* టెక్ మొఘల్ ఎలాన్ మస్క్ మొబైల్ ఫోన్‌కు గుడ్‌బై చెప్పారు. ఇకపై కొన్ని నెలలపాటు తాను మొబైల్‌ను వినియోగించనని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్.కామ్ (X.com) లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ఇకపై ఆడియో, వీడియో కాల్స్ కోసం ఎక్స్.కామ్‌నే వినియోగించనున్నట్లు తెలిపారు. ‘నేను కొన్ని నెలలపాటు మొబైల్ ఫోన్‌ను వినియోగించడం మానేస్తున్నా. ఆడియో, వీడియో కాల్స్ కోసం మొబైల్ ఫోన్‌కు బదులుగా ఎక్స్.కామ్‌ను ఉపయోగిస్తున్నా’ అని మస్క్ X.comలో పేర్కొన్నారు. కాగా, మస్క్ ఎక్స్.కామ్‌ను ఎవ్రిథింగ్ యాప్‌గా మారుస్తామని ప్రకటించారు. అందులో భాగంగా దానిలో ట్వీట్‌లు మాత్రమే కాకుండా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునేందుకు గత ఏడాది అక్టోబర్‌లో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు.
* ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి శుక్రవారం తన మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) ఎర్టిగా సేల్స్ పది లక్షల మైలురాయిని దాటాయని ప్రకటించింది. మల్టీ పర్పస్ వెహికల్ కాన్సెప్ట్‌ను రీడిఫైన్ చేయడంతోపాటు టెక్నాలజీ పరంగా అభివ్రుద్ధి చేసిందని, మరింత స్టైలిష్‌గా తీర్చి దిద్దిందని మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణ, గ్రామీణ మార్కెట్లలోనూ మారుతి ఎర్టిగా దూసుకెళ్తున్నదని తెలిపారు. ఎంపీవీ సెగ్మెంట్‌లో ‘ఎర్టిగా’ వాటా 37.5 శాతం అని తెలిపారు. ఎర్టిగా కార్లను దేశీయ మార్కెట్‌లో విక్రయంతోపాటు 80కి పైగా దేశాలకు ఎగుమతి చేసింది.
* ఇప్పటికే ఆర్బీఐ ఆంక్షలతో సతమతం అవుతున్న ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)’ మరింత కష్టాల్లో చిక్కుకున్నది. పేటీఎం ఆపరేషన్స్‌పై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఈ నెల 29 తర్వాత ఆ సంస్థ తన కస్టమర్లు, మర్చంట్లు, ఇతర వాటాదారులను కొనసాగించగలదా? అన్న ఆందోళనపై ‘పేటీఎం’ బోర్డులో ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. పీపీబీఎల్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా బ్యాంక్ ఆఫ్ అమెరికా, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) మాజీ ఎగ్జిక్యూటివ్ షింజిని కుమార్ గత డిసెంబర్లోనే రాజీనామా చేశారని పేటీఎం సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆమె రాజీనామాను పేటీఎం బోర్డు ఆమోదించి, మరొకరిని నియమించిందని ఆ వర్గాల కథనం. 2016-17 మధ్య పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఈఓగా ఆమె పనిచేశారు. ప్రస్తుతం ఉమెన్ ఫోకస్డ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్లాట్ ఫామ్ ‘సాల్ట్’ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు.
* ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాల్లో సొమ్ముపై ఇచ్చే వడ్డీరేటుపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతా నిల్వలపై వడ్డీ ఎనిమిది శాతానికి పరిమితం చేసే ప్రతిపాదనలు ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై శనివారం జరిగే ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) – సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం. అలాగే మెరుగైన రిటర్న్స్ కోసం ప్రావిడెండ్ ఫండ్ నిల్వల్లో స్టాక్ మార్కె్ట్లలో పెట్టుబడులను 10 నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. శనివారం జరిగే సీబీటీ సమావేశంలో పెన్షన్లు, బడ్జెట్ అంచనాలు తదితర అంశాలపై చర్చిస్తారని తెలుస్తు్న్నది. ఇప్పటికైతే ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీరేటు ఏజెండాలో లేదు. కార్మికశాఖ, సీబీటీ చైర్మన్ అనుమతితో ఏజెండాలో చేర్చాలని భావిస్తున్నట్లు ఈపీఎఫ్ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఈపీఎఫ్ ఖాతా నిల్వలపై వడ్డీరేటును ఎనిమిది శాతం చెల్లించాలని ప్రతిపాదిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదానికి పంపుతారని ఆ వర్గాలు వెల్లడించాయి.
* దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ట్రేడింగ్ ఒడిదొడుకుల మధ్య సాగినా రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్స్ మద్దతుతో స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 167 పాయింట్లు (0.23%) శాతం లబ్ధితో 71,595 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 64 పాయింట్ల (0.30%) లాభంతో 21,782 పాయింట్ల వద్ద స్థిర పడింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z