Politics

కుప్పం నుండి భువనేశ్వరి పోటీ-NewsRoundup-Feb212024

కుప్పం నుండి భువనేశ్వరి పోటీ-NewsRoundup-Feb212024

* ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో తొలిసారి ఆయన పర్యటించారు. కోస్గిలో రూ.4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అందులో ప్రధానమైనది రూ.2,945 కోట్లతో నిర్మించనున్న నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం. అనంతరం మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి.. వారితో ముఖాముఖిలో పాల్గొన్నారు. అభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేస్తామని.. ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా పంటల కొనుగోళ్లు చేపడతామని సీఎం తెలిపారు. కార్యక్రమంలో సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

* రాష్ట్రంలో భావసారుప్యత కలిగిన పార్టీలతో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తామని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో భాజపా, రాష్ట్రంలో వైకాపా వ్యతిరేక పార్టీలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 23న వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులతో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సమావేశమవుతారని తెలిపారు. చర్చల తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. విభజన హామీలు, రాజధాని వంటి అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగసభలు నిర్వహించనున్నట్టు వివరించారు. ఈనెల 26న అనంతపురంలో నిర్వహించే బహిరంగసభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు జాతీయ స్థాయి నాయకులు పాల్గొంటారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

* ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం(Israel-Hamas conflict)తో గాజా(Gaza)లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్యుల బతుకు ఛిద్రమవుతోంది. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆపినా.. రానున్న ఆరునెలల్లో సుమారు 8 వేల మంది మృతి చెందే అవకాశం ఉంది. ఈమేరకు అమెరికా, లండన్‌లకు చెందిన నిపుణులు రూపొందించిన నివేదిక పేర్కొంది. లండన్‌ స్కూల్‌ ఆప్‌ హైజీన్‌ అండ్ ట్రాపికల్‌ మెడిసిన్‌, జాన్స్‌ హాప్కిన్స్‌ సెంటర్‌ ఫర్ హ్యుమేనిటేరియన్ హెల్త్‌కు చెందిన నిపుణులు ఈ గణాంకాలు వెల్లడించారు. ఈ యుద్ధం కారణంగా 2.3 మిలియన్ల గాజా జనాభాలో 85 శాతం మంది తాముంటున్న ఇళ్లను వదిలేసి వెళ్లిపోవాల్సివచ్చింది. ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి. కిక్కిరిసిన షెల్టర్లలోని ప్రజలను పోషకాహార లోపం వెంటాడుతోంది. అతిసారం కేసులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో వైద్య వ్యవస్థ పటిష్ఠంగా ఉండటంతో ఇజ్రాయెల్‌లో ఇలాంటి పరిస్థితులు ఉండవని పేర్కొన్నారు.

* ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు (12) కొట్టిన బ్యాటర్లు ఇద్దరు. ఒకరు పాక్‌ దిగ్గజం కాగా.. మరొకరు టీమ్‌ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో డబుల్‌ సెంచరీ చేసిన యశస్వి పన్నెండు సిక్స్‌లు బాదేశాడు. అంతకుముందు పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు వసీమ్‌ అక్రమ్ 1996లో జింబాబ్వేపై 12 సిక్స్‌లు కొట్టాడు. తన రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేదని.. యశస్వి సమం చేశాడని ఓ ఇంటర్వ్యూలో అక్రమ్‌ వ్యాఖ్యానించాడు. ‘‘ప్రజలు చాలామంది నేను జింబాబ్వేపై చేశానని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. నేను 170/6 స్కోరు వద్ద క్రీజ్‌లోకి వచ్చా. అప్పుడు దూకుడుగా ఆడి 257 పరుగులు చేశా. కానీ, మ్యాచ్‌ డ్రాగా ముగిసింది’’ అని అక్రమ్‌ గుర్తు చేసుకున్నాడు.

* తమ క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఆటగాడు లాల్‌చంద్‌ రాజ్‌పూత్‌ను నియమిస్తూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవిలో రాజ్‌పూత్‌ మూడేళ్ల పాటు కొనసాగుతాడని బోర్డు వెల్లడించింది. 62 ఏళ్ల లాల్‌చంద్‌ గతంలో భారత్‌ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అఫ్గానిస్థాన్‌, జింబాబ్వే టీమ్‌లకూ కోచింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం యూఏఈ కోచ్‌గా ముదస్సర్ నాజర్‌ వ్యవహరిస్తున్నారు. అతడి స్థానంంలో లాల్‌చంద్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

* కాంట్రాక్టరు నుంచి రూ.84 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జగజ్యోతిని నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు హాజరు పర్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

* యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ఓ ఉపగ్రహం నేడు భూమిపై కూలిపోనుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దాదాపు రెండు టన్నుల బరువున్న ఈఆర్‌ఎస్‌-2 కక్ష్య నుంచి జారిపోయి భూ వాతావరణానికి సమీపంలో చేరింది. దీనిని 1995లో భూమిని పరిశీలించేందుకు ప్రయోగించారు. 2011లో దీని కాలపరిమితి తీరింది. ఇది నేడు వాతావరణంలోకి ప్రవేశించనుంది. వేగం కారణంగా తలెత్తే ఘర్షణకు మార్గ మధ్యలోనే చాలావరకు కాలిపోయిన కొన్ని విడిభాగాలు భూమిపై పడే అవకాశం ఉందని అంచనా వేశారు. నివాస ప్రదేశాలపై ఇవి పడే అవకాశం తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. చాలావరకు శకలాలు సముద్రంలోనే పడతాయని అంచనా వేస్తున్నారు.

* కుప్పం కార్యకర్తలతో తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) సరదా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు విశ్రాంతి ఇచ్చి.. వచ్చే ఎన్నికల్లో తాను నిలబడతానని అన్నారు. ‘చంద్రబాబుకు ఓటేస్తారా? నాకు ఓటేస్తారా?’ అని భువనేశ్వరి సరదాగా కార్యకర్తలను అడిగారు.

* అనకొండనే ప్రపంచంలో అతిపెద్ద పాము జాతి అని అనుకున్నాం. అదే జాతికి చెందిని మరో జాతి అనకొండను ఈ క్వెడార్‌లో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఎన్నో ఏళ్లుగా ఈ అనకొండకు సంబంధించి మరో జాతి గురించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. శాస్త్రవేత్తల ఊహను నిజం చేస్తే మరో జాతి అనకొండ వాళ్ల కంటపడింది. ఇది 26 అడుగుల మరియు 200 కిలోల మేర బరువుంది. ఈ మేరకు శాస్త్రవేత్త విల్‌ స్మిత్‌ల బృందం రానున్న నాట్‌ జియాఓ సిరిస్‌ పోల్‌ టు పోల్‌ కోసం ఫోటో షూట్‌ చేస్తున్నారు.

* స్వార్థరహితంగా ఆలోచించే ఏ కూటమితోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడుకు చెందిన ఎమ్‌ఎన్‌ఎమ్‌ పార్టీ చీఫ్‌ కమల్‌హాసన్‌ తెలిపారు. ఇండియా కూటమిలో చేరతారా? అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ఇప్పటివరకైతే ఇండియా కూటమిలో తాము భాగస్వాములం కాదని స్పష్టం చేశారు. ఏ కూటమిలో చేరినా స్థానిక ఫ్యూడల్‌ శక్తులతో కలిసి మాత్రం పనిచేయబోమని చెప్పారు. స్టాలిన్‌కు చెందిన డీఎంకే పార్టీతో కమల్‌హాసన్‌ కలిసి పనిచేయబోతున్నారన్న పుకార్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కమల్‌ ఇచ్చిన సమాధానం చర్చనీయాంశమైంది. స్టార్‌ హీరో విజయ్‌ రాజకీయాల్లోకి రావడాన్ని కమల్‌హాసన్‌ ఈ సందర్భంగా స్వాగతించారు.

* జాతీయ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ. 65 కోట్ల బ‌కాయిల‌ను ఆదాయ ప‌న్ను శాఖ రిక‌వరీ చేసింది. ఆదాయ ప‌న్ను శాఖ‌కు కాంగ్రెస్ మొత్తం రూ. 115 కోట్ల ప‌న్ను బ‌కాయిలు చెల్లించాల్సి ఉండ‌గా ప్రస్తుతానికి రూ. 65 కోట్లు రిక‌వ‌రీ చేసింది. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతా నుంచి ఈ నిధుల‌ను ఐటీ శాఖ రిక‌వరీ చేసింది. రూ. 65 కోట్ల రికవరీకి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించింది. ఐటీ శాఖ రికవరీ చర్యలపై ఫిర్యాదు చేసింది. బెంచ్ ముందుకు విచార‌ణ ఫ‌లితం కోసం వేచిచూడ‌కుండానే బ్యాంకుల వ‌ద్ద కాంగ్రెస్ ఖాతాల్లో ఉన్న డ‌బ్బులో కొంత మొత్తాన్ని ఐటీ శాఖ బ‌కాయిల కింద రిక‌వ‌రీ చేసింద‌ని ఫిర్యాదులో పేర్కొంది.

* విధ్వంసకర బ్యాటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, క్రిస్‌ గేల్‌, హెర్షల్‌ గిబ్స్‌, సురేశ్‌ రైనా, యూసఫ్‌ పఠాన్‌ మరోసారి విధ్వంసానికి రెడీ అంటున్నారు. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే వెటరన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో వీరు మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. తొలిసారి నిర్వహించబడుతున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 3న ముగుస్తుంది. తొలుత ఈ టోర్నీని డెహ్ర‌డూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల వేదికను గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు మారుస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z