* ఆమె ప్రేమ పెళ్లి చేసుకోవడమే నేరమైంది. ప్రేమ పెళ్లి చేసుకున్న చెల్లి పట్ల అన్న క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన అచ్చంపేట మండలం గుంపన్‌పల్లిలో చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం గుంపన్‌పల్లికి చెందిన అఖిల ఓ యువకుడిని ప్రేమించింది. వారం రోజుల క్రితమే ప్రేమించిన యువకుడిని పెళ్లాడింది. చెల్లి ప్రేమ వివాహం చేసుకోవడంతో అన్న అఖిల్ రగిలిపోయాడు. మంగళవారం ఉదయం అఖిలపై అఖిల్ కత్తితో దాడి చేసి గాయపరిచాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అఖిలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై ప్రకాశం జిల్లా ఒంగోలులో హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఒంగోలులోని రమేశ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జయరాం సెంటర్‌లోని జిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ రామచంద్రారెడ్డితో ఆర్థిక లావాదేవీలపై చర్చిస్తుండగా.. ఆయన అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు. కత్తులతో దాడి చేయడంతో శ్రీనివాస్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. చర్చల కోసం పిలిచి పథకం ప్రకారం దాడిచేసినట్టు అనుమానిస్తున్నారు. మర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై తెదేపా అధినేత చంద్రబాబు ఆరాతీశారు. ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు.
* అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశార్హత కోసం నిర్వహించే డ్యూలింగ్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా హయత్‌నగర్‌లోని వెంకటేశ్వర లాడ్జిలో గది అద్దెకు తీసుకుని మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అమెరికా, ఐర్లాండ్, ఆస్ట్రేలియాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చేరాలనుకునే వారి కోసం డ్యూలింగ్ పరీక్ష నిర్వహిస్తుంటారు. ఆన్‌లైన్‌లో ఈ పరీక్షను ఇతరులకు బదులుగా ప్రవీణ్ రెడ్డి, హరినాథ్, కృష్ణ, అరవింద్ రెడ్డి, సంతోష్, నవీన్ కుమార్, వినయ్‌లు రాస్తున్నట్లు గుర్తించిన నిర్వాహకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో హోటల్‌పై దాడి చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. పరీక్ష రాసేందుకు ఒక్కో వ్యక్తి నుంచి రూ.ఐదు నుంచి రూ.పది వేలు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. వీరి నుంచి ఐదు ల్యాప్‌టాప్‌లు, నాలుగు పాస్‌పోర్టులు, ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను హయత్‌నగర్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
* కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జగిత్యాల రహదారిలోని సుభాష్‌నగర్‌లో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులు పూరిళ్లు వేసుకుని నివాసముంటున్నారు. ఈ ప్రాంతంలో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 5 గ్యాస్ సిలిండర్లు పేలాయి. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. పూరిళ్లలోని కార్మిక కుటుంబాలు మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z