హెచ్ఎండీఏలో భూముల వేలంలోనూ భారీ అవినీతి జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణ కేసు విచారణలో భాగంగా భూముల వేలంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది. దీనిపై ప్రభుత్వానికి ఏసీబీ రిపోర్టు అందజేసిందని.. దీంతో భూముల వేలంపాటలు ఆపాలని సర్కార్ ఆదేశించిందని సమాచారం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకు మళ్లీ భూముల వేలం నిర్వహించొద్దని ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే వేలం పూర్తయిన భూములపై కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో కొందరు ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో జరిగిన భూముల వేలంలో అప్పట్లో హెచ్ఎండీఏలో పనిచేసిన శివబాలకృష్ణ పాత్రపైనా ఏసీబీ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. హెచ్ఎండీఏలో ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్న అధికారిని తనిఖీల సమయంలో ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తున్నది.
గతంలో జరిగిన వేలంపాటల్లోనూ సదరు అధికారి బాలకృష్ణ ప్రమేయంతోనే చాలా వ్యవహారాలు నడిపారన్న ప్రచారం జరుగుతున్నది. హెచ్ఎండీఏలోని కొందరు కీలక అధికారులు భూముల వేలానికి సంబంధించి రియల్ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లకు ముందే సమాచారం అందించేవారని.. వారికే ఆ భూములు దక్కేలా చక్రం తిప్పేవారని తెలిసింది. అంతేకాకుండా భూముల వేలం ఎక్కడెక్కడ జరగనున్నది? ప్రాజెక్టులు ఎక్కడ వస్తాయి? అనే సమా చారం కూడా ముందే లీక్ చేసేవారని సమాచారం. హెచ్ఎండీఏలోని కొందరు కీలక అధికారులు వివిధ పర్మిషన్లకు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ముందు నుంచే ఉన్నా యి. తాజాగా భూముల వేలానికి ముందే పలు రియల్ సంస్థలతో కొందరు కీలక అధికారులు కుమ్మకై అవినీతి దందాకు తెరలేపినట్టు బయటపడింది. ఒక కీలక అధికారి అయితే ఇతర శాఖల్లోని ఉద్యోగులను డిప్యుటేషన్‌పై హెచ్ఎండీఏకి తీసుకొచ్చి లబ్ధి పొందినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయని తెలుస్తున్నది. ఈ అధికారిపై గతంలో పనిచేసిన చోట కూడా అవినీతి ఆరోపణలు రావ డంతో ఆయనపై అప్పట్లో ప్రభుత్వం చర్యలు చేపట్టి నట్టుగా తెలిసింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున సర్కార్ భూములను వేలం వేశారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లేఅవుట్లు వేసి వేలంపాటలు చేపట్టారు. ప్రభుత్వ భూములతో పాటు ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి కూడా పెద్ద మొత్తంలో భూము లను సేకరించి లేఅవుట్లు వేశారు. కోకాపేట మొదలుకొని బాటసింగారం, ప్రతాప సింగారం, ఉప్పల్ భగాయత్ వంటి చోట్ల పెద్ద ఎత్తున భూములు సేకరించారు. బుద్వేల్, ఆదిభట్ల తదితర ప్రాంతాల్లోనూ లేఅవుట్లు వేశారు. ఎన్నికలకు ముందే ఈ భూ దందాపై ఆరోపణలు వచ్చాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z