Politics

తెదేపాను NDAలోకి ఆహ్వానించారు-NewsRoundup-Feb 22 2024

తెదేపాను NDAలోకి ఆహ్వానించారు-NewsRoundup-Feb 22 2024

* తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించారని, దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.. దాపరికం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. భాజపాతో మాట్లాడుతున్నాం.. పొత్తు గురించి త్వరలోనే ప్రకటన ఉంటుందన్నారు. తెదేపా- జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో 2 తీర్మానాలను ఆమోదించినట్లు తెలిపారు. పొత్తును స్వాగతించిన తెదేపా-జనసేన కేడర్‌ను అభినందిస్తూ తీర్మానం చేశామన్నారు. మీడియాపై దాడులను తప్పు పడుతూ సమన్వయ కమిటీ రెండో తీర్మానం చేసిందన్నారు.

* అమెరికాలో టెలికాం సేవల్లో భారీ అంతరాయం (Cellular Outage) ఏర్పడింది. ఏటీ&టీ, వెరిజోన్‌, టీ-మొబైల్‌తో పాటు ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌లలో (Mobile Networks) కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్‌డిటెక్టర్‌ అనే నెట్‌వర్క్‌ ట్రాకింగ్‌ సైట్‌ వెల్లడించింది. షికాగో, లాస్‌ ఏంజిల్స్‌‌, న్యూయార్క్‌ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్‌, బ్రూక్లిన్‌ ప్రాంతాల్లోని వినియోగదారులు గురువారం తెల్లవారుజామున సిగ్నల్‌ సమస్య ఎదుర్కొన్నట్లు సమాచారం. ఒకే సమయంలో ఈ నెట్‌వర్క్‌లన్నింటిలో సమస్య తలెత్తడం చర్చనీయాంశంగా మారింది.

* ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). ఇది విడుదలవకముందే దక్షిణాదిలో.. రామ్‌చరణ్‌ (Ram Charan) సరసన ఓ సినిమా (#RC 16)లో, సూర్య (Suriya)కు జోడీగా ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్‌ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దానిపై జాన్వీ స్పందించారు. ఆ స్టేట్‌మెంట్‌ గురించి బోనీ కపూర్‌ తనక్కూడా చెప్పలేదని, అధికారిక ప్రకటన లేకుండా వాటి గురించి మాట్లాడడం సబబు కాదని అన్నారు.

* మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ (Kamal Nath) భాజపా (BJP)లో చేరతారని జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగనున్నట్లు పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర భాజపా నేత కైలాష్‌ విజయ్‌ వర్గీయ (Kailash Vijayvargiya) స్పందిస్తూ ఆయన అవసరం కాషాయ పార్టీకి లేదన్నారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు.

* విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అకారణంగా కరెంట్‌ కట్‌ చేస్తే సస్పెండ్‌ చేస్తాం. ప్రభుత్వం ఎక్కడా విద్యుత్‌ కోతలు విధించట్లేదు. కొందరు సిబ్బంది ఉద్దేశపూర్వకంగా కోతలు పెడుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఈ కుట్రలను సహించేది లేదు. మరమ్మతులు చేస్తే వినియోగదారులకు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చాకే విద్యుత్‌ ఆపాలి’’ అని సీఎం స్పష్టం చేశారు.

* తేజ సజ్జా కీలక పాత్రలో ప్రశాంత్‌ వర్మ రూపొందించిన చిత్రం ‘హను-మాన్’ (Hanu Man). సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులతో పాటు, ఇతర భాషల వారినీ అలరించింది. ముఖ్యంగా నార్త్‌ ఆడియన్స్‌ కూడా ఈ కథకు బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇప్పుడదే సరికొత్త రికార్డు సృష్టించేలా చేసింది. 2024లో బాలీవుడ్‌లో రూ.200 కోట్లు వసూలు చేసిన రెండో చిత్రంగా నిలిచింది. హృతిక్‌ రోషన్‌ నటించిన ‘ఫైటర్‌’ (Fighter) ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా వసూలు చేయగా, రూ.200 కోట్ల వసూళ్లతో ‘హనుమాన్‌’ రెండో స్థానంలో నిలిచింది.

* ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2024) కొత్త సీజన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్‌ X రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. తొలి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌లను తెలిపారు.

* మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు. అనంతరం అమరావతి కరకట్టపై భారీగా మోహరించిన పోలీసులు.. తొలుత కార్యకర్తలు, నాయకులను బలవంతంగా వాహనాల్లో తరలించారు. గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. షర్మిల కారు దిగగానే చుట్టుముట్టి బలవంతంగా అరెస్టు చేసి పోలీసు వాహనం ఎక్కించారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘సీఎం డౌన్‌ డౌన్‌’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. షర్మిలతో పాటు కార్యకర్తలు, నాయకులను దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

* స్టార్‌ హీరో విజయ్‌ కొత్త పార్టీ ప్రకటన తర్వాత.. తమిళనాడు రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు టైం ఉంది. ఈలోపే విజయ్‌ ‘‘తమిళగ వెట్రి కళగం’’ TVK ఎవరితో చేతులు కలుపుతుంది? ఏ మేర ప్రభావం చూపెడుతుందంటూ డిబేట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రవేశంపై విజయ్‌ ప్రశాంత్‌ కిషోర్‌తో సైతం చర్చలు జరిపినట్లు వార్తలు వినవచ్చాయి. ఓ తమిళ ఛానెల్‌ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ కిషోర్‌కు దీనికి సంబంధించి ప్రశ్న ఎదురైంది. విజయ్‌ అడిగితే ఆయన పార్టీ కోసం పని చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘విజయ్‌ నాతో టచ్‌లో లేరు. ప్రస్తుతం ఎన్నికల వ్యహకర్త వ్యవహారాలను నేను చూడడం లేదు. ఒకవేళ ఆయన నన్ను అడిగినా.. ఆ పని చేయలేను. కానీ, ఆయన కోరుకుంటే మాత్రం సలహాలు ఇచ్చి సాయం చేయగలను. ఎందుకంటే.. నన్ను గౌరవించే వాళ్లకు సలహాలు ఇవ్వడం నాకు అలవాటు’’ అని పీకే క్లారిటీ ఇచ్చారు.

* టీడీపీ, జనసేన పార్టీలు గందరగోళంలో ఉన్నాయని, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలీదంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన సత్తెనపల్లెలో మీడియాతో మాట్లాడుతూ, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో కూడా తెలీదు. చంద్రబాబు, పవన్‌ రెస్ట్‌ తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఏ పార్టీకి విశ్వాసం లేని వ్యక్తి నాపై పోటీకి దిగుతున్నాడు. ఇద్దరు విశ్వాస ఘాతకులు నాపైనా, అనిల్‌పైనా పోటీ చేస్తున్నారు. పార్టీలు మారిన వ్యక్తులు మాపై పోటీ చేస్తున్నారు. విశ్వాస ఘాతకులను తరిమికొట్టాలని సత్తెనపల్లి ప్రజలను కోరుతున్నా’’ అని మంత్రి అంబటి పిలుపునిచ్చారు.

* అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ క్రమంలో అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పు కామెంట్స్‌ను కేటీఆర్‌ ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత్‌ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సూచించారు. కాగా, మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీస్‌పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు వ్యాఖ్యలు చేసింది. అతడిపై ఎలాంటి చర్యలు ఉండబోవని తెలిపింది. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z