇక ఉపాసన తన వ్యక్తిత్వంతో అందరి మనసులను గెలుచుకుంది. మెగా కోడలిగా బాధ్యతలు చేపడుతూనే.. ఇంకోపక్క అపోలో బాధ్యతలు చేపట్టి సేవలు అందిస్తుంది. ఇక పదేళ్ల తరువాత చరణ్ – ఉపాసన క్లింకారకు జన్మనిచ్చారు. ఇప్పటివరకు తామెందుకు తల్లిదండ్రులు కాలేదో ఆమె ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి ఆ విషయాన్నీ గుర్తుచేసింది. “ప్రతి మహిళ తల్లి కావడం చాలా గ్రేట్ అనుకుంటారు. కానీ, నా దృష్టిలో డబుల్ గ్రేట్. నేను ఇంకా తల్లిని కాలేదని చాలామంది అన్న మాటలు నావరకు వచ్చాయి. చరణ్, నేను ముందే అనుకున్నాం. మేము మా బిడ్డకు అన్ని సమకూర్చేవరకు తల్లిదండ్రులు కాకుండదని నిర్ణయించుకున్నాం. అందుకే ఇన్నేళ్లు ఆగాము. ఇక చరణ్ తో నాకున్న బాండింగ్ గురించి చెప్పాలంటే.. అతను నాకెప్పుడూ చెప్పేది ఒకటే.. ప్రేమలో పడకు.. ప్రేమలో ఎదుగుదాం. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం అనే చెప్తాడు. మా ఇద్దరి మధ్య చాలా హద్దులు ఉన్నాయి. నేను తన పని విషయంలో జోక్యం చేసుకోను. నా వర్క్ విషయంలో తను కలుగజేసుకోడు. పర్సనల్ విషయాల్లో మేము ఒక్కటే” అని ఉపాసన చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం OG. DVV ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా.. శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో పవన్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా కనిపిస్తున్నాడు. ఒక పక్క రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే పవన్ ఈ సినిమాను పూర్తిచేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. దాదాపు 70 % వరకు షూటింగ్ ను ఫినిష్ చేశారు. మధ్యలో పవన్ ఏపీ ఎలక్షన్స్ ఉండడంతో కొంత బ్రేక్ ఇచ్చాడు. ఇక ఈలోపు మేకర్స్.. సినిమాపై హైప్ పెంచడం కోసం ప్రమోషన్స్ షురూ చేశారు. ఇక తాజగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 27 న OG ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అంతేకాకుండా ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో పవన్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ లా కనిపించాడు. బ్లాక్ కలర్ కార్ ముందు బ్లాక్ కలర్ సూట్, చేతిలో టీ గ్లాస్.. గాగుల్స్ తో అల్ట్రా స్టైలిష్ గ్యాంగ్ స్టర్ లా కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి అలాంటోడు మళ్లీ వస్తున్నాడు అంటే.. ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

* హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గరలో ఉన్న ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఉన్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ లో ఒక స్టాల్ నడిపే దాసరి సాయి కుమారి కుమారి ఆంటీగా సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ అయిపోయింది. ఆమె స్టాల్ దగ్గరికి యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా క్యూ కడుతున్నాయి అంటే ఆమె క్రేజ్ సోషల్ మీడియాలో ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమెకు అంత క్రేజ్ రావడంతో ఆమెను బిగ్ బాస్ లోకి తీసుకుంటారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు ఆమె ముందు ఉంచారు. మిమ్మల్ని బిగ్ బాస్ లోకి తీసుకోవాలని కూడా అడుగుతున్నారు చాలామంది దానిపై మీ అభిప్రాయం ఏమిటి అని ఆమెను అడిగితే బిగ్ బాస్ అంటే ఏమిటి అది ఏమైనా వంటల ప్రోగ్రామా అని ఆమె ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. ఖాళీగా ఉండే యూత్ కి లేదా మీడియాకి బిగ్ బాస్ మీద అవగాహన ఉంటుంది కానీ ఉదయం లేస్తే తన పని తాను చూసుకునే దాసరి సాయి కుమారి లాంటి వాళ్లకి బిగ్ బాస్ తో పనేం ఉంటుంది? టైం పాస్ చేయడానికి చూసేవారికి ఇలాంటి బిగ్ బాస్ షోలు కావాలి కానీ. మొత్తం మీద ఆ ప్రశ్న అడిగిన వారెవరో తెలియదు కానీ వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చే విధంగా కుమార్ ఆంటీ సమాధానం ఉంది. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z