* బృహత్ బెంగళూరు మహానగర పాలికె మార్గదర్శక విలువ ఆధారిత ఆస్తిపన్నును ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో బెంగళూరు నగరంలోని నివాస, కమర్షియల్ భవనాలను అద్దెకు ఇచ్చిన యజమానులపై అదనపు భారం పడబోతోంది. ఆస్తిపన్ను విలువలలో ఈ భారీ పెరుగుదల ఇప్పటికే అధిక అద్దెల భారం మోస్తున్నవారిపై మరింత భారాన్ని పెంచే అవకాశం ఉంది. కొత్త ఆస్తి పన్ను విధానం ప్రకారం.. యజమానులు తామె స్వయంగా నివాసం ఉంటున్న ఆస్తులపై చెల్లించే పన్నుతో పోలిస్తే అద్దెకు ఇచ్చిన ఆస్తులపై రెండింతలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇతర వాణిజ్య భవనాల విషయానికి వస్తే పన్ను 3-5 రెట్లు పెరగనుంది.
* దేశీయ ప్రయాణికుల వాహన పరిశ్రమ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐదు శాతం కంటే తక్కువకే పరిమితమవుతుందని టాటా మోటార్స్ (Tata Motors) అంచనా వేసింది. విద్యుత్ వాహన (Electric Vehicles- EV) విక్రయాల జోరు మాత్రం కొనసాగుతుందని కంపెనీ డైరెక్టర్ శైలేశ్ చంద్ర తెలిపారు. దేశవ్యాప్తంగా ఛార్జింగ్ వసతులు ఇంకా పుంజుకోవాల్సి ఉన్నప్పటికీ.. ఈవీ అమ్మకాలు మాత్రం పెరుగుతాయన్నారు. ‘‘2022-23లో ప్రయాణికుల వాహన విక్రయాల్లో 25 శాతం వృద్ధి నమోదైంది. 2023-24లో అది ఎనిమిది శాతంగా ఉంది. 2024-25లో వృద్ధి ఐదు శాతం కంటే దిగువకే పరిమితమవుతుంది. ఈవీ పరిశ్రమ విషయానికి వస్తే విక్రయాలు పుంజుకుంటున్న స్థాయిలో ఛార్జింగ్ మౌలిక వసతుల అభివృద్ధి జరగడం లేదు. ప్రస్తుతానికి ఇది పెద్ద సవాల్‌గా మారింది. గత త్రైమాసికంలో కమొడిటీ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ, రాబోయే రోజుల్లో కొన్నింటి ధరలు పెరిగే అవకాశం ఉంది’’ అని చంద్ర తెలిపారు.
* దేశంలో కుటుంబాల నెలవారీ తలసరి వినియోగ వ్యయం (MPCE) పట్టణాల్లో 2022-2023లో రూ.6,459కి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.3,773గా నమోదైంది. మొత్తం వ్యయంలో ఆహార ఖర్చుల వాటా గ్రామీణ ప్రాంతాల్లో 52.9 శాతం నుంచి 46.4 శాతానికి తగ్గింది. పట్టణాల్లో 42.6 శాతం నుంచి 39.2 శాతానికి క్షీణించడం గమనార్హం. జాతీయ గణాంక సర్వే కార్యాలయం నిర్వహించిన ‘గృహ వినియోగ వ్యయ సర్వే (HCES)’ ఫలితాలను శనివారం ప్రభుత్వం వెల్లడించింది. 11 ఏళ్లలో ఎంపీసీఈ వివరాలు తొలిసారి వెలువడ్డాయి. ఆగస్టు 2022 నుంచి జులై 2023 మధ్య ఈ సర్వేను నిర్వహించారు. మొత్తం 2,61,746 కుటుంబాల నుంచి వివరాలను సేకరించారు. ఇందులో 1,55,014 కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో, 1,06,732 కుటుంబాలు పట్టణాల్లో ఉన్నాయి. హెచ్‌సీఈఎస్‌ను ప్రతి ఐదేళ్లకోసారి నిర్వహించాలి. కానీ, పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు తర్వాత 2017-18లో చేపట్టిన సర్వే ఫలితాలను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. గణాంకాలను రూపొందించిన విధానంలో లోపాలున్నాయని వివరించింది. జీడీపీ, రిటైల్ ద్రవ్యోల్బణం, పేదరిక స్థాయిలను నిర్ధరించడానికి ఎంపీసీఈ గణాంకాలు చాలా కీలకం.
* దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ వృద్ధి గణనీయంగా తగ్గిపోయింది. ఫిబ్రవరి 9తో ముగిసిన వారానికి చలామణిలో ఉన్న కరెన్సీ వృద్ధి 3.7 శాతానికి పడిపోయిందని వార్తా సంస్థ పీటీఐ తాజాగా నివేదించింది. ఏడాది క్రితం ఇది 8.2 శాతంగా ఉండేది. కరెన్సీ-ఇన్-సర్క్యులేషన్ (CiC) అనేది చెలామణిలో ఉన్న నోట్లు, నాణేలను సూచిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న రూ.2,000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం కారణంగా కరెన్సీ-ఇన్-సర్క్యులేషన్ తగ్గుముఖం పట్టింది. ఆర్బీఐ ప్రకారం.. వాణిజ్య బ్యాంకులు జనవరిలో డిపాజిట్లలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. దీనికి కూడా రూ.2,000 కరెన్సీ నోట్ల ఉపసంహరణే కారణమని చెప్పవచ్చు. ఇక రిజర్వ్ మనీ (RM) వృద్ధి విషయానికి వస్తే ఏడాది క్రితం ఉన్న 11.2 శాతం నుంచి ఈ ఫిబ్రవరి 9 నాటికి 5.8 శాతానికి క్షీణించింది. చలామణిలో ఉన్న కరెన్సీ, ఆర్బీఐలో బ్యాంకుల డిపాజిట్లు, ఇతర డిపాజిట్లు ఈ రిజర్వ్ మనీలో భాగంగా ఉంటాయి. రిజర్వ్ మనీలో అతిపెద్ద భాగం అయిన కరెన్సీ-ఇన్-సర్క్యులేషన్ వృద్ధి ఏడాది క్రితం నాటి 8.2 శాతం నుంచి 3.7 శాతానికి క్షీణించడం రూ. 2,000 నోట్ల ఉపసంహరణను ప్రతిబింబిస్తోంది.
* ఫిక్స్‌డ్ డిపాజిట్లు పెట్టుబడిదారులకు భద్రత ఎక్కువ, రిస్క్ తక్కువ. అందుకే పెట్టుబడి దారులు ఎఫ్డీలలో పెట్టుబడి పెట్టేందుకు మక్కువ చూపుతుంటారు. మీరు కూడా ఎవరైనా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, ఎఫ్డీలపై 7.75శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్లు వడ్డీ రేట్లను పెంచాయి. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై నిర్దిష్ట కాలపరిమితిపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల (బిపిఎస్) వరకు పెంచింది. కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు ఫిబ్రవరి 9, 2024 నుండి అమలులోకి వస్తాయి. 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3.5శాతం నుండి 7.75శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇది కాకుండా, బ్యాంక్ 18 నెలల కాలపరిమితికి వడ్డీ రేట్లను పరిమిత కాలానికి 21 నెలల కంటే తక్కువకు పెంచింది. సాధారణ పౌరులకు, వడ్డీ రేటు 7.25శాతం. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు, అదే టెన్యూర్ కాలానికి వడ్డీ రేటు 7.75శాతం అందిస్తుంది.
* గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,10,106.83 కోట్లు పెరిగింది. వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ధి పొందింది. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 716.16 పాయింట్లు (0.97 శాతం) పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) భారీగా లబ్ధి పొందాయి. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ సంయుక్తంగా రూ.38,477.49 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.43,976.96 కోట్లు పుంజుకుని రూ.20,20,470.88 లక్షల కోట్లకు చేరుకున్నది. శుక్రవారం రిలయన్స్ షేర్ తాజా 52 వారాల గరిష్ట స్థాయి రూ.2,996.15లకు దూసుకెళ్లింది.
* దేశవ్యాప్తంగా భారీగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా దాదాపు 42లక్షలకుపైగా వివాహాలు జరుగనున్నట్లు అంచనా. ఇందులో దేశ రాజధాని ఢిల్లీలోనే నాలుగు లక్షకుపైగా వివాహాలు జరుగుతాయని అంచనా. వివాహ వేడుకల నేపథ్యంలో రూ.5.5లక్షల కోట్లకుపైగా వ్యాపారం జరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పెళ్లి బట్టలు, బంగారు ఆభరణాలు, వాహనాలతో పాటు పెళ్లిళ్ల భోజనాలకు సంబంధించి భారీగా డిమాండ్ సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ నిత్యవసర సరుకుల వస్తువులకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో జూలై 15 వరకు దేశవ్యాప్తంగా దాదాపు 42 లక్షల వివాహాలు జరగనున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z