* దేశంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. దిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌ను అధికారులు చేధించారు. ఈ వ్యవహారంలో తమిళనాడులోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీ ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. సూడోపెడ్రిన్‌కు ఇతర దేశాల్లో డిమాండ్ ఎక్కువ. మెథాంఫేటమిన్ తయారీలో దీన్ని వినియోగిస్తారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో కిలో రూ. 1.5 కోట్లకు విక్రయిస్తున్నారు. ఆ దేశాలకు పెద్ద మొత్తంలో సూడోపెడ్రిన్ పంపుతున్నట్లు ఎన్‌సీబీ సమాచారం అందుకుంది. దీనిని హెల్త్ మిక్స్ పౌడర్స్, కొబ్బరి సంబంధిత ఆహార ఉత్పత్తులతో కలిపి సముద్ర మార్గాల్లో రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ డ్రగ్ మాఫియా కదలికలపై ఎన్‌సీబీ నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే సరకును ఆస్ట్రేలియాకు పంపడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 15న పశ్చిమ దిల్లీలోని దారాపుర్‌లోని గోదాంలో తనిఖీ చేపట్టారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 50 కిలోల సూడోపెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్‌వర్క్ భారత్ సహా మలేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు విస్తరించినట్లు విచారణలో తేలింది.
* పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లకు.. బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన బాధితురాలి ఫిర్యాదుతో కేరళకు చెందిన జానీ, మనువల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 3 పెన్ డ్రైవ్‌లు, 7 పాస్‌బుక్‌లు, 33 చెక్కులు, 25 డెబిట్ కార్డులు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
* బాలానగర్‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పారిశ్రామిక వాడలోని దుకాణంలో ఒడిశా వాసి అనంత కుమార్ వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే తనిఖీలు చేపట్టి.. దుకాణంలో 140 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కూలీలు, విద్యార్థులకు వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
* జూబ్లీహిల్స్‌లో యువతి హంగామా సృష్టించింది. ట్రాఫిక్ హోంగార్డ్‌పై దాడి చేసి ఫోన్ పగలగొట్టింది. రాంగ్ రూట్‌లో వచ్చిన యువతిని హోంగార్డ్ అడ్డుకోగా, యువతి బూతులు తిడుతూ అతని బట్టలు చింపి దాడికి పాల్పడింది. యువతిపై హోంగార్డ్ విగ్నేష్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
* అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్ నగరంలోని హార్లెమ్ ప్రాంతంలో గల ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భారత్‌కు చెందిన ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z