Business

మాంసాహారం ధరలు తగ్గి కూరగాయలు ధరలు పెరుగుతున్నాయి-వాణిజ్య వార్తలు

మాంసాహారం ధరలు తగ్గి కూరగాయలు ధరలు పెరుగుతున్నాయి-వాణిజ్య వార్తలు

* పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై (PPBL) ఆర్‌బీఐ (RBI) ఆంక్షలు విధించడంతో వాటి నుంచి బయటపడేందుకు కంపెనీ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే సంస్థ సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ (Vijay Shekhar Sharma) కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. మంగళవారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)తో సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేవలం 10 నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకునేది ఏమీ లేదని ఆర్థిక మంత్రి చెప్పినట్లు సమాచారం. ఆర్‌బీఐతోనే సమస్యను పరిష్కరించుకోవాలని, వారి మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్మలమ్మ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు, రెగ్యులేటరీ ఆంక్షలపై చర్చించేందుకు ఆర్‌బీఐ అధికారులతోనూ విజయ్‌ శర్మ సమావేశమైనట్లు సమాచారం.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన అనుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గుచూపడమే ఇందుకు కారణం. ఉదయం 72,548.50 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 72,186.09) సెన్సెక్స్‌ లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 71,938.22 – 72,559.21 పాయింట్ల మధ్య చలించింది. చివరికి 34.09 పాయింట్ల నష్టంతో 72,152 వద్ద ముగిసింది. నిఫ్టీ 1 పాయింట్‌ లాభపడి 21,930.50 వద్ద స్థిరపడింది.

* పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. వంటగ్యాస్‌ మొదలు, బియ్యం, పప్పులు, కూరగాయల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో వంటింటి ఖర్చు తడిసి మోపెడవుతోంది. ముఖ్యంగా శాకాహార భోజనం ఖర్చు మరింత పెరిగింది. అదే సమయంలో మాంసాహారం ఖర్చు తగ్గినట్లు ఓ నివేదిక వెల్లడించింది. గతేడాది జనవరితో పోలిస్తే వెజిటేరియన్‌ భోజనం ఖర్చు 5 శాతం పెరిగితే.. నాన్‌ వెజ్‌ భోజనం 13 శాతం తగ్గిందని క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌ అధ్యయనం తెలిపింది. తాజాగా ‘రైస్‌ అండ్‌ రోటీ’ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. దేశంలో బియ్యం, పప్పులు, ఉల్లిపాయలు, టమాటా ధరలు పెరగడంతో జనవరిలో ఇంట్లో వండుకునే శాకాహార భోజనం ధరలు పెరిగినట్లు క్రిసిల్‌ విశ్లేషించింది. పౌల్ట్రీ ధరలు తగ్గడంతో నాన్‌వెజ్‌ భోజనం ధరలు తగ్గడానికి దోహదం చేసిందని పేర్కొంది. శాకాహార భోజనం ధరల పెరుగుదలలో ఉల్లి, టమాటా ధరలు ప్రధాన కారణమని తెలిపింది. ఏడాదిలో ఉల్లి ధరలు 35 శాతం, టమాటా ధరలు 25 శాతం పెరిగినట్లు విశ్లేషించింది. వీటికితోడు బియ్యం ధరలు 14 శాతం, పప్పుల ధరలు 21 శాతం మేర పెరిగినట్లు నివేదిక పేర్కొంది. శాకాహార భోజనం పెరుగుదలలో బియ్యం 12 శాతం, పప్పులు 9 శాతం చొప్పున కారణమవుతున్నాయి.

* దేశ ఔషధ రాజధానిగా, లైఫ్‌సైన్సెస్‌ హబ్‌గా పేరుగాంచిన హైదరాబాద్‌ కీర్తి రానున్న రోజుల్లో మసకబారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ పెట్టుబడుల విషయంలో ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు తాజాగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా పోటీ మొదలైంది. దీనికితోడు హైదరాబాద్‌ ఫార్మాసిటీపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నది. దీంతో పలు కంపెనీలు యూపీ, ఏపీలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి కేంద్రీకరించాయి. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషిచేస్తుంటే.. తెలంగాంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ‘నిమ్మకు నీరెత్తినట్టు’ వ్యవహరిస్తున్నది.

* భార‌త్‌లో నోకియా ఫోన్ల‌ను త‌యారుచేస్తున్న హెచ్ఎండీ సొంత బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేయ‌నుంది. ఈ ఏడాది న్యూ స్మార్ట్‌ఫోన్‌ను దేశీ మార్కెట్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేలా హెచ్ఎండీ స‌న్నాహాలు చేప‌ట్టింది. సొంత బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌పై హెచ్ఎండీ ఫోక‌స్ పెట్టిన క్ర‌మంలో భార‌త్ మార్కెట్లో నోకియా ప‌రిస్ధితి ఏంట‌నే వార్త‌లు త‌లెత్తుతున్నాయి. హెచ్ఎండీ స్మార్ట్‌ఫోన్లు మొబైల్ వ‌రల్డ్ కాంగ్రెస్ 2024 వేదిక‌గా లాంఛ్ చేసేందుకు కంపెనీ క‌స‌ర‌త్తు సాగిస్తోంది. త‌మ సొంత బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసినా నోకియాతో త‌మ అనుబంధం కొన‌సాగుతుంద‌ని హెచ్ఎండీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ర‌వి క‌న్వ‌ర్ స్ప‌ష్టం చేశారు.

* రోగ్య‌, ట‌ర్మ్ బీమా పాల‌సీల‌పై ప్ర‌స్తుతం 18 శాతం ఉన్న జీఎస్టీని తగ్గించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఫైనాన్స్ స్టాండింగ్ క‌మిటీ సూచించింది. జీఎస్టీ అధికంగా ఉండ‌టంతో ప్రీమియం భారం ప‌డుతున్నందున సామాన్యులు బీమా పాల‌సీలు పొంద‌డంపై అది ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతు్న‌ద‌ని జ‌యంత్ సిన్హా అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన క‌మిటీ నివేదిక వెల్ల‌డించింది. ఈ నివేదిక‌ను ప్ర‌భుత్వం పార్ల‌మెంట్ ముందుంచింది. ఇన్సూరెన్స్ జ‌న సామాన్యానికి మ‌రింత అందుబాటులోకి రావాలంటే పాల‌సీల‌పై జీఎస్టీ రేట్‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించాల‌ని నివేదిక ప్ర‌భుత్వానికి సూచించింది. 2020లో ప్ర‌పంచ బీమా మార్కెట్‌లో భార‌త్ వాటా కేవ‌లం 2 శాతం కాగా, పురోగామి ఆర్ధిక వ్య‌వ‌స్ధ‌ల‌తో పోలిస్తే మ‌న బీమా మార్కెట్ దీటుగా ఎదిగేందుకు చాలా దూరం వెళ్లాల్సి ఉంద‌ని నివేదిక స్ప‌ష్టం చేసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z