NRI-NRT

భారత్‌లో పేదరికం 5శాతమే-NewsRoundup-Feb 26 2024

భారత్‌లో పేదరికం 5శాతమే-NewsRoundup-Feb 26 2024

* టీడీపీ-జనసేనల ఫస్ట్‌ లిస్ట్‌.. ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. టికెట్లు దక్కని ఇరు పార్టీల ఆశావహులు.. రోడ్డెక్కి తమ నిరసనలు తెలుపుతున్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేసేవాళ్లు కొందరైతే.. అసహనం ప్రదర్శిస్తున్నవాళ్లు మరికొందరు. ఈ క్రమంలో టీడీపీ కోడుమూరు ఇన్‌ఛార్జి ఏకంగా ఆత్మహత్యాయత్నం చేయడం జిల్లాలో కలకలం రేపింది. కోడుమూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌ శనివారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మూడేళ్లుగా ఆ పార్టీ ఇన్‌చార్జిగా ఆయన పని చేస్తున్నారు. దీంతో టికెట్‌ కచ్చితంగా తనకే వస్తుందని ధీమాతో ఉన్నారాయన. అయితే.. అధిష్టానం మాత్రం తొలి జాబితాలో బొగ్గుల దస్తగిరి పేరు ప్రకటించింది. దీంతో.. ఆయన ఆవేదనతో పురుగుల మందు తాగారు. అయితే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది.

* చైనీస్ వీసా కేసు (Chinese Visa case)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం (Karti Chidambaram), ఇతరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన చార్జిషీటుపై తీర్పును ఢిల్లీ హైకోర్టు (Delhi High Curt) సోమవారంనాడు రిజర్వ్ చేసింది. మార్చి 16వ తేదీకి తీర్పును ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగపాల్ వాయిదా వేశారు.

* టీడీపీ మొదటి జాబితాలో (TDP first list) తమ పేర్లు లేకపోవడంతో టికెట్ ఆశించి భంగపాటుకు గురైన పలువురు నేతలు అలకబూనారు. అసంతృప్తికి గురయ్యారు. అయితే టికెట్ దక్కినవారు రంగంలోకి దిగి అందరినీ కలుపుకొని పోవాలని, టికెట్ ఆశించి భంగపడ్డ వారిని స్వయంగా కలిసి సమన్వయం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచన చేసిన నేపథ్యంలో అభ్యర్థులు రంగంలోకి దిగారు. తాజాగా పెడన నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్‌ను తొలి జాబితాలో సీటు దక్కించుకున్న అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ కలిశారు. వేదవ్యాస్ నివాసానికి వెళ్లి మాట్లాడారు.

* పరువు నష్టం కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. యూట్యూబర్ ధ్రువ్ రాథీకి సంబంధించిన వీడియోను రీట్వీట్ చేసిన కేసులో కేజ్రీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు అధికారులను ఆదేశించింది. యూట్యూబర్ ధ్రువ్ రాథీ 2018లో చేసిన ఓ యూట్యూబ్ వీడియోను కేజ్రీ రీట్వీట్ చేశారు. దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ఒకరిని కించపరిచేలా ఉన్న వీడియోను ఇతరులకు షేర్ చేయడం కూడా నేరమే అవుతుందని వ్యాఖ్యానించింది.

* భారత్‌లో పేదరికం 5 శాతానికి తగ్గిందని నీతి ఆయోగ్‌(Niti Aayog) సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. 2022-23 మధ్య కాలంలో చేపట్టిన గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్‌సీఈఎస్)ను ఉటంకిస్తూ ఈ విషయాన్ని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల ఆదాయం పెరిగిందని నీతి ఆయోగ్‌ చేపట్టిన సర్వే తెలిపింది. 2011-12 నుంచి పోల్చి చూస్తే పట్టణాల్లో నెలవారీ సగటు ఖర్చు 33.5శాతం పెరిగి రూ.3,510గా ఉందని, గ్రామాల్లో నెలవారీ ఖర్చు 40.42శాతం పెరిగి రూ.2,008గా ఉందని స్పష్టం చేసింది.

* నియంత పాలనలో నోరువిప్పడమూ నేరమేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వైకాపా నాయకులు చేస్తున్న అకృత్యాలను బయటపెట్టిన ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేయడం దారుణమని మండిపడ్డారు. కొండపై వైకాపా నేతలు, కొంత మంది అధికారులు కలిసి చేస్తున్న దారుణాలను.. ఆ కలియుగ దైవమే రమణ దీక్షితులు నోటి నుంచి భక్తులకు తెలిసేలా చేశారన్నారు. చేసిన తప్పులు, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది పోయి ఆయనపై కేసు పెట్టడం, అరెస్ట్ చేయాలని చూడటం జగన్ అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు.

* దేశంలోని అతిపెద్ద టెక్స్‌టైల్స్‌-2024 (Bharat Tex 2024)ఈవెంట్‌ను దిల్లీలోని భారత మండపం వేదికగా ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 100 దేశాల నుంచి మూడు వేల మందికి పైగా ఎగ్జిబిటర్లు, కొనుగోలుదారులు, 40 వేల మంది వాణిజ్య సందర్శకులు హాజరయ్యారు. ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. టెక్స్‌టైల్స్‌ రంగం భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కీలకంగా మారనుందన్నారు.

* జపాన్‌ (Japan) మూన్‌ ల్యాండర్‌ మరో మైలురాయిని దాటింది. జాబిల్లిపై రాత్రిని తట్టుకొని నిలిచింది. సోమవారం ఉదయం జపాన్‌ స్పేస్‌ ఏజెన్సీ (జాక్సా) ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించింది. ‘‘నిన్న రాత్రి స్లిమ్‌కు ఒక కమాండ్‌ పంపించగా, దానికి స్పందన వచ్చింది. అది రాత్రి వేళ కూడా కమ్యూనికేషన్‌ సామర్థ్యాన్ని కాపాడుకున్నట్లైంది’’ అని పేర్కొంది. ఇక్కడ మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండటంతో కమ్యూనికేషన్‌ పరికరాలు వేడెక్కుతాయి. దీనిని దృష్టిలోపెట్టుకొని వాటిని తాత్కాలికంగా నిలిపివేశారు. వేడి తగ్గిన తర్వాత తిరిగి యాక్టివేట్‌ చేసేందుకు సన్నాహాలు చేశారు. ఈ గ్రహంపై రాత్రి సమయం 14 రోజులు ఉంటుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు-200 డిగ్రీలకు పడిపోతాయి. ఎండ అందకపోవడంతో సౌర ఫలకాలు నిరుపయోగంగా మారతాయి. దీంతో బ్యాటరీలు పనిచేయవు. వాస్తవానికి స్లిమ్‌ జనవరిలో చంద్రుడిపై ఇబ్బందికరంగా ల్యాండ్‌ అయింది. దీనిని హార్ష్‌ ల్యాండింగ్‌కు అనువుగా తయారుచేయలేదు. గతంలో చందమామ పైకి వెళ్లిన ల్యాండర్లు 10కి.మీ. వెడల్పైన జోన్‌ను లక్ష్యంగా పెట్టుకోగా.. స్లిమ్‌ కేవలం 100 మీటర్ల వెడల్పైన ల్యాండింగ్‌ జోన్‌ను లక్ష్యంగా విధించుకొని, ఆ పరిధిలోనే దిగింది. దీంతో జాబిల్లిని చేరుకున్న అయిదో దేశంగా జపాన్‌ అవతరించింది. అయితే స్లిమ్‌ మామూలు స్థితిలో కాకుండా.. తలకిందులుగా ల్యాండ్‌ అయింది. ఫలితంగా సోలార్‌ ప్యానెళ్లపై ఎండ పడని స్థితి నెలకొంది. కానీ, ఆ తర్వాత సూర్యుడి గమనం మారడంతో వీటిపై వెలుగు పడటం మొదలైంది. దీంతో కొన్ని ఫొటోలను తీసి భూమికి పంపింది. ఏకంగా 10 శిలలను అది శోధించింది. ఆ తర్వాత మళ్లీ జాబిల్లిపై రాత్రి మొదలుకావడంతో తిరిగి నిద్రావస్థలోకి జారుకొంది.

* సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పోటీ చేసే స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన మరోసారి కేరళలోని వయనాడ్(Wayanad) నుంచి పోటీలో ఉండకపోవచ్చని మీడియా కథనాలు వెల్లడించాయి. కర్ణాటక లేక తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రెండు నియోజకవర్గాల నుంచి ఆయన బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

* తన పేరును కొందరు వ్యక్తులు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని, అలాంటి చర్యలను అస్సలు ఉపేక్షించేది లేదని విలక్షణ నటుడు, నిర్మాత మోహన్‌బాబు (Mohan babu) అన్నారు. ఇందుకు సంబంధించి ఎక్స్‌ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. తన పేరును అనవసరంగా వాడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ‘‘ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడటంలోనే మనం దృష్టి పెట్టాలిగానీ, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి, వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ.. ధన్యవాదాలతో మీ మోహన్‌బాబు’’ అంటూ పోస్ట్‌ పెట్టారు.

* మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు సోమవారం జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో ఆయనకు పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. కొత్తపల్లి చేరికతో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు కొత్త ఉత్సాహం వస్తుందని, ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరమని పవన్‌ అన్నారు.

* వైకాపాకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి సోమవారం తెదేపాలో చేరారు. విజయవాడలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. వైకాపా విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. చంద్రబాబు విజన్‌ భావితరాలకు ఎంతో అవసరమన్నారు. ‘‘బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వైకాపాలో ఏమాత్రం ప్రాధాన్యం లేదు. బలహీనవర్గాలకు వైకాపాలో అన్నీ అవమానాలే. ఎవరి పెత్తనంపైనో ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం మాత్రం చంపుకోం. నూజివీడులో అందరితో కలిసివెళ్తూ తెదేపా జెండా ఎగురవేస్తా’’అని తెలిపారు. పార్థసారథితోపాటు వైకాపా నేతలు బొప్పన భవకుమార్‌, కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ తదితరులు తెదేపాలో చేరారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z