Politics

వైకాపా రాజ్యసభ అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్-NewsRoundup-Feb162024

వైకాపా రాజ్యసభ అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్-NewsRoundup-Feb162024

* ముగ్గురు వైసీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్ధుల నామినేషన్లను ఆమోదించినట్టు రిటర్నింగ్ అధికారి విజయరాజు తెలిపారు. రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లకు వైసీపీ తరపున నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసిన ముగ్గురు అభ్యర్ధుల నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉండడంతో వాటిని ఆమోదించినట్టు విజయరాజు వెల్లడించారు.

* ‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సెన్సార్‌ బోర్డు రివైజింగ్‌ కమిటీ ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. నిబంధనల మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని స్పష్టం చేసింది.

* భారాసకు వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్‌ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లేఖ రాశారు. తన భర్త ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డితో కలిసి ఆమె నేడు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

* ‘సిద్ధం’ అంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన సీఎం జగన్‌.. ఇప్పుడు మీరే యుద్ధం చేయాలంటూ వాలంటీర్లను పురిగొల్పడం ద్వారా చేతులెత్తేశారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు.

* దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి నడుస్తోన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ పార్టీ బ్యాంకు ఖాతాలు స్తంభించాయని శుక్రవారం ప్రకటించింది. వాటిలో యూత్‌ కాంగ్రెస్‌ ఖాతాలు కూడా ఉన్నాయని తెలిపింది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి అజయ్‌ మాకెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

* కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’లో రాష్ట్రీయ జనతాదళ్‌ నేత తేజస్వీ యాదవ్‌ శుక్రవారం పాల్గొన్నారు. రాహుల్‌, ఇతర కీలక నాయకులు ఆ వాహనంలో ఎక్కగా తేజస్వీ స్వయంగా డ్రైవింగ్‌ చేసి ఇరు పార్టీల కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

* జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో వైకాపా ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఏపీ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు (NSUI) ఆరోపించారు. శుక్రవారం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని ముట్టడించారు. ఇంటి ముందు బైఠాయించి ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు. 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని జగన్‌ గాలికొదిలేశారని విమర్శించారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయటానికి ప్రభుత్వం సిద్ధమా?అని ప్రశ్నించారు. బై బై జగన్ రెడ్డి , బై బై వైసీపీ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

* బీసీ కులగణన విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. బలహీన వర్గాలను బలోపేతం చేయడమే ఉద్దేశమని చెప్పారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింట సర్వేపై శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా చేపట్టిన చర్చలో సీఎం మాట్లాడారు. మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో తీర్మానాన్ని సభ ముందుకు తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టారా? అని ప్రశ్నించారు.

* బీఆర్‌ఎస్(BRS) అధినేత కేసీఆర్‌ 70 వ జన్మదిన( KCR birthday) వేడుకలను ప్రపంచమంతా (World wide) ఎన్నారైలు(NRI) ఘనంగా నిర్వహిస్తారని బీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరపాలని వివిధ దేశాల బీఆర్‌ఎస్ ప్రతినిధితులను కోరామన్నారు. కొన్ని దేశాల్లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు సంఘీభావంగా మొక్కలు నాటడం, అనాథలకు సహాయం చేయడం వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతామన్నారు. ఎన్నారైలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

* ప‌ద్మ‌శ్రీ గ్ర‌హీత‌, మేటి చెఫ్ ఇంతియాజ్ ఖురేషి(Chef Imtiaz Qureshi) క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 93 ఏళ్లు. ఐటీసీ హోట‌ల్స్ ఏర్పాటులో ఆయ‌న కీల‌క‌పాత్ర పోషించారు. ఇంతియాజ్ ఖురేషి మృతి గురించి ప్ర‌ఖ్యాత చెఫ్ కునాల్ క‌పూర్ త‌న ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. ఎన్నో అద్భుత‌మైన వంట‌కాల‌ను చెఫ్ ఇంతియాజ్ ప‌రిచ‌యం చేశార‌ని, ఆయ‌న వార‌స‌త్వాన్ని ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటామ‌న్నారు.

* భార‌త ఫాస్ట్ బౌల‌ర్‌ వ‌రుణ్ అరోన్(Varun Aron) ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. రంజీ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్ (Jharkhand), రాజ‌స్థాన్(Rajasthan) మ్యాచ్ సంద‌ర్భంగా ఈ రైటార్మ్ పేస‌ర్ ఎర్ర బంతి క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. దాంతో, అత‌డి సుదీర్ఘ కెరీర్‌కు తెర‌ప‌డ‌నుంది. క‌చ్చిత‌త్వంతో, వేగంగా బౌలింగ్ చేసే అరోన్ టీమిండియా త‌ర‌ఫున 8 టెస్టులు మాత్రమే ఆడాడు.

* బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ప్రజల పక్షాన్నే పోరాడు తుందని మరోసారి రుజువైంది. అందుకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఉన్న ఫలంగా ప్రజా భవన్‌కు పరుగులు పెట్టడమే తాజా నిదర్శనం. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ దెబ్బకు సీఎం రేవంత్‌రెడ్డి నేడు ప్రజాభవన్‌(Praja Bhavan)కు వెళ్లాల్సి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు(Harish Rao) అన్నారు.

* ఎన్నిక‌ల బాండ్ల‌(Electoral bonds)ను సుప్రీంకోర్టు ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. అయితే రాజ‌కీయ పార్టీల‌కు స‌మ‌ర్పించే ఆ బాండ్ల గురించి కొన్ని వివ‌రాలు తెలిశాయి. ఆ బాండ్ల ద్వారా అధికారంలోని బీజేపీ పార్టీకి 6566 కోట్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా ఇచ్చిన తీర్పులో కొన్ని పార్టీల లావాదేవీలు వెల్ల‌డ‌య్యాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీ క‌న్నా.. బీజేపీకి సుమారు ఆరు రెట్లు అధికంగా ఎన్నిక‌ల బాండ్ల రూపంలో వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు బాండ్ల రూపంలో కేవ‌లం 1123 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఎల‌క్టోర‌ల్ బాండ్ల విధానాన్ని ప్ర‌శ్నించిన సీపీఎం పార్టీ.. ఒక్క రూపాయి కూడా ఆ రూపంలో రాలేద‌ని నిర్ధారించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z