తెలంగాణలో మరోసారి కిడ్నీ రాకెట్ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. క్రయవిక్రయాలకు సంబంధించి సామాజిక మాధ్యమంలో ప్రకటనలపై అందిన ఫిర్యాదు మేరకు తెలంగాణ సీఐడీ సెక్షన్ 18, 19 ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్-1994 చట్టం కింద కేసు నమోదు చేసింది. టెలిగ్రామ్ యాప్‌లో ఓ ఛానెల్ ద్వారా దందా సాగిస్తున్న అంశంపై సామాజిక కార్యకర్త ఒకరు ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ బృందం దర్యాప్తు ప్రారంభించింది. కిడ్నీ అవసరమున్న బాధితులను గుర్తించి ఆ గ్రూపులో చేర్చేలా ముఠా కుట్ర పన్నినట్లు వెల్లడైంది. అడ్మిన్ మాత్రమే సభ్యులను చేర్చేలా గుట్టుగా దందా సాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇది సైబర్ మోసమా లేక నిజంగానే కిడ్నీలు విక్రయిస్తున్నారా..? అని తేల్చే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరైనా బాధితులు ఈ ముఠా బారినపడ్డారా..? అని ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో గతంలోనూ పలు కిడ్నీ రాకెట్‌లు బహిర్గతమయ్యాయి. సీఐడీతోపాటు హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇవి వెలుగుచూశాయి. శ్రీలంకకు తీసుకెళ్లి కిడ్నీలను మార్పిడి చేయించిన ముఠాలను పోలీసులు గుర్తించారు. 2016నాటి కేసులో సీఐడీ గత ఏడాదే అభియోగపత్రం దాఖలు చేసింది. తాజాగా మరోసారి వెలుగుచూసిన నేపథ్యంలో పాత ముఠాల్లోని నిందితుల గురించి సీఐడీ ఆరా తీస్తోంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z