* హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో కస్టడీ కన్పెషన్ స్టేట్‌మెంట్ కీలకంగా మారింది. తన వాంగ్మూలంలో మరో ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పలువురి ఒత్తిడి మేరకే అక్రమాలకు పాల్పడినట్లు బాలకృష్ణ అంగీకరించారు. అక్రమాల చిట్టాను బయటపెట్టారు. ఐఏఎస్ అధికారి చెప్పిన ఫైళ్లు వెంటనే క్లియర్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఐఏఎస్‌ను విచారించేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం,కోర్టు అనుమతిని ఏసీబీ కోరనుంది. ఇప్పటికే శివ బాలకృష్ణ వద్ద డాక్యుమెంట్ లెక్కల ప్రకారం 250 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 214 ఎకరాలు భూములను ఏసీబీ గుర్తించింది. బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీ లోకి తీసుకుని ఏసీబీ విచారించగా, శివ బాలకృష్ణతో పాటు ఇతర అధికారుల పాత్రపైన ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివ బాలకృష్ణ బినామీలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. శివబాలకృష్ణ కేసులో ఈడీ, ఐటీ ఫోకస్ పెట్టింది. సోదరుడు నవీన్ అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బాగోతం బయటపడుతోంది. మొన్న సోమేష్‌కుమార్, నిన్న అరవింద్ కుమార్, నేడు రజత్‌కుమార్ ఆస్తులపై వివాదం నెలకొంది. ఐఏఎస్ రజత్‌కుమార్..గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో పని చేశారు. హేమాజీపూర్ సర్వే నంబర్ 83, 84, 85లో ఆయన కుటుంబం పేరు మీద భూములు ఉన్నట్లు సమాచారం. వరుసగా పలువురు ఐఏఎస్‌ల మీద ఆరోపణలు రావడంతో భూములను ఇతరుల పేర్లు మీద మార్చడానికి రజత్‌కుమార్ స్లాట్ బుక్ చేసినట్లు తెలిసింది. 15 ఎకరాల భూమిని ఇతరుల పేరు మీద మార్చేందుకు రజత్‌కుమార్ సిద్ధమయినట్లు సమాచారం.
* పాత కక్షల నేపథ్యంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని 10 మంది కలిసి దారుణంగా హత్య చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన పుట్టా రాము (36) గతంలో ఆటోడ్రైవర్‌గా పనిచేశాడు. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రాము ఇటీవల బీజేపీలో చేరి వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సమయంలో రాముకు జీడిమెట్లకు చెందిన మణికంఠ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి రియల్‌ఎస్టేట్ లావాదేవీలు చేసేవారు. అయితే వారి మధ్యలో వ్యాపారం విషయంలో గొడవలు జరిగి ఒకరిపై ఒకరు పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. పరిస్థితులు ముదిరిపోవడంతో రాము హత్యకు మణికంఠ పథకం వేశాడు. గత రెండు రోజుల నుంచి రెక్కీ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన రాము యూసుఫ్‌గూడలోని ఎల్‌ఎన్‌నగర్‌లో ఉంటున్న విషయం తెలుసుకున్న మణికంఠ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ యువతితో ఫోన్ చేయించి హానీట్రాప్ చేయించాడు. ఆ యువతి ఫోన్‌కాల్ నమ్మిన రాము రాత్రి 10 గంటల సమయంలో ఎల్‌ఎన్‌నగర్‌లోని తన ఇంటికి వచ్చాడు. సరిగ్గా 11.15 గంటలకు మణికంఠతో పాటు బోరబండకు చెందిన జిలానీ అనే రౌడీïÙటర్, మరో ఎనిమిది మంది కలిసి ఇంట్లోకి చొరబడి రామును కత్తులతో 50 పోట్లు పొడిచారు. అరగంట పెనుగులాడిన అనంతరం రాము కన్నుమూశాడు. రామును మర్డర్ చేసిన తరువాత ఆ దృశ్యాలను మణికంఠ ఓ స్నేహితుడికి వీడియో కాల్ చేసి చూపించాడు. రామును హనీట్రాప్ చేసిన యువతిని జూబ్లీహి ల్స్ పోలీసులు విచారిస్తున్నారు.
* హైదరాబాద్‌లోని వరవరరావు మేనల్లుడు, వీక్షణం పత్రిక సంపాదకుడు ఎన్.వేణుగోపాల్‌తోపాటు మావోయిస్టు మాజీ నేత నర్ల రవిశర్మ ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బృందాలు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. గురువారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలోనే ఎన్‌ఐఏ అదనపు ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో బృందాలు హిమాయత్‌నగర్, ఎల్‌బీనగర్‌లోని శ్రీనివాసపురం కాలనీల్లోకి వారి ఇళ్లకు చేరుకున్నాయి. దాదాపు నాలుగు గంటలపాటు తనిఖీలు కొనసాగాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. గ్యాంగ్‌స్టర్ నయీం బెదిరింపులకు సంబంధించి వేణుగోపాల్ రాసిన పలు కథనాల ప్రతులను, రవిశర్మ ఇంటి నుంచి 1990 కన్నా ముందు మరణించిన మావోయిస్టుల ఫోటోలతో కూడిన కరపత్రాలు, మావోయిస్టుల కదలికలపై పోలీసుశాఖ ప్రచురించిన ఓ పుస్తకాన్ని దర్యాప్తు బృందాలు వెంట తీసుకెళ్లినట్టు సమాచారం. గతేడాది సెప్టెంబరు 15న కూకట్‌పల్లి సింహపురి కాలనీలో కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్‌రావుతో సంబంధాల గురించి విచారించేందుకే సోదాలు నిర్వహించినట్టు తనిఖీల అనంతరం ఎన్‌ఐఏ వెల్లడించింది. ‘‘తమిళనాడు, కేరళ, కర్ణాటక ట్రై జంక్షన్‌లో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహించిన సంజయ్‌దీపక్‌రావు కనుసన్నల్లోనే పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టు అనుబంధ సంఘాల సభ్యులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణతోపాటు మహరాష్ట్రలోని థానే, కేరళలోని మలప్పురం, పాలక్కాడ్, చెన్నైలలో సోదాలు నిర్వహించాం. ఆరు సెల్‌ఫోన్లు, రూ.1.37 లక్షలు స్వాధీనం చేసుకున్నాం’ అని ఎన్‌ఐఏ పేర్కొంది. సంజయ్‌దీపక్‌రావు అరెస్ట్ సమయంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కేపీహెచ్‌బీ పోలీసులు వేణుగోపాల్‌ను 22వ, రవిశర్మను 23వ నిందితులుగా చేర్చారు. అనంతరం ఆ కేసును ఎన్‌ఐఏ తిరిగి నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z