* పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. నరసాపురం మండలం పీఎంలంక డిజిటల్ కమ్యూనిటీ సెంటర్‌ను మంత్రి సందర్శించారు. వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా శిక్షణ పొందిన మహిళలతో మాట్లాడారు. పీఎంలంకలో సముద్ర కోత నివారణకు కేంద్రం చర్యలు చేపడుతోందని, రక్షణగోడ నిర్మాణానికి టెండరు ఖరారు చేసినట్లు తెలిపారు. త్వరలో నిర్మాణపనులు ప్రారంభమవుతాయన్న మంత్రి, దేశీయ స్థాయిలో ఇది మొదటి ప్రయోగాత్మక ప్రాజెక్టు అని చెప్పారు.
* ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుబట్టింది. అద్దంకి వాసి బొల్లా సురేష్, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను అనుమతించటం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కోర్టుకు తెలిపారు. ఎన్‌సీఈటీ నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టిందన్నారు.
* సార్వత్రిక ఎన్నికల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన అధికారులు షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. మార్చి 9వ తేదీ తర్వాత ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
* తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలితకు సంబంధించిన బంగారు ఆభరణాలను.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరు కోర్టు తేదీని ఖరారు చేసింది. వాటిని తీసుకువెళ్లడానికి ఆరు ట్రంకు పెట్టెలను తెచ్చుకోవాలని చెప్పింది.
* నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఏడాదిలో రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. దీన్ని వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అకడమిక్ సెషన్ నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘‘2025-26 అకడమిక్ సెషన్ నుంచి పది, 12వ తరగతి బోర్డు పరీక్షలను విద్యార్థులు ఏడాదిలో రెండు సార్లు రాసే వీలు కల్పించనున్నాం. ఇందులో ఉత్తమ స్కోరును ఎంచుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడికి దూరం చేసిన నాణ్యమైన విద్యను అందించడమే మా సర్కారు లక్ష్యం. ఈ ఫార్ములా దేశాన్ని 2047 నాటికి వికసిత భారతంగా తీర్చిదిద్దుతుంది’’ అని వెల్లడించారు.
* కరీబియన్ దేశం హైతీ(Haiti) మాజీ అధ్యక్షుడు జొవెనల్ మోయిస్ హత్య కేసులో ఆయన సతీమణిపైనే నేరాభియోగాలు నమోదయ్యాయి. ఆమెతో పాటు మాజీ ప్రధాని, హైతీ నేషనల్ పోలీస్ మాజీ చీఫ్‌పై అభియోగాలు మోపుతూ విచారణాధికారి నివేదిక విడుదల చేశారు. 2021లో మోయిస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన వ్యక్తిగత నివాసంలోనే హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. జొవెనెల్ సతీమణి మార్టిన్ మోయిస్, మాజీ ప్రధాని క్లాడె జోసెఫ్ ఈ హత్యకు సహకరించారని పేర్కొన్న అధికారులు.. అప్పటి పోలీస్ చీఫ్ లియోన్ చార్లెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. హత్య, హత్యాయత్నం, అంతర్గత భద్రతకు వ్యతిరేకంగా కుట్ర వంటి అభియోగాలు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో ఉన్నతస్థాయి వ్యక్తుల్ని నిందితులుగా చేర్చుతూ విడుదలైన ఈ నివేదికతో దేశం మరింత అస్థిరతలోకి జారిపోనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
* అటెన్షన్ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండడం అసహ్యంగా ఉందంటూ ప్రముఖ నటి త్రిష (Trisha) అసహనం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఇకపై తాను ఇచ్చే సమాధానం లీగల్ డిపార్ట్‌మెంట్ నుంచే వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ (ఇంతకుముందు ట్విటర్) వేదికగా పోస్ట్ పెట్టారు. తన అసహనానికి కారణమేంటో చెప్పలేదు. తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే పార్టీ మాజీ లీడర్ ఏవీ రాజు చేసిన ఆరోపణలపైనే ఆమె స్పందించారని తెలుస్తోంది. ఎమ్మెల్యే జి.వెంకటాచలాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన రాజు, త్రిష వ్యక్తిగత జీవితంపైన కూడా కామెంట్ చేశారు. సదరు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన త్రిష అభిమానులు, నెటిజన్లు ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోండంటూ రిప్లై ఇచ్చారు. ‘త్రిష.. మీకు మేం ఉన్నాం’ అంటూ పలువురు సినీ తారలు సైతం మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలోనే నటి రియాక్ట్ అయినట్లు సమాచారం. ఇంతకుముందు నటుడు మన్సూర్ అలీఖాన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
* లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా కూటమిలో సీట్ల పంపకాల అంశం ఇంకా ఎటూ తేలలేదు. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ (Congress) స్పందించింది. కూటమిలోని ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయని.. ఏ సమయంలోనైనా ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. సీట్ల పంపకాలకు సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. ఇప్పటికే తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే కూటమిలోని పార్టీలతో కమిటీని కూడా నియమించిన విషయాన్ని ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు.
* జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరంలోని పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, రూరల్, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత పార్టీనేత కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ దిశానిర్దేశం చేశారని తెలిపారు. తెదేపా, భాజపా, జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తాయని చెప్పారని తెలిపారు. రాజానగరం నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని పవన్ ఇప్పటికే ప్రకటించారు. పొత్తులో భాగంగా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేయనున్నట్టు సమాచారం.
* కర్నూలులోని ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై వైకాపా మూక దాడి అమానుషమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇటీవల రాప్తాడులోఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడిని ఖండిస్తున్నట్టు చెప్పారు. ‘‘పత్రికా స్వేచ్ఛను వైకాపా హరిస్తోందనడానికి ఈ దాడులే నిదర్శనం. నిజాలు జీర్ణించుకోలేక నిందలు మోపడం, దాడులకు దిగడం, కొట్టి చంపడం అధికార పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. జర్నలిస్టులు, పత్రికా కార్యాలయాలపై దాడులకు పాల్పడటం వైకాపా పాలనలో నిత్యకృత్యం. పత్రికా ప్రతినిధులపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్టే. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.
* సీఈవో ముఖేష్ కుమార్ మీనాను పల్నాడు జిల్లా తెదేపా మాచర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి కలిశారు. తమ నియోజకవర్గ పరిధిలో రిగ్గింగ్ జరగకుండా చూడాలని సీఈవోకి వినతిపత్రం అందజేశారు. మాచర్ల పరిధిలోని 9 గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగే ఆస్కారం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2009, 2014, 2019లో కాంగ్రెస్, వైకాపా రిగ్గింగ్‌కు పాల్పడ్డాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించి స్థానిక ఎన్నికల్లో వైకాపా ఏకగ్రీవ స్థానాల వివరాలను సీఈవోకి అందజేశారు.
* పాతికేళ్ల పాటు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఇప్పుడు పెద్దల సభలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అటు భాజపా (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) కూడా గుజరాత్ నుంచి ఎలాంటి పోటీ లేకుండానే ఎగువ సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభలో ఏర్పడిన ఖాళీల భర్తీకి ఎన్నికల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారంతో గడువు ముగిసింది. రాజస్థాన్ నుంచి ఖాళీ కానున్న మూడు స్థానాలకు కాంగ్రెస్ నుంచి సోనియాగాంధీ, భాజపా నుంచి చున్నిలాల్ గరాసియా, మదన్‌రాథోడ్ నామినేషన్ వేశారు. పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో ఈ ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. ఈ రాష్ట్రంలో మొత్తం 10 రాజ్యసభ స్థానాలుండగా.. తాజా ఫలితాలతో కాంగ్రెస్‌కు ఆరు, భాజపాకు నలుగురు సభ్యులున్నారు.
* తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర కొనసాగుతోంది. మంగళవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం కొడతనపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త వెంకటేష్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గతేడాది అక్టోబరు 10న వెంకటేష్ గుండెపోటుతో మృతిచెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, రూ.3 లక్షల చెక్కును అందజేశారు. పార్టీ తరఫున వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెంకటేష్ ముగ్గురు పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చదివించనున్నట్లు ప్రకటించారు.
* భాజపాలో చేరడానికి మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (Kamal Nath) సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంది. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ నిమిత్తం రాష్ట్రంలో చేస్తున్న ఏర్పాట్లపై జరిగిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. భోపాల్‌లో మంగళవారం ఉదయం వర్చ్యూవల్ విధానంలో ఇది జరిగింది. దీంతో తనపై వస్తున్న ప్రచారానికి ఓ రకంగా అడ్డుకట్ట వేసినట్లైంది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z