ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాదిమంది స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. మంగళవారం నాడు 68,363 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 19,609 మంది తలనీలాలను సమర్పించారు. హుండీ ద్వారా 4.55 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పట్టింది. మూడు కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. రథసప్తమి పండగ సందర్భంగా భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. తిరుమలలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ రోజంతా స్వామివారికి వివిధ సేవలను నిర్వహించనున్నారు. రథసప్తమి రోజు శుక్రవారం తెల్లవారుజామున 5:30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవను జరుపుతారు.
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు మలయప్ప స్వామివారు చిన్నశేష వాహనంపై ఊరేగుతారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనరూఢుడై భక్తులకు దర్శనం ఇస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానాన్ని నిర్వహిస్తారు టీటీడీ అర్చకులు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరుపుతారు. ఇక సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై దర్శనం ఇస్తారు మలయప్ప స్వామివారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై ఊరేగడంతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. ఈ వేడుకలను దృష్టిలో ఉంచుకుని సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. బుధ, గురు, శుక్రవారాల్లో తిరుపతిలో గల కౌంటర్లన్నింటిలోనూ శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ ఉండబోదని స్పష్టం చేశారు. భక్తులు నేరుగా తిరుమలకు వెళ్లి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్లొచ్చని సూచించారు. ఈ నెల 18వ తేదీ నుంచి మళ్లీ ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీని పునరుద్ధరిస్తామని తెలిపారు.