NRI-NRT

డల్లాస్‌లో నాట్స్ తెలుగు వేడుకలకు భారీ ఏర్పాట్లు

డల్లాస్‌లో నాట్స్ తెలుగు వేడుకలకు భారీ ఏర్పాట్లు

అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మార్చి నెలలో డల్లాస్ ‌లో తెలుగు వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 15, 16 తేదీల్లో అలెన్ ఈవెంట్ సెంటర్( క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్) వేదికగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్టు నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి(బాపు)నూతి తెలిపారు. ఈ వేడుకల్లో ముఖ్యంగా యువతను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ఈ వేడుకల ద్వారా వచ్చే నిధులను తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవ కార్యక్రమాలకు వెచ్చిస్తామని బాపు వివరించారు.

ఇప్పటికే నాట్స్ దిగ్విజయంగా నిర్వహిస్తున్న నాట్స్ హెల్ప్ లైన్, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు, నల్లమల అటవీ ప్రాంతంలో నిరుపేద మహిళలకు ఆర్థిక చేయూత అందిస్తూ చేపట్టిన కార్యక్రమాలను సవివరంగా బాపు నూతి తెలిపారు. నాట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు, డాల్లాస్ తెలుగు వేడుకల కన్వీనర్ రాజేంద్ర మాదాలతో పాటు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రచించిన నాట్స్ వాలంటీర్లు, కమిటీ సభ్యులకు బాపు నూతి కృతజ్ఞతలు తెలిపారు. మార్చి 15,16 తేదీల్లో నాట్స్ తెలుగు వేడుకలతో పాటు మార్చి 15న జరిగే బోర్డు సమావేశం కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనల తో పాటు, మహిళల సాధికారత కార్యక్రమాలు, వ్యాపార చర్చలు, సాహిత్య కార్యక్రమాలు వంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఈ తెలుగువేడుకల్లో ఉంటాయని కార్యదర్శి రవి తాండ్ర వివరించారు. అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా కార్యక్రమాలు ఉంటాయని యువతకు సరదా, కుటుంబాలకు కలయిక, సీనియర్లకు గౌరవం.. ఇవన్నీ కలగలిసిన కార్యక్రమాలు డాల్లాస్ తెలుగు వేడుకల్లో అందరిని అలరిస్తాయని తెలిపారు. ఈ తెలుగువేడుకలకు అందరికి ప్రవేశం పూర్తిగా ఉచితమని స్పష్టం చేశారు.

స్థానిక తెలుగు విద్యార్థుల అద్భుత ప్రదర్శనలు, కళాశాల విద్యార్థుల ప్రత్యేక నృత్యాలు ఇలా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల ఈ వేడుకల్లో ఉంటాయని డల్లాస్ తెలుగు వేడుకల సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు కావ్య కసిరెడ్డి వివరించారు. డాల్లాస్ తెలుగు వేడుకలు కేవలం సరదా ఆటలు పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనాలకు మాత్రమే పరిమితం కాదు భారతదేశం నుండి విశిష్ట అతిథులు, కళాకారులు, సామాజిక సేవకులు… ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు డల్లాస్ తెలుగు వేడుకలకు హాజరు కానున్నారని తెలిపారు. తెలుగు ప్రముఖులతో మాట్లాడే అవకాశం, విజ్ఞానం పంచుకునే అవకాశం ఉంటాయని అన్నారు. తెలుగు వేడుకల్లో క్రీయాశీలకంగా పనిచేయటానికి ముందుకొచ్చిన స్వచ్ఛంద సేవకులు, కమిటీ సభ్యులందరితో కలిసి జాతీయ కోఆర్డినేటర్ కవిత దొడ్డా ఫోటో సెషన్‌ను నిర్వహించారు. ఇది కేవలం ఒక ఫోటో సెషన్ కాదు, సమష్టి కృషికి గౌరవం, కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చే గొప్ప కార్యక్రమమని ఆమె తెలిపారు. డల్లాస్ ‌తో పాటు అమెరికాలో ఉండే తెలుగువారంతా ఈ వేడుకల్లో పాలుపంచుకోవచ్చని కవిత దొడ్డా అన్నారు. అరుదైన ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z