* రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైతు బంధు, రైతు బీమా కుంభకోణం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యవసాయ విస్తరణాధికారి శ్రీశైలం సహా క్యాబ్ డ్రైవర్ ఓదెల వీరాస్వామిని అదుపులోకి తీసుకున్నారు. 20 మంది రైతులు మరణించినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి బీమా డబ్బులు స్వాహా చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కుంభకోణంపై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు.
* రాడిసన్ డ్రగ్ కేసు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు కీలక విషయాలను పొందుపరిచారు. 9 మంది నిందితులపై ఎన్డీపీఎస్ (Narcotic Drugs and Psychotropic Substances Act) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగించిన ఇద్దరు యువతులు సహా 8 మందిపై, వీరికి కొకైన్ విక్రయించిన అబ్బాస్ అలీపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. గచ్చిబౌలిలోని స్టార్ హోటల్‌లో ఆదివారం అర్ధరాత్రి విందు ఏర్పాటు చేసుకొని.. మత్తు పదార్థాలు, కొకైన్ స్వీకరించినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు దాడులు నిర్వహించి మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కొకైన్‌ను పేపర్ రోల్‌లో చుట్టి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తరచూ అదే హోటల్‌లో పార్టీలు చేసుకుంటామని నిందితుడు వివేకానంద్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. వివేకానంద్‌తో పాటు పార్టీలో కేదార్, నిర్భయ్, క్రిష్, నీల్, లిషి, శ్వేత, సందీప్, రఘుచరణ్‌లు పాల్గొన్నారు. వీరిలో వివేకానంద్, కేదార్, నిర్భమ్‌లను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేయగా.. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు.
* సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు చైన్ స్నాచర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైన్ స్నాచర్ల నుంచి 10 తులాల బంగారం, 2.5 కేజీల వెండి, రూ. 25 వేల నగదు, 20 డాలర్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. గత పదిహేను రోజుల నుంచి అమీన్‌పూర్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా ఉంచి వారిని సోమవారం పట్టుకున్నారు.
* బట్టలు ఆరేస్తుండగా విద్యుత్‌షాక్‌తో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలంలోని బురాన్‌పూర్ గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బురాన్‌పూర్‌కు చెందిన దంపతులు బోయిన లక్ష్మణ్(48), లక్ష్మి(42) వారి ఇంటి ముందున్న రేకుల షెడ్డు వద్ద బట్టలు ఆరేసేందుకు తీగలు ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం ఉదయం బట్టలు ఆరేసే క్రమంలో వారు కట్టిన తీగకు విద్యుత్ ప్రసరించింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ కాలనీకి విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఆ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుల నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z