ఉత్తరప్రదేశ్ అయోధ్యలో బాల రాముడి (Ayodhya Ram Mandir)ని దర్శించుకొనేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ, విదేశాల నుంచి తరలివచ్చే భక్తజనం రద్దీ దృష్ట్యా ఇప్పటికే ఆలయ దర్శన వేళల్లో మార్పు చేసిన ట్రస్టు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామ్‌లల్లా ఆలయంలో బాలరాముడి దర్శనానికి రోజూ గంట పాటు విరామం ఇవ్వనున్నట్లు ఆలయ ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు. దీంతో బాల రాముడికి విశ్రాంతి ఇచ్చేలా శుక్రవారం నుంచి రోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు ఆలయ ద్వారాలు మూసివేసి ఉంచుతారు. ‘‘రామ్‌లల్లా ఐదేళ్ల బాలుడు. ఇన్ని గంటల పాటు మెలకువగా ఉండటం వల్ల పడే ఒత్తిడిని తట్టుకోలేరు. అందువల్ల బాల రాముడికి కొంత విశ్రాంతి ఇచ్చేందుకు రోజూ గంట సేపు ఆలయ తలుపులు మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. దీంతో మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు ఆ దేవతామూర్తికి విశ్రాంతి దొరుకుతుంది’’ అని ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. జనవరి 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత భక్తులు పెద్దసంఖ్యలో అయోధ్యకు తరలివస్తుండటంతో గతంలో ఉన్న దర్శనవేళల్ని మార్పు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్వామి వారికి సుప్రభాత సేవా కార్యక్రమాలు తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభమవుతున్నాయి. ఆ తర్వాత ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు రాములోరి దర్శనం కోసం భక్తజనాన్ని అనుమతిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z