* సినీనటి గౌతమి (Gautami) అన్నాడీఎంకే (AIADMK)లో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి (Palaniswami)ని కలిసి పార్టీ కండువా కప్పుకొన్నారు. దాదాపు 25 ఏళ్ల పాటు భాజపా (BJP)లో పనిచేసిన గౌతమి గతేడాది అక్టోబర్‌లో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసినా.. తనకు కష్ట సమయంలో తగిన మద్దతు లభించకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు గౌతమి అప్పట్లో ఓ ప్రకటన చేశారు. ఈ పరిణామాల అనంతరం తాజాగా ఆమె చెన్నైలోని గ్రీన్‌వేస్ రోడ్డులో పళనిస్వామి నివాసానికి వెళ్లి అన్నాడీఎంకే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో భాజపాలో పనిచేసిన తమిళ నటి గాయత్రి రఘురాం సైతం ఇటీవల అన్నాడీఎంకేలో చేరారు.
* ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ‘రాజధాని ఫైల్స్’ (Rajadhani Files) చిత్ర దర్శకుడు భాను ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలను సమాధి చేసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని కోసం స్వచ్ఛందంగా మూడు పంటలు పండే భూములిచ్చిన రైతులు కన్నీళ్లు పెట్టడం చూడలేకే తాను ‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.
* యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని నగరం అబుధాబీ సమీపంలో నిర్మించిన హిందూ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన యూఏఈకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బోచాసనవాసీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఆలయాన్ని ప్రారంభించారు. ఆలయంలో పూజారులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూ దేవతలకు హారతి ఇచ్చారు. ఆలయ ప్రారంభానికి విచ్చేసిన ప్రధాని మోదీని చూసేందుకు భారత పౌరులు పెద్దఎత్తున తరలి వచ్చారు. వారికి అభివాదం తెలియజేశారు. బాలీవుడు నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
* విభజన చట్టంలోని అంశాలను సాధించడమే తమ పార్టీ విధానమని, రాష్ట్రానికి చట్టపరంగా రావాల్సిన వాటి గురించే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్.. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అన్నారు. పదేళ్లు పూర్తయ్యాక రాజధానిపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది. పాలనా రాజధానిగా విశాఖను చేద్దామంటే అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల బకాయిలపై మంత్రి స్పందిస్తూ.. గత ప్రభుత్వాలు ఎప్పుడూ బకాయిలు పెట్టలేదా? అని ప్రశ్నించారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకూడదని తాము కోరుకుంటున్నామన్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని వివరించారు.
* కాంగ్రెస్ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. రేణుకాచౌదరి, అనిల్‌కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నట్లు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు ఆశిస్తోన్న నాయకులు చాలా మంది ఉన్నప్పటికీ.. అన్ని కోణాల్లో కసరత్తు చేసిన తరువాత ఈ ఇద్దరికి అవకాశం కల్పించినట్టు పీసీసీ చెబుతోంది. రానున్న లోక్‌సభ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని వీరిని ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటకలో ఖాళీ అవుతున్న మూడు స్థానాల నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జి.సి.చంద్రశేఖర్,.. మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పోటీ చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 15(గురువారం) వరకు గడువు ఉంది.
* బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక సీఎల్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. బంజారా ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
* ‘నిరుద్యోగులారా అధైర్యపడకండి .. మీ సమస్యలు పరిష్కరిస్తాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఎల్బీ స్టేడియంలో హోంశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను ఆయన అందజేశారు. ఈ రాష్ట్రంలో గంజాయి మొక్కలు ఉండొద్దు. నిరుద్యోగ యువకులారా ఈ రాష్ట్రం మీదే. సాధించుకున్నది మీరు. మీకోసం పనిచేయడానికి, మీ సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పదేళ్లు ఈ బాధ్యతలోనే ఉండి మీకోసం 24గంటలూ కష్టపడి పనిచేస్తా. మీరు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. కేసీఆర్ మళ్లీ మేమే అధికారంలోకి వస్తా అంటున్నారు. ఎలా వస్తారో నేనూ చూస్తా’’ అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతి కుమారి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
* పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు పగ్గాలు చేపట్టారు.. పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.. యూపీఏ ఛైర్‌పర్సన్‌గా కూటమికి పెద్దగా వ్యవహరించారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయాల్లో తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో హుందాగా వ్యవహరించారు. ఆమే సోనియా గాంధీ (Sonia Gandhi). దాదాపు 25 ఏళ్ల పాటు వరుసగా లోక్‌సభ సభ్యురాలిగా వ్యవహరించిన ఆమె.. త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు తీసుకున్న ఈ నిర్ణయంతో రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం గురించి సర్వత్రా చర్చ మొదలైంది.
* కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి జలాల అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. మేడిగడ్డ మేడిపండులా కుంగిపోతే నీరు నింపడం సాధ్యమా అని ప్రశ్నించారు. శాసనసభ (TS Assembly)లో ఆయన మాట్లాడారు. నల్గొండలో నిర్వహించిన భారాస సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) చేసిన వ్యాఖ్యలపై రేవంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
* భారాస నేతలు ప్రతిపక్షంలోకి వచ్చినా వారి బుద్ధి మారలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajgopal Reddy) విమర్శించారు. శాసనసభ (TS Assembly)లో ఆయన మాట్లాడారు. బలహీనవర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుంటే కూర్చో అంటూ భారాస ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో ఇప్పుడూ అలాగే చేస్తున్నారని.. ఆయనకు ఎంత అహంకారమని ధ్వజమెత్తారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z