NRI-NRT

కాలిఫోర్నియాలో భారతీయ కుటుంబం అనుమానస్పద మృతి

కాలిఫోర్నియాలో భారతీయ కుటుంబం అనుమానస్పద మృతి

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విచారణలో భాగంగా.. వీళ్లు కేరళకు చెందినవారని తేలింది. శాన్ మాటియో నగరంలోని అలమెడ డీ లాస్‌ పుల్గాస్ అనే ప్రాంతంలో ఉన్న బ్లాక్‌ నంబర్‌ 4100లో ఈ ఘటన చోటు చేసుకొంది. మృతులను ఆనంద్‌ సుజాత్‌ హెన్రీ (42), అలిస్‌ బెంజిగర్‌ (40), వారి 4ఏళ్ల వయసున్న కవల పిల్లలుగా గుర్తించారు. ఈ మరణాలకు కుటుంబ కలహాలే కారణం అయ్యుండొచ్చని.. ఇదొక హత్య-సూసైడ్ కేసు అని పోలీసులు భావిస్తున్నారు.

సోమవారం ఉదయం వెల్ఫేర్ చెక్ సమయంలో ఈ ఇంటి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. స్థానిక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని తనిఖీ చేయగా.. బలవంతంగా ప్రవేశించిన సంకేతాలను వాళ్లు కనుగొనలేదు. తలుపులన్నీ లోపలి నుంచే మూసి ఉన్నాయి. కానీ.. ఒక కిటికీ తెరిచి ఉండటంతో, దాని ద్వారా అధికారులు ఇంట్లోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లి చూడగా.. బాత్రూంలో ఆనంద్, అలిస్‌ల మృతదేహాలు కనిపించాయి. ఆ ఇద్దరికీ తుపాకీతో కాల్చిన గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదే ప్రాంతంలో వారికి 9ఎంఎం తుపాకీతో పాటు లోడెడ్ మ్యాగజైన్ లభ్యమైంది. ఆ ఇంటిని మరింత పరిశీలించగా.. బెడ్‌రూంలో కవల పిల్లల మృతదేశాలు కనిపించాయి. ఆ చిన్నారుల శరీరాలపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో.. బహుశా విషప్రయోగం, లేదా గొంతు నులిమి చంపి ఉండొచ్చిన అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వీరి మరణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

అయితే.. ఈ కేసులో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2016 డిసెంబర్‌లోనే ఆనంద్ విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడని తెలిసింది. కానీ.. ప్రొసీడింగ్స్ మాత్రం పూర్తి కాలేదు. కాగా.. గత తొమ్మిదేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్న ఆనంద్.. మెటా, గూగుల్ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పని చేశాడు. లాగిట్స్ అనే ఒక కంపెనీని సొంతంగా ప్రారంభించాడు కూడా! కొన్నాళ్ల క్రితమే ఇతడు 2.1 మిలియన్‌ డాలర్లు విలువ చేసే ఒక ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. మరి.. ఇంతలోనే ఏమైందో ఏమో తెలీదు కానీ, ఫ్యామిలీ ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z