రూఫ్‌టాప్ (గృహాలు, భవనాలపైన) లేదా ఇంటి ఆవరణలో ఖాళీస్థలం ఉంటే సౌరవిద్యుత్ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘పీఎం ముఫ్త్ బిజ్లీ యోజన’ కింద రాయితీ పెంచడంతో దరఖాస్తు చేసుకోవడానికి పలువురు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో గత వారం రోజుల్లో 40 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు కేంద్రం ప్రత్యేకంగా ‘పీఎం సూర్య ఘర్’ పేరుతో జాతీయస్థాయి పోర్టల్‌ను ఏర్పాటుచేసింది. దేశంలో ఎవరైనా రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ కావాలనుకుంటే ఇందులోనే దరఖాస్తు చేసుకోవాలి.
Website to apply: http://pmsuryaghar.gov.in/login?redirectUrl=/consumerRegistrationl
ఇంతకాలం రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ఏర్పాటుకు కేంద్ర నవీన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వశాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) రాష్ట్రాలకు పరిమితులు విధించేది. ప్రతి రెండేళ్లకు కొన్ని మెగావాట్ల చొప్పున కోటా ఇచ్చేది. అంతవరకూ మాత్రమే రాయితీ పరిమితంగా ఉండేది. ఉదాహరణకు తెలంగాణకు గత రెండేళ్లలో 50 మెగావాట్ల రూఫ్‌టాప్ సౌరవిద్యుత్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. రాయితీ ఒక్కో కిలోవాట్‌కు రూ.14 వేలే ఉండటంతో ప్రజల నుంచి పెద్దగా స్పందన రాక 30 మెగావాట్ల వరకే ఏర్పాటుచేశారు. దీని అమలు గడువు గత నెలతో ముగిసింది. ఈ నేపథ్యంలో కోటి ఇళ్లకు ఉచిత కరెంటు ఇస్తామనే నినాదంతో కేంద్రం ‘పీఎం సూర్య ఘర్’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. నేరుగా దరఖాస్తు చేయడానికి పోర్టల్‌ను ఏర్పాటుచేసింది. 3 కిలోవాట్ల వరకూ ఏర్పాటుకు ఇంతకాలం ఉన్న రాయితీని రూ.42 వేల నుంచి రూ.78 వేలకు పెంచడంతో పలు రాష్ట్రాల ప్రజలు దరఖాస్తుకు ముందుకొస్తున్నారు. కాగా 3 కిలోవాట్ల సోలార్ ప్లాంటు ఏర్పాటుకు రూ.1.80 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో రూ.78 వేలు సబ్సిడీ లభించనుంది.
ఒక ఇంటికి 3 కిలోవాట్ల సోలార్ ఏర్పాటు వల్ల నెలకు 300 యూనిట్లకు పైగా విద్యుత్ ఉచితంగా లభిస్తుంది. ఇంటికి ఎన్ని కిలోవాట్ల వరకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రాయితీ మాత్రం కేంద్రం 3 కిలోవాట్లకే ఇస్తుంది. తెలంగాణలో 2014 నుంచి ఇంతవరకూ మొత్తం 9,701 ఇళ్లపై సౌరవిద్యుత్ ఏర్పాటుకాగా వీరిలో 96% మంది 3 కిలోవాట్ల వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘పీఎం సూర్య ఘర్’ రాష్ట్రానికి చాలా ఉపయోగకరమని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z