* రైల్వే శాఖలో 4,660 ఉద్యోగాలంటూ చక్కర్లు కొడుతున్న నకిలీ ప్రకటనపై దక్షిణ మధ్యరైల్వే స్పందించింది. ఈ నకిలీ ఉద్యోగ నియామక నోటీసుపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్‌లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదని స్పష్టంచేస్తూ ట్వీట్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుందని పేర్కొంటూ విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఈ నోటిఫికేషన్ నకిలీదని ఇటీవల ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై దక్షిణ మధ్య రైల్వే కూడా స్పందించింది. ఎప్పుడూ వ్యక్తిగత/ఆర్థికపరమైన సమాచారాన్ని షేర్ చేయొద్దని ప్రజలకు సూచించింది. ఆర్పీఎఫ్లో 452 ఎస్సై, 4,208 కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య, వేతనం, వయోపరిమితి, విద్యార్హతలు, ఉద్యోగ నియామక ప్రక్రియ, దరఖాస్తు రుసుం వంటి అంశాలతో కూడిన ఈ నకిలీ ప్రకటనను ఎవరూ నమ్మొద్దని పేర్కొంది.
* గతంలో జరిగిన ప్రేమ వివాహం విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర హింసకు దారితీసింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఇరువర్గాల మధ్య జరిగిన దాడిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఫులాత్ గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. రెండు గ్రూపుల మధ్య మంగళవారం చెలరేగిన ఈ ఘర్షణలో అంకిత్ (25), రోహిత్ (29) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరో యువకుడు బుధవారం ప్రాణాలు విడిచాడు.
* ఆస్తి కోసం ఓ వ్యక్తి అత్తమామలపై కాల్పులు జరిపాడు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్తి రాసివ్వాలంటూ గోలేటి శంకర్, లక్ష్మి దంపతులను వారి పెద్ద అల్లుడు నరేందర్ గత కొంత కాలంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి ఇంటికి వచ్చి గొడవ చేస్తూ తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. గురి తప్పడంతో బుల్లెట్ గోడకి తగిలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* నిత్యం మద్యం తాగి వేధిస్తున్న కుమారుడిని ఓ తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన హయత్‌నగర్ పరిధిలోని మునగనూరులో చోటు చేసుకుంది. కుమారుడు వినయ్ కుమార్ గౌడ్ మద్యానికి బానిస అయ్యాడు. నిత్యం మద్యం మత్తులో ఉంటూ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. మంగళవారం రాత్రి కూడా వినయ్ కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తండ్రి శ్రీనివాస్‌గౌడ్‌పై పారతో దాడి చేసేందుకు వినయ్ యత్నించాడు. అదే సమయంలో ఫోన్ రావడంతో పారను వదిలేశాడు వినయ్. ప్రాణభయంతో అదే పారతో కుమారుడిపై దాడి చేసి చంపాడు తండ్రి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z