Kids

సిద్ధిపేటలో మూడేళ్ల చిన్నారి హత్య-CrimeNews-Feb242024

సిద్ధిపేటలో మూడేళ్ల చిన్నారి హత్య-CrimeNews-Feb242024

* సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారి మతిస్థిమితం లేని మేనమామ చేతిలో హతమైన ఘటన నంగునూర్‌ మండలం బద్దిపడగ గ్రామంలో జరిగింది. శిరీష (3) తల్లి సంతోషితో కలిసి గ్రామంలోని పొలానికి వెళ్లింది. తల్లి పొలంలో పనిచేస్తుండగా.. సమీపంలో ఆడుకుంటున్న శిరీషను ఆమె మేనమామ శ్రీనివాస్‌ బురదలో తొక్కి హతమార్చాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌ మానసిక స్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

* బ్రాండెడ్‌ పేరిట నకిలీ నిత్యావసర వస్తువులు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. నలుగురిని ఈస్ట్‌ జోన్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. రెడ్‌లేబుల్‌, బ్రూక్‌బాండ్‌ టీ పౌడర్‌, లైజాల్‌, హార్పిక్‌, సర్ఫ్‌ ఎక్సెల్‌, ఎవరెస్ట్‌ మసాలా, పారాచూట్‌ హెయిర్‌ ఆయిల్‌ పేరుతో నకిలీవి తయారు చేస్తున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్‌ తెలిపారు. కాటేదాన్, నాగారం ప్రాంతాల్లో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేశామన్నారు. నలుగురిని అరెస్టు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. బిహార్, రాజస్థాన్‌ రాష్ట్రాలకు చెందిన నిందితులు.. నకిలీ వస్తువులను నగరంలోని వివిధ కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. మార్కెట్‌ ధర కంటే తక్కువకే వీటిని డిస్టిబ్యూటర్లకు విక్రయిస్తున్నారని డీసీపీ వివరించారు.

* పటాన్‌చెరు శివారులో బాహ్యవలయ రహదారిపై కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఎందుకు జరిగింది? ఎలా జరిగింది?అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. ముందు వెళ్తోన్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఓఆర్‌ఆర్‌పై రెండో లైనులో వెళ్తోన్న వాహనం చివరకు రెయిలింగ్‌ను ఢీకొని ఆగిపోయినట్లు గుర్తించారు. ప్రమాద స్థలం నుంచి దాదాపు 500మీటర్ల దూరంలో కారు స్పేర్‌పార్టు, కారుపై రాక్‌శాండ్‌ పౌడర్‌ పడి ఉండటంతో టిప్పర్‌ లేదా రెడిమిక్స్‌ వాహనాన్ని ఢీకొట్టి ఉంటుందని నిర్ధరణకు వచ్చారు. ప్రమాద సమయంలో ఓఆర్‌ఆర్‌పై వెళ్లిన ఆరు టిప్పర్‌ల వివరాలను గుర్తించారు. అయితే, ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ ఆకాశ్‌ మద్యం తాగి ఉన్నాడా? లేదా? అనే వివరాల నిర్ధరణ కోసం అతని రక్త నమూనాలను పరీక్షల కోసం పంపారు. ముత్తంగి బాహ్యవలయ రహదారి దాటుతున్న సమయాలను తెలుసుకొన్నారు. ఆకాశ్‌ చరవాణి వివరాలు కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే మేజిస్ట్రేట్ ఎదుట డ్రైవర్‌ వాంగ్మూలం తీసుకున్నారు. హై ప్రొఫైల్ కేసుకావడంతో సంబంధిత శాఖలోని నిపుణులతో దర్యాప్తు చేస్తున్నారు.

* ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులను తీసుకెళ్తున్న ఒక ట్రాక్టర్ చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 15 మంది మృతి చెందారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులున్నారు. ఆ యాత్రికులంతా హరిద్వార్‌ వెళ్తుండగా కాస్‌గంజ్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మాఘ పూర్ణిమను పురస్కరించుకొని గంగా నదిలో పవిత్ర స్నానమాచరించేందుకు వారంతా హరిద్వార్‌ వెళ్తుండగా.. ట్రాక్టర్‌ అదుపుతప్పి చెరువులో బోల్తాపడింది. గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి కొంతమందిని కాపాడారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z