Agriculture

వాము సాగు తో సిరుల పంట

వాము సాగు తో సిరుల పంట

ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. అలాగే దీన్ని సాగు చేసిన రైతన్నకు సిరుల పంట కురిపిస్తుంది. ఔషధం కావడంతో ఈ పంటను పండించేందుకు కర్షకులు ఎంతోమంది ముందుకొస్తున్నారు. ఇక వాము పంటకు పెట్టింది పేరు కొడంగల్‌ ప్రాంతం. ఇక్కడ పండించిన పంటకు మంచి డిమాండ్‌ సైతం పలుకుతోంది.

నల్లరేగడి నేలల్లో దీన్ని సాగుచేస్తుంటారు. కొడంగల్‌లో నల్లరేగడి నేలలు అధికంగా ఉండటంతో అత్యధికులు ఇటువైపు దృష్టిసారిస్తున్నారు. తేమ ఆధారంగా పండే పంట ఇది. నాలుగు నెలల్లో చేతికొస్తుంది. ఒక ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్ల వరకు వస్తుంది. వికారాబాద్‌ జిల్లాలో 550 ఎకరాల వరకు ఈ పంటను పండిస్తున్నారు. ఇందలో కొడంగల్‌ నియోజకవర్గంలోనే 295కు పైగా ఎకరాలలో దీన్ని సాగు చేస్తున్నారు. ఇందులో సన్న, నల్ల వాము అంటూ రెండు రకాలు ఉంటాయి. ముఖ్యంగా సన్న వాముకు అధికంగా డిమాండ్‌ ఉంటుంది. పంటను చేతితో చల్లడం, నాటు వేయడం వంటి రెండు పద్ధతుల్లో సాగు చేస్తుంటారు.

ఒక ఎకరానికి సుమారు రూ.7 వేల వరకు పెట్టుబడి అవుతుంది. ప్రస్తుతం ఓ క్వింటాకు రూ.20 వేల నుంచి 25 వేల వరకు ధర పలుకుతోంది. ఈ పంటకు ప్రభుత్వం ఎలాంటి మద్దతు ధర ప్రకటించకపోవడం గమనార్హం. పంట నూర్పిడి సమయంలో ఇబ్బందులు ఉంటాయి. గతంలో ఈ పంట నూర్పిడి చేసేందుకు నెల రోజుల సమయం పట్టేది. ప్రస్తుతం యంత్రాల సాయంతో త్వరగా పూర్తిచేస్తున్నారు.

దగ్గు, జలుబు వంటి ఎన్నో రోగాలకు ఉపశమనం కలిగించే దివ్య జౌషధంగా వాముకు పేరు ఉంది. పెట్టుబడి లేని పంటగా సాగు చేసుకుంటారు. పంట విత్తడం, కలుపుతీయడం మినహా ఎలాంటి మండులు వాడాల్సిన అవసరం ఉండదు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z