Health

మూత్రంలో రక్తం పడుతోందా?

మూత్రంలో రక్తం పడుతోందా?

కిడ్నీలు.. మన శరీరంలోని విషతుల్యమైన పదార్థాలను వడపోసి మూత్రం ద్వారా బయటికి పంపుతాయి. హార్మోన్లు, ఎంజైమ్స్‌ విడుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి మనిషికీ చిక్కుడు గింజ ఆకారంలో రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఒక్కో మూత్రపిండంలో 10 లక్షల నుంచి 12 లక్షల ఫిల్టర్లు ఉంటాయి. రక్తాన్ని వడపోస్తూ అందులోని వ్యర్థాలను తొలగించడమే వీటి పని. ఈ ప్రక్రియలో భాగంగా కొంత ప్రొటీన్‌ మూత్రం ద్వారా బయటికి వెళ్తుంది. ఈ ప్రొటీన్‌ ఎక్కువ మోతాదులో బయటికి వెళ్లినప్పుడు కిడ్నీలు ‘గ్లోమెరులార్‌’ వ్యాధికి గురవుతాయి. తీవ్రంగా దెబ్బతింటాయి కూడా. ఈ వ్యాధికి సంబంధించి లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అత్యాధునిక ఔషధాలు, సమర్థమైన చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

Kidney Diseases | రక్తాన్ని వడపోయడంలో అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి కిడ్నీలు. వాటిలోని సూక్ష్మమైన రక్తనాళికలు ఒక గుచ్ఛంలా ఏర్పడి ఉంటాయి. ఆ సముదాయాన్నే ‘గ్లోమెరులార్స్‌’ అంటారు. వాడుక భాషలో ‘ఫిల్టర్స్‌’ అనీ పిలుస్తారు. ఒక్కో కిడ్నీలో 10లక్షల నుంచి 12లక్షల వరకు గ్లోమెరులార్స్‌ ఉంటాయి. తక్కువ బరువుతో పుట్టే పిల్లల్లో జన్మతః ఫిల్టర్లు తక్కువ సంఖ్యలో ఉంటాయి. వయసు పెరుగుతున్నప్పుడు కూడా ఫిల్టర్ల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. అయినా కిడ్నీల పనితనంలో ఎలాంటి మార్పూ ఉండదు. ఏదైనా కారణం వల్ల ఈ ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు, మూత్రం ద్వారా ఎక్కువ మోతాదులో ప్రొటీన్‌ బయటికి వెళ్లిపోతుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బ తింటాయి. సాధారణంగా, ఎవరికైనా 20-50 మిల్లీగ్రాముల ప్రొటీన్‌ మూత్రంలో పోవడం సహజమే. అంతకు మించి.. అంటే, ఒక గ్రాము లేదా అంతకంటే ఎక్కువ వెళ్లిపోతే మాత్రం సదరు రోగికి కిడ్నీ సమస్యలు ఉన్నాయనిచెప్పవచ్చు. మూడు గ్రాములకు మించి ప్రొటీన్‌ విడుదలైన ప్పుడు దాన్ని ‘నెఫ్రోటిక్‌ సిండ్రోమ్‌’ అంటారు. ఈ రుగ్మత అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయసు వారికైనా రావచ్చు. రక్తంలో ప్రొటీన్‌ అనేది చాలా అవసరం. మోతాదుకు మించి బయటికి పోయినప్పుడు కిడ్నీలు విఫలం అవుతాయి. ‘గ్లోమెరులార్‌’ వ్యాధి తత్వమే ఇది. ఫలితంగా అనేకానేక రుగ్మతలు చుట్టుముడతాయి. గ్లోమెరులార్‌ వ్యాధులు ప్రధానంగా పది రకాలు. అందులో ఎక్కువ శాతం కనిపించేవి..

1. ఐజీఏ నెఫ్రోపతి
ఇది నిపుణులు మొట్టమొదట గుర్తించిన గ్లోమెరులార్‌ వ్యాధి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. కొంతమందిలో ఈ జబ్బు సోకిన వెంటనే, అతి వేగంగా ముదురుతుంది. వ్యాధిని గుర్తించేలోపే జరగరాని నష్టం జరిగిపోతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో 70 శాతం మందికి ఐజీఏ నెఫ్రోపతి వల్లనే మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఈ మధ్యకాలంలో యువత సైతం ఈ వ్యాధి బారిన పడుతున్నది. సాధారణంగా రుగ్మత లక్షణాలు పైకి పెద్దగా కనిపించవు. దీంతో వ్యాధి తీవ్రతను చాలామంది ఆలస్యంగా గుర్తిస్తారు.

అప్పటికే కిడ్నీలు విఫలం అయిపోయి ఉంటాయి. ముఖ్యంగా ఈ వ్యాధి వల్ల రక్తపోటు పెరుగుతుంది. అందుకని, నలభై ఏండ్లలోపు వారిలో అధిక రక్తపోటు సమస్యలు కనిపిస్తే.. వెంటనే మూత్రపిండ పరీక్షలు చేయించుకోవాలి. ప్రొటీన్‌, ఎర్ర రక్తకణాలు మూత్రంలో ఎక్కువగా పోతున్నట్టు గుర్తిస్తే గ్లోమెరులార్‌ రుగ్మతతో బాధపడుతున్నట్టు అనుమానించాల్సి ఉంటుంది. సాధారణంగా రక్తంలో క్రియాటిన్‌ 1.2 ఎంజీ ఉండాలి. అలా కాకుండా 1.3 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కిడ్నీ సమస్య ఉన్నట్టు.

2. మె్ంరబ్రేనస్‌ నెఫ్రోపతి
ఐజీఏ నెఫ్రోపతి తరువాత ఎక్కువగా కనిపించే కిడ్నీ వ్యాధి. ఇది కూడా స్త్రీ, పురుషులు ఇద్దరిలో రావచ్చు. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది.

3. ల్యూపస్‌ నెఫ్రోపతి
మహిళల్లో ఎక్కువగా వచ్చే వ్యాధి. అందుకని వారిలో రక్తపోటు అకస్మాత్తుగా పెరిగిపోతే .. వెంటనే కిడ్నీ పరీక్షలు చేయించడం ఉత్తమం. మూత్రంలో ప్రొటీన్‌ ఎక్కువ మోతాదులో పోతున్నట్లు నిర్ధారణ జరిగినా కూడా.. కిడ్నీ సమస్యగా గుర్తించి
తదుపరి పరీక్షలు చేయించాలి. వ్యాధి దశను కచ్చితంగా గుర్తించి, చికిత్స అందించాలి.

4. ఎంసీడీ నెఫ్రోపతి
మినిమల్‌ చేంజ్‌ డిసీజ్‌.. ఎంసీడీ నెఫ్రోపతి అనేది చిన్నపిల్లల్లో వచ్చే కిడ్నీ వ్యాధి. తొలిదశలోనే కనిపెట్టి, కచ్చితమైన వైద్యం చేయించాలి.

5. అమైలైడోసెస్‌ నెఫ్రోపతి
ఈ వ్యాధి వృద్ధుల్లో ఎక్కువగా వస్తుంది. నలభై దాటిన తరువాత కనీసం సంవత్సరానికి ఒక సారైనా కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించుకోవాలి.

6. ఎక్లాంప్సియా నెఫ్రోపతి
ఇది గర్భిణులలో వస్తుంది. వారిలో అకస్మాత్తుగా రక్తపోటు పెరిగిపోతుంది. అందుకే, అసాధారణంగా పెరిగే బీపీని నిర్లక్ష్యం చేయకూడదు.

అందుబాటులోని చికిత్సలు..
వ్యాధి ప్రారంభ దశ అయితే.. మందులతో చికిత్స చేయవచ్చు. మొదటి దశలో ఉన్నప్పుడు మాత్రమే ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాధి రెండో దశకు చేరితే డయాలసిస్‌ చేయాల్సి ఉంటుంది. వ్యాధి చివరి దశ లేదా మూడో దశకు చేరితే.. కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గం. పరిస్థితి అంతవరకు రాకుండా జాగ్రత్త పడాలి.

*** నిర్ధారణ పద్ధతులు
అల్ట్రాసౌండ్‌
కిడ్నీ బయాప్సీ పరీక్ష
ప్రొటీన్‌ టెస్ట్‌
ఆర్‌బీసీ
వ్యాధి లక్షణాలు

*** తొలిదశలో లక్షణాలు తెలియవు.
కాళ్ల వాపు.
ముఖం వాపు.
హైపర్‌ టెన్షన్‌ (రక్తపోటు పెరగడం).
మూత్రంలో రక్తం.
ప్రధాన కారణాలు

*** వంశపారంపర్యం.
హెపటైటిస్‌-బి వంటి ఇన్ఫెక్షన్లు.
రోగ నిరోధక శకి ్త(ఇమ్యునాలజికల్‌) సంబంధమైన వ్యాధులు.
పెయిన్‌ కిల్లర్స్‌ అధికంగా వాడటం.
క్యాన్సర్‌ వల్ల కూడా రావచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z