* సొంత తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన వ్యక్తి.. రాష్ట్ర ప్రజలను ఆదరిస్తారా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. అనకాపల్లిలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. మరో రెండు నెలల్లో ప్రజలు జగన్ కుర్చీని మడతపెట్టడం ఖాయమన్నారు.
* ఈనెల 20న జరిగే భాజపా విజయసంకల్ప సభ ఏర్పాట్లను మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈనెల 20న స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఏర్పాట్ల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకుని ఆయన సూచనలు జారీ చేశారు. ఆయన వెంట భాజపా నాయకులు డీఎల్ఎన్ గౌడ్, మోహన్ రెడ్డి, రత్నపురం శ్రీశైలం, తదితరులు ఉన్నారు.
* మరాఠా యోధుడు, హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు. జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం మరాఠా తిరిలే కుంబీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర నేత్ర పర్వంగా సాగింది. స్థానిక రామ్ లీలా మైదానం నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్రలో మహారాష్ట్ర డోలు బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
* తెలంగాణలో గ్రూప్- 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 563 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే/జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష; సెప్టెంబర్/అక్టోబర్‌లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. జోన్‌లవారీగా పోస్టుల వివరాలు, పరీక్ష సిలబస్ తదితర పూర్తి వివరాలు ఈ కింది చూడొచ్చు. పోస్టులు, వయో పరిమితి (జులై 1, 2024 నాటికి), పే స్కేలు వివరాలివే…
డిప్యూటీ కలెక్టర్లు (45 పోస్టులు): 18 నుంచి 46 ఏళ్లు – వేతనం రూ.58,850 – రూ.1,37,050
డీఎస్పీ (115 పోస్టులు): 21 – 35 ఏళ్లు – వేతనం రూ.58, 850 -రూ.1,37,050
సీటీవో (48 పోస్టులు): 18 – 46ఏళ్లు – వేతనం రూ.58, 850 -రూ.1,37,050
ఆర్టీవో (4 పోస్టులు): 21 – 46 ఏళ్లు – వేతనం రూ.54, 220 -రూ.1,33,630
జిల్లా పంచాయతీ అధికారి (7 పోస్టులు): 18 – 46 ఏళ్లు – వేతనం రూ.54,220 -రూ.1,33,630
జిల్లా రిజిస్ట్రార్ (6 పోస్టులు): 18 – 46 ఏళ్లు – వేతనం రూ.54, 220 -రూ.1,33,630
జైళ్ల శాఖలో డీఎస్పీ (5 పోస్టులు): 18 – 35 ఏళ్లు – వేతనం రూ.54, 220 -రూ.1,33,630
సహాయ కార్మిక అధికారి (8 పోస్టులు): 18 – 46 ఏళ్లు – వేతనం రూ.54, 220 -రూ.1,33,630
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (30 పోస్టులు): 21 – 35 ఏళ్లు – వేతనం రూ.51,320 -రూ.1,27,310
గ్రేడ్ -2 మున్సిపల్ కమిషనర్ (41 పోస్టులు): 18 – 46 ఏళ్లు – వేతనం రూ.51,320 -రూ.1,27,310
సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు/జిల్లా అధికారులు (3 పోస్టులు): 18 – 46 ఏళ్లు – వేతనం రూ.54, 220 -రూ.1,33,630
జిల్లా బీసీ అభివృద్ధి అధికారి (5 పోస్టులు): 18 – 46 ఏళ్లు – వేతనం రూ.54, 220 -రూ.1,33,630
జిల్లా గిరిజన సంక్షేమ అధికారి(2 పోస్టులు): 18 – 46 ఏళ్లు – వేతనం రూ.54, 220 -రూ.1,33,630
జిల్లా ఉపాధి కల్పన అధికారి (5 పోస్టులు): 18 – 46 ఏళ్లు – వేతనం రూ.51,320 -రూ.1,27,310
ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (20 పోస్టులు): 18 – 46 ఏళ్లు – వేతనం రూ.51,320 -రూ.1,27,310
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ (38 పోస్టులు): 18 – 46 ఏళ్లు – వేతనం రూ.51,320 -రూ.1,27,310
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (41 పోస్టులు): 18 – 46 ఏళ్లు – వేతనం రూ.51,320 -రూ.1,27,310
ఎంపీడీవో (140 పోస్టులు): 18 – 46 ఏళ్లు – వేతనం రూ.51,320 -రూ.1,27,310
* అయోధ్య రామ్ లల్లా(Ayodhya Ram Mandir) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంపై కర్ణాటకకు చెందిన ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాద్ సోమవారం బెంగళూరులో మాట్లాడుతూ.. రాజకీయ ఉద్దేశంతోనే బీజేపీ రామ మందిరాన్ని నిర్మించిందని ఆరోపించారు. రామ మందిర నిర్మాణం దేశంలోని పేదరికాన్ని నిర్మూలించగలిగిందా అని కామెంట్స్ చేయడం వివాదాన్ని రేపింది.
* త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తాననే విషయం ఇంకా తెలియదని సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ (Actor Ali) అన్నారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తాననే విషయం నాక్కూడా తెలియదు. సీఎంవో నుంచి కాల్ రావాల్సిఉంది. ముఖ్యమంత్రి పిలిచి ‘ఫలానా చోటు నుంచి పోటీ చెయ్’ అని అంటే అందుకు సిద్ధంగా ఉన్నా. ఈ వారంలో కబురు రావచ్చు. ఏ పార్టీలో ఉన్నా, పోటీలో నిలబడిన వ్యక్తి మంచివారైతే ప్రజలు గెలిపిస్తారు. అక్కడినుంచి ఇక్కడికి.. ఇక్కడినుంచి అక్కడికి పార్టీలు మారిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఎవరు ఏమిటనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరితో ఎవరు పొత్తులు పెట్టుకున్నా, అంతిమనిర్ణయం ఓటరుదే. ఎన్నికలకు మేమూ సిద్ధం అంటున్నాం.. వాళ్లూ సిద్ధం అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో!’’ అని అలీ అన్నారు.
* కేంద్ర పర్యావరణశాఖకు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ (Eas Sharma) లేఖ రాశారు. భీమిలిలో కొందరు సీఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘించారని, సహజమైన ఇసుక తిన్నెలను దెబ్బతీశారని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పర్యావరణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన స్పందించలేదన్నారు. విధ్వంసం జరిగిన ప్రాంతంలో తనిఖీకి నిపుణుల బృందాన్ని పంపాలని కోరారు. లేఖపై అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. భీమిలి బీచ్ రోడ్డులో ఇసుక తిన్నెలను తవ్వేస్తూ తీరానికి సమీపంలో కొందరు ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి శర్మ లేఖ రాశారు.
* BRS అధ్యక్షుడు KCR మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. త్వరలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కెసిఆర్ చేస్తున్న మొదటిసారి పర్యటన ఇది. రాష్ట్రంలో తాజా రాజకీయాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాదాన్యత ఏర్పడింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిఅర్ఎస్, బిజెపి ల మద్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరిగినా.. పొత్తు అవకాశాలను రెండు పార్టీల నేతలు కొట్టి పారేస్తున్నారు. కెసిఆర్‌తో పాటు BRS పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.
* ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్‌లు అయినా చేస్తారని మండిపడ్డారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడ్డారు. ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతాని ప్రశ్నించారు. తాము నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడుతున్నామని సజ్జల తెలిపారు. సీఎం జగన్‌ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు. తన పాలనలో ఇది చేశాం అని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు? అని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అమలు చేశామని సజ్జల చెప్పారు.
* సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ కూటమిలోని ప్రాంతీయ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాకపోవడం కాంగ్రెస్‌కు తలపోటుగా మారింది. దీంతో కొన్ని పార్టీలు సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 17 స్థానాలను ఆఫర్ చేసినట్లు ప్రకటించింది. యూపీలో తమ మద్దతు కావాలంటే ఆఫర్‌ను అంగీకరించాలని కాంగ్రెస్‌కు షరతు పెట్టింది. తొలుత ఎస్పీ 11 సీట్లనే కేటాయించినా.. కాంగ్రెస్ డిమాండ్‌తో ఆ సంఖ్యను 17కి పెంచింది. కాగా.. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా హస్తం పార్టీ 52 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. యూపీలోని అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలు కాంగ్రెస్ కుటుంబానికి కంచుకోటలు. దీంతో ఎస్పీ ఈ రెండు స్థానాలకు దూరంగా ఉంది. అయితే, అమేఠీలో రాహుల్ గాంధీ.. భాజపా నేత స్మృతిఇరానీ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దాంతో ఒక్క రాయ్‌బరేలీని గెలుచుకున్న కాంగ్రెస్.. యూపీలోని 80 ఎంపీ స్థానాలకు గానూ ఒక్క సీటుకే పరిమితమైంది.
* వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని, మన కూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. విశాఖపట్నంలో జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ నిధికి తన వంతుగా పవన్ రూ. 10 కోట్లు విరాళం ప్రకటించారు. వ్యక్తిగత గెలుపు కోసం కాదు.. సమష్టి గెలుపు కోసమే తన వ్యూహాలు, అడుగులు ఉంటాయన్నారు. క్షేత్రస్థాయి నుంచి మన బలాన్ని సద్వినియోగం చేసుకుంటూ కూటమిని గెలుపు దిశగా తీసుకెళ్లేందుకు ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జనసేన కోసం తపించి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తనదేనని పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు.
* మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ మేయర్ మేకల కావ్యపై అసమ్మతి వర్గం పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. నగరపాలక సంస్థలో మేయర్ సహా 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు. సోమవారం ఓటింగ్ నిర్వహించగా 20 మంది ఆమెకు వ్యతిరేకంగా ఓటేశారు. ఈ మేరకు ఆర్డీవో ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై సమావేశానికి అసమ్మతి వర్గానికి చెందిన 20 మంది కార్పొరేటర్లు ప్రత్యేక వాహనంలో హాజరయ్యారు. కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ ఓటింగ్ నిర్వహించారు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లో మొత్తం 28 మంది కార్పొరేటర్లు ఉండగా.. గతంలో అనారోగ్యంతో 16వ డివిజన్ కార్పొరేటర్ మృతి చెందారు. మిగిలిన 27 మందిలో 20 మంది మేయర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని బలపరుస్తూ ఓటేశారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ.. 20 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసినట్లు ప్రకటించారు. సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. ఓటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జవహర్‌నగర్ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
* ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తోందని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఉద్యోగ అవకాశాల్లో మహిళల హక్కులను హరించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రోస్టర్ పాయింట్లు లేని సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదని చెప్పారు. తెలంగాణలో మహిళల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందన్నారు. నియామకాల్లో అన్యాయం జరిగేలా తీసుకొచ్చిన జీవో నంబర్ 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z