* ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం వినూత్న ఆలోచన చేశారు. ఒకే ఒక్కడు సినిమా తరహాలో నియోజకవర్గం మొత్తం ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద ఫిర్యాదు బాక్స్‌ను ఆయన (KVR) ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇవి ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఫిర్యాదులను గ్రామానికి వచ్చి నేరుగా తానే పరిష్కరిస్తానని వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు బాక్స్‌ల ద్వారా తనకు తెలియజేయాలని సూచించారు. ఇటీవల రహదారి విస్తరణ నిమిత్తం తన సొంతింటిని ఎమ్మెల్యే కూల్చివేయించిన విషయం తెలిసిందే. వెయ్యి గజాలకు పైగా ఉన్న స్థలాన్ని ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగిస్తున్నట్లు, దీని విలువ రూ.6 కోట్లు ఉంటుందని ప్రకటించారు.
* తెదేపా (TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)పై సీనియర్ పాత్రికేయుడు పూల విక్రమ్ రచించిన ‘మహా స్వాప్నికుడు’ పుస్తకాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ ఆవిష్కరించారు. కువైట్‌లో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు వెంకట్ కోడూరి ఈ పుస్తకాన్ని ప్రచురించారు.
* వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Polls) భాజపా 370కి పైగా స్థానాలను గెలుచుకొంటుందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఒక్కో బూత్‌లో 370 ఓట్లు అదనంగా పోలయ్యేలా చూడాలని, 370 స్థానాలకు పైగా భాజపా గెలిచేలా ఆశీర్వదించాలని కార్యకర్తలను, ఓటర్లను కోరారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లో పర్యటించిన ప్రధాని.. ₹7,550 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఝబువా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసమే తాను ఇక్కడికి రాలేదని.. ప్రజా సేవకుడిగా మాత్రమే వచ్చానని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రెట్టింపు వేగంతో పనిచేస్తోందని కితాబు ఇచ్చారు.
* తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో వీర శంకర్ (Veera Shankar) ప్యానల్ విజేతగా నిలిచింది. సంఘం ప్రెసిడెంట్‌గా వీర శంకర్, వైస్ ప్రెసిడెంట్‌లుగా వశిష్ఠ, సాయి రాజేశ్ (Telugu Film Directors Association President) ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఎలక్షన్స్ జరిగాయి. అనంతరం, ఫలితాలు వెలువడ్డాయి. దర్శకుల సంఘంలో దాదాపు 1500 మంది యాక్టివ్‌గా ఉన్నారని సమాచారం. తాజా ఎన్నికల్లో 1113 ఓట్లు పోలయ్యాయి. వీర శంకర్‌కు 536, ప్రత్యర్థి సముద్రకు 304 ఓట్లు పడ్డాయి. నూతన కార్యవర్గం రెండేళ్లు కొనసాగుతుంది. వీర శంకర్ గతంలోనూ అధ్యక్షుడిగా పనిచేశారు.
* పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాల (Pakistan Election Results)ను ఎన్నికల సంఘం (ECP) ప్రకటించింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (PTI)’ బలపర్చిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాల్లో గెలిచారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన ‘పీఎంఎల్-ఎన్’ పార్టీ 75 సీట్లు దక్కించుకుంది. బిలావల్ జర్దారీ భుట్టోకు చెందిన ‘పీపీపీ’కి 54 సీట్లు లభించగా, ‘ఎంక్యూఎం-పీ’ పార్టీకి 17 సీట్లు వచ్చాయి. మిగిలిన స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి.
* తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసులపై ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. అప్పటి తిరుపతి నగర తూర్పు, పశ్చిమ సీఐలు శివప్రసాద్‌రెడ్డి , శివప్రసాద్‌పై వేటు వేసింది. తూర్పు పీఎస్ ఎస్సై జయస్వాములు, హెడ్‌కానిస్టేబుల్ ద్వారకానాథ్‌రెడ్డిని సస్పెండ్ చేసింది. అలిపిరి అప్పటి సీఐ దేవేంద్రకుమార్‌ను వీఆర్‌కు బదిలీ చేసింది. ఉప ఎన్నిక వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. సాక్ష్యాధారాలు లేవని ఈ కేసును మూసివేయించారు.
* నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) పేరు, ఎన్నికల గుర్తును అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ (Sharad Pawar) స్పందించారు. ఎన్సీపీని స్థాపించిన వారి చేతుల్లోంచి లాక్కొని వేరే వ్యక్తులకు ఈసీ కట్టబెట్టిన తీరు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఆదివారం పుణెలో ఓ కార్యక్రమంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. ఏ పార్టీకైనా కార్యక్రమం, భావజాలమే ముఖ్యమన్నారు. గుర్తు కేవలం కొంత కాలం వరకు మాత్రమే ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఈసీ వ్యవహారశైలిని ప్రజలు సమర్థించబోరన్న విశ్వాసం తనకు ఉందన్నారు. ఎన్సీపీని స్థాపించి, నిర్మించిన వారి చేతుల్లోంచి లాక్కొని వేరే వాళ్లకు ఇవ్వడం గతంలో ఎన్నడూ జరగలేదని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఇటీవల అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించిన ఈసీ.. శరద్ పవార్ వర్గానికి ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- శరద్‌చంద్ర పవార్’ పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే.
* బాల రాముడు కొలువుదీరిన అయోధ్య రామాలయాన్ని (Ayodhya Ram Temple) ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్ చట్టసభ్యులు (Uttar Pradesh Legislators) సందర్శించారు. 325 మందికిపైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. 10 బస్సుల్లో లఖ్‌నవూ నుంచి అయోధ్యకు చేరుకున్నారు. పుణె నుంచి నేరుగా వచ్చిన ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్.. తన మంత్రివర్గం, సభ్యులతో కలిసి నూతనంగా నిర్మించిన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ (SP) ఎమ్మెల్యేలు ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు.
* ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కలిశారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు భేటీలో పాల్గొన్నారు. బొంతు రామ్మోహన్ భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరే అవకాశముందని తెలుస్తోంది. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం.
* ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న వ్యతిరేక విధానాలపై ఉద్యమానికి దిగుతున్నట్లు ఏపీజేఏసీ ప్రకటించింది. 104 ఉద్యోగ సంఘాలు, కార్యవర్గంతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన ఏపీజేఏసీ నేతలు ఈమేరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ‘ఉద్యమ శంఖారావం’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 27న ఉద్యోగులతో చలో విజయవాడ చేపట్టబోతున్నట్టు తెలిపారు. 14న నల్ల బ్యాడ్జీలు ధరించి తహసీల్దార్, డిప్యూటీ కలెక్టర్, కలెక్టర్ కార్యాలయాల్లో వినతులు సమర్పించాలని నిర్ణయించారు. 15, 16 తేదీల్లో భోజన విరామ సమయంలో పాఠశాలల్లో నిరసన చేపట్టనున్నారు. 17న తాలుకా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు.. 20న కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామని జేఏసీ నేత బండి శ్రీనివాస్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z