* ఈ ఏడాది చివరికి భారత్‌లో 75వేల మంది మహిళా డెవలపర్లకు నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ (Microsoft) అధినేత సత్య నాదెళ్ల (Satya Nadella) ప్రకటించారు. భారత పర్యటనలో ఉన్న ఆయన గురువారం బెంగళూరులోని ‘మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్’ నిర్వహించిన డెవలపర్ల సమావేశంలో పాల్గొన్నారు. కృత్రిమ మేధ (AI) ఆవిష్కరణను మరింత వేగవంతం చేయడంలో భారత డెవలపర్ల పాత్ర కీలకమని ఆయన తెలిపారు. ఈసందర్భంగా మైక్రోసాఫ్ట్ నిర్వహిస్తున్న ‘కోడ్ విత్‌అవుట్ బ్యారియర్స్ (Code Without Barriers)’ ప్రోగ్రామ్ గురించి నాదెళ్ల కీలక ప్రకటన చేశారు. ‘‘ఈ ప్రోగ్రామ్‌ను భారత్‌లోనూ చేపట్టాలని నిర్ణయించాం. దీనిద్వారా 2024 చివరికి 75వేల మంది మహిళా డెవలపర్లకు నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నాం. ఈనెల నుంచే దీన్ని ఆరంభించనున్నాం. దీంతో మహిళా డెవలపర్లు (women developers), కోడర్లు, టెక్నికల్ రోల్స్‌లో పనిచేసే యువతులకు మరిన్ని నెట్‌వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి’’ అని ఆయన వెల్లడించారు.
* జగన్‌ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని జనసేన నేత, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీపై స్పందించారు. ‘‘ఏపీలో ఇసుక విధానం జగన్ దోపిడీ కోసమే అన్నట్టుగా ఉంది. తరచుగా ఇసుక పాలసీని మార్చి, కృత్రిమ కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా చేశారు. జేపీ సంస్థతో పాటు మరికొన్ని సంస్థలు సబ్ కాంట్రాక్టులు తీసుకున్నాయి. కొన్ని జిల్లాల్లో వైకాపా నాయకుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయి. బంగారం ధర తగ్గుతుందేమో కానీ, ఇసుక ధర మాత్రం తగ్గడం లేదు. పర్యావరణ అనుమతులు లేకుండానే తవ్వకాలు జరగుతున్నాయి. పేదలకు పెత్తందారులకు పోరాటం అని చెప్పే జగన్.. రీచ్‌లపై ఆధారపడిన పేదల ఆదాయానికి గండి కొట్టారు. కార్పొరేట్ సంస్థ ద్వారా రూ.వందల కోట్లు జేబుల్లో వేసుకుంటున్నారు.
* సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు (YSRCP) గట్టి షాక్ తగలబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ (TDP) 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకోబోతోంది. వైకాపా 8 స్థానాలకు పరిమితం కానుంది. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట ఇండియాటుడే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను గురువారం వెల్లడించింది. 2023 డిసెంబర్ 15 నుంచి జనవరి 28 వరకు సర్వే నిర్వహించినట్లు తెలిపింది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన వైకాపా.. 22 లోక్‌సభ స్థానాలనూ గెలుచుకుంది. తెదేపా 3 స్థానాలకే పరిమితమైంది. ఈసారి ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కానున్నాయని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. 45 శాతం ఓటింగ్‌తో తెలుగుదేశం పార్టీ 17 లోక్‌సభ స్థానాలను గెలుచుకోబోతోందని పేర్కొంది. వైకాపా 41 శాతం ఓటింగ్‌తో 8 స్థానాలకు పరిమితం కానుందని తెలిపింది.
* హిమాచల్ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) బీర్ బిల్లింగ్‌లో (Bir Billing) ప్రమాదం చోటుచేసుకుంది. ట్రెక్కింగ్‌కు (Trekking) వెళ్లిన ఇద్దరు యువతీయువకులు మంచులో కూరుకుపోయి తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగ్గా.. వారివెంట వెళ్లిన జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన శునకం ఆ మృతదేహాలను గుర్తించడంలో సాయపడింది. దాదాపు 48 గంటలపాటు వాటి దగ్గరే ఉంటూ బిగ్గరగా మొరుగుతూనే ఉంది. అది గమనించిన సహాయక బృందాలు వాటిని వెలికితీశాయి. మృతులను పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన అభినందన్ గుప్త (30), పుణెకి చెందిన ప్రణీత (26)గా గుర్తించారు.
* తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ‘శంఖారావం’పై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఉత్తరాంధ్ర నుంచి ‘శంఖారావం’ ప్రారంభం కానుందని, యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో పర్యటించేలా ప్రణాళికలు ఉంటాయన్నారు.
* కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిటింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు (TS High Court) చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. విశ్రాంత జడ్జితో విచారణ జరిపించుకోవాలని సూచించినట్లు చెప్పారు. ఉన్నత న్యాయస్థానం చెప్పిన అంశంపై మంత్రివర్గంలో లేదా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
* గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంపై భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ప్రసంగం విశ్వాసం కల్పించలేకపోయిందని.. ప్రభుత్వ విజన్‌ను ఆవిష్కరించలేకపోయిందన్నారు. ప్రభుత్వ హామీలు, గ్యారంటీల అమలుపై స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు
* ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సొంత నిధులతో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పనులు చేపడుతుంటే.. వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్ లేపాక్షి మండలం సిరివరం గ్రామంలో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. వైకాపా పాలనలో ప్రజాప్రతినిధులకు సైతం రక్షణ కరవైందని విమర్శించారు.
* నిర్మల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై యువతిని కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. జిల్లాలోని ఖానాపూర్ పరిధి శివాజీనగర్‌లో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
* దేశ రాజధాని దిల్లీ (Delhi) శివార్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నోయిడా (Noida), గ్రేటర్ నోయిడా పరిధిలోని రైతులు (Farmers Protest) పార్లమెంట్ (Parliament) ముట్టడికి బయల్దేరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి.
* అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Raj gopal Reddy) తెలిపారు. శాసనసభ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తనకు అధిష్ఠానం హామీ ఇచ్చిందని.. హోంశాఖ ఇవ్వాలని కోరుతున్నానని చెప్పారు.
* కాంగ్రెస్ పాలనపై భారాస ఎమ్మెల్సీ కవిత చేసిన విమర్శలపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కౌంటర్ ఇచ్చారు. ఆమె మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడారు.
* ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తనకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఇటీవల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం నాకు భద్రత కల్పించడం లేదంటే నా చెడు కోరుకున్నట్లే కదా?’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ జిల్లాలో పర్యటించే సమయంలో ఆమెకు భద్రత పెంచుతామని జిల్లా ఎస్పీ ప్రకటన విడుదల చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z