‘మీ పిల్లల్ని ప్రభుత్వం బడుల్లో చదివించే ధైర్యం ఉందా’ అని ఎంఈవోలు, హెచ్‌ఎంలను విద్యాశాఖ కడప ఆర్జేడీ రాఘవరెడ్డి సూటిగా ప్రశ్నించారు. డీఈవో దేవరాజు అధ్యక్షతన శనివారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో చిత్తూరు, రాయచోటి జిల్లాల ఎంఈవోలు, హెచ్‌ఎంలకు పదో తరగతి పరీక్షల నిర్వహణపై జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. పిల్లలకు చదువు చెప్పడం సేవగా భావించాలని సూచించారు. అదే మీ పిల్లలే ప్రభుత్వ బడుల్లో ఉంటే వారి చదువులపై ప్రత్యేక దృష్టి సారించరా అని ప్రశ్నించారు. టెన్త్ క్లాస్ విద్యార్థికి కనీసం రెండో తరగతి తెలుగు పుస్తకం చదవడం రాకపోతే తప్పెవరిదో అర్థం చేసుకోవాలన్నారు. టెన్త్ పరీక్షలు దగ్గర పడుతున్నాయని, విద్యార్థి అభ్యసనా సామర్థ్యాలపై దృష్టి సారించాలని సూచించారు. నాణ్యమైన విద్యను అందించే టీచర్లపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత హెచ్‌ఎంలపై ఉందన్నారు. సబ్జెక్టు వారీగా టీచర్ల బోధన సమయంలోని లోపాలను గుర్తించి నివేదిక తయారు చేసి, వారిని హెచ్చరించాలన్నారు. నిబద్ధతతో పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు ఆశించగలమని సూచించారు. ఇందుకోసం ఎంఈవోలు తరచూ పాఠశాలలు తనిఖీ చేయాలని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z