2024 తానా ఎన్నికల ఫలితాలు ఎన్నికల కమిటీ ప్రకటించినప్పటికీ అధికారికంగా తానా బోర్డు ప్రకటించలేదు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పలు అనుమానాలు, ప్రశ్నలను బోర్డుకు నివేదించారు. ఎలక్షన్ ట్రస్ట్ నుండి ఎన్నికల నిర్వహణ నివేదిక లభించని కారణంగా వీరికి సమాధానం ఇవ్వలేదని బోర్డు ఛైర్మన్ డా. బండ్ల హనుమయ్య మంగళవారం నాడు సభ్యులకు ఈ-మెయిల్ పంపించారు. కాగా, ఎలక్షన్ ట్రస్ట్ నుండి నివేదిక మంగళవారం నాడు అందిందని, దీన్ని పరిశీలించిన అనంతరం నివేదికలో లోటుపాట్లు ఉన్నాయని గుర్తించి మరికొంత అదనపు సమాచారాన్ని ఎలక్షన్ ట్రస్ట్ నుండి అభ్యర్థించామని పేర్కొన్నారు. ఈ సమగ్ర సమాచారాన్ని వారం రోజుల లోపు బోర్డుకు అందేలా చూసేందుకు డా. జంపాల చౌదరితో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు హనుమయ్య తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీన తానా బోర్డు మరోసారి సమావేశమై పోటీదారులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందని వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z