Business

పతంజలికి సుప్రీం చీవాట్లు-BusinessNews-Feb 27 2024

పతంజలికి సుప్రీం చీవాట్లు-BusinessNews-Feb 27 2024

* యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాకు చెందిన పతంజలి (Patanjali) ఆయుర్వేద సంస్థపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. కంపెనీ ఉత్పత్తుల ప్రచారం, వాటి సామర్థ్యానికి సంబంధించిన ప్రకటనల విషయంలో కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించడంపై జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అమనుల్లాతో కూడిన ధర్మాసనం మండిపడింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ రామ్‌దేవ్‌ బాబాకు, సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ప్రకటనల విషయంలోనూ కొన్ని సూచనలు కూడా చేసింది. ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల్లో ఎలాంటి ప్రకటనలూ ఇవ్వొద్దని మరోసారి సూచించింది.

* ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ (Bitcoin) మళ్లీ పుంజుకొని రెండేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. 2021 తర్వాత తొలిసారి 54 వేల డాలర్లను దాటింది. ఓ దశలో 57 వేల డాలర్ల పైకి చేరుకున్న బిట్‌కాయిన్‌.. ప్రస్తుతం 56 వేల ఎగువన ట్రేడవుతోంది. మరో క్రిప్టో కరెన్సీ ఎథీరియం సైతం 3200 మార్కు ఎగువన కొనసాగుతోంది. 2022 తర్వాత ఈ క్రిప్టోకు ఇదే గరిష్ఠం కావడం గమనార్హం. అమెరికాకు చెందిన ప్రముఖ క్రిప్టో ఇన్వెస్టర్‌, సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోస్ట్రాటజీ.. ఇటీవల 155 మిలియన్‌ డాలర్లు వెచ్చించి 3 వేల బిట్‌ కాయిన్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. దీనికితోడు బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌కు అమెరికా ఆమోదం తెలపడం కూడా క్రిప్టోలు రాణించడానికి మరో కారణం. ఈ కారణంతోనే బిట్‌కాయిన్‌లో చాలా రోజుల తర్వాత మళ్లీ కొనుగోళ్లు వెల్లువెత్తాయి.

* సామాన్య రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ‘ఎక్స్‌ప్రెస్ స్పెషల్స్’ లేదా ‘మెము/డెము ఎక్స్‌ప్రెస్’ రైళ్లుగా పేరు మార్చిన ‘ప్యాసింజర్ రైళ్ల’కి సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను పునరుద్ధరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కోవిడ్‌ మహమ్మారి లాక్‌డౌన్ తర్వాత రైల్వేలు వాటి పేర్లను మార్చడం ద్వారా ‘ప్యాసింజర్ రైళ్ల’ను క్రమంగా నిలిపివేసింది. ‘ఆర్డినరీ క్లాస్’ ఛార్జీలను తీసేసి ఎక్స్‌ప్రెస్ రైలు ఛార్జీలతో సమానంగా కనీస టిక్కెట్ ధరను రూ.10 నుంచి రూ.30కి పెంచిన విషయం తెలిసిందే.

* ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (ఎఫ్‌పీఐ) విషయంలో అప్రమత్తంగా ఉండాలని క్యాపిటల్‌ మార్కెట్స్‌ నియంత్రణ సంస్థ సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఎఫ్‌పీఐ మార్గం ద్వారా స్టాక్ మార్కెట్ యాక్సెస్‌ను సులభతరం చేస్తామంటూ మోసగిస్తున్న ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎఫ్‌పీఐలతో తమకు అనుబంధం ఉందని, ఎఫ్‌పీఐ లేదా సంస్థాగత ఖాతాల ద్వారా ట్రేడింగ్ అవకాశాలు కల్పిస్తామని కొన్ని మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్లను మభ్యపెడుతున్నాయని సెబీకి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ సెబీ ఈ హెచ్చరిక ప్రకటన విడుదల చేసింది.

* ప్రముఖ ఉచిత వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌ (YouTube) కొద్దిసేపటి నుంచి కంటెంట్‌ క్రియేటర్లకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీంతో కంటెంట్‌ క్రియేటర్లు గగ్గోలు పెడుతూ యూట్యూబ్‌ సమస్యను సోషల్ మీడియాలోకి తీసుకొచ్చారు. వివిధ వెబ్‌సైట్‌లు, సర్వీస్‌ స్టేటస్‌ గురించి యూజర్లకు రియల్‌ టైమ్‌ సమాచారాన్ని అందించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ డౌన్‌డెటెక్టర్ కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఈ సమస్య తలెత్తినట్లు వేల సంఖ్యలో క్రియేటర్లు తెలియజేశారు. తమ దగ్గరున్న వీడియోలను అప్‌లోడ్‌ చేసినా.. అవి రియల్‌టైంలో యూజర్లకు కనిపించడం లేదని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z