Business

విద్యుత్‌ ఎయిర్‌ కాప్టర్‌లు

విద్యుత్‌ ఎయిర్‌ కాప్టర్‌లు

కార్ల తయారీ అగ్రగామి సంస్థ మారుతీ సుజుకీ ఇండియా, ఆకాశంలో ప్రయాణించే విద్యుత్‌ ఎయిర్‌ కాప్టర్లను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇందుకు మాతృసంస్థ సుజుకీ సహాయం తీసుకోనుందని ఒక ఆంగ్ల వార్తా పత్రిక తన కథనంలో పేర్కొంది.

విద్యుత్తు ఎయిర్‌ కాప్టర్లనేవి డ్రోన్ల కంటే పెద్దగా ఉంటాయి. సంప్రదాయ హెలీకాప్టర్ల కంటే చిన్నగా ఉంటాయి. పైలట్‌తో కలిపి కనీసం ముగ్గురు ప్రయాణించేలా ఇవి ఉంటాయి.

వీటిని తొలుత జపాన్‌, అమెరికాలో ప్రవేశ పెట్టనున్నారు. ఆ తర్వాత భారత్‌కు విస్తరించే వీలుంది. మనదేశంలో ఇవి విజయవంతం కావాలంటే అందుబాటు ధరలోనే ఉండాలి. భూమిపై ఉబర్‌, ఓలా కార్ల తరహా విప్లవాన్ని ఈ ఎయిర్‌ ట్యాక్సీలు ఆకాశంలో సృష్టించగలవని అంచనా.

తయారీ వ్యయాలను తగ్గించుకోవడం కోసం భారత్‌లోనే వీటిని తయారు చేయాలని మారుతీ భావిస్తోంది. ఇందుకోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించడంతో పాటు, విమానయాన నియంత్రణాధికార సంస్థ డీజీసీఏతోనూ చర్చలు జరుపుతున్నట్లు సుజుకీ మోటార్‌ ప్రతినిధి ఒకరిని ఉటంకిస్తూ ఆ పత్రిక పేర్కొంది.

జపాన్‌లో వచ్చే ఏడాది జరగబోయే ‘2025 ఓసాకా ఎక్స్‌పో’లో స్కైడ్రైవ్‌ పేరుతో వీటిని ఆవిష్కరిస్తారని చెబుతున్నారు. హెలికాప్టర్‌లో సగం బరువు ఉండే వీటిని సులువుగా భవనాల రూఫ్‌టాప్‌లపై ల్యాండింగ్‌, అక్కడి నుంచి టేకాఫ్‌ చేయొచ్చు. విద్యుత్‌ వాహనం కావడంతో విడిభాగాల సంఖ్య తగ్గి.. తయారీ, నిర్వహణ వ్యయాలూ తక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z