ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారి ప్రసాదంలో ఎముక వచ్చినట్లు ఓ భక్తుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ప్రసాదంలో ఎముక ప్రత్యక్షమైందంటూ జరిగిన ప్రచారం అవాస్తవం అని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు మారండేయశాస్త్రి, వేదపండితులు గంటి రాధాకృష్ణశర్మ తెలిపారు. పాకశాలలో తయారు చేసే రోజూవారి ప్రసాదాలు నియమ నిష్ఠలతో, శుచీశుభ్రతలతో ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల పాకశాలలో పులిహోర ప్రసాదంలో ఎముక వచ్చిందనేది వాస్తవం కాదన్నారు.ఈ ఘటన తమకు ఎంతో మనోవేదనకు గురి చేసిందన్నారు. దీనిపై పలు అనుమానాలు కూడా ఉన్నాయన్నారు. భక్తుడు దాల్చిన చెక్క ముక్కలను చూసి ఎముకలుగా భావించారని.. ఆలయ కమిటీ విచారణలో ఆయన మాటలు అబద్ధమని తేలిందని ఆలయ ప్రధానార్చకులు మారండేయశాస్త్రి, గంటి రాధాకృష్ణశర్మ తెలిపారు. శ్రీశైలం ఆలయంలో ప్రసాదాల తయారీలో ఎప్పుడూ ప్రామాణికమైన నిర్వహణ విధానాలు పాటించడం వల్ల ఇలాంటి అపవిత్ర చర్యలకు ఆస్కారం ఉండదని పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z