* ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ కంపెనీ ‘బైజూ’స్ కంపెనీకి మరో కష్టమొచ్చింది. సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించలేక పోతున్నానని బైజూ’స్ సీఈఓ బైజూ రవీంద్రన్ తెలిపారు. ఇన్వెస్టర్లు తమ ప్రయోజనాల కోసం నిధులను ఒక ప్రత్యేక ఖాతాలో లాక్ చేశారని ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 10 నాటికి వేతనాల చెల్లింపునకు ప్రయత్నిస్తామన్నారు. ‘దురద్రుష్టవశాత్తు కొందరు ఇన్వెస్టర్ల వల్లే ఈ పరిస్థితి నెలకొన్నది. రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించుకున్నా.. ఇన్వెస్టర్ల చర్య వల్ల మీరు పడ్డ కష్టానికి వేతనం చెల్లించలేని పరిస్థితి నెలకొంది. బైజూ’స్‌లో పెట్టుబడుల ద్వారా గణనీయ లాభాలు పొందారు. అందులో ఒకరు తమ పెట్టుబడిపై ఎనిమిది రెట్లు లాభాలు గడించారు. అటువంటి వారు ఇతరుల జీవితాలు, జీవనోపాధితో ఆటలాడుతున్నారు’ అని బైజూ రవీంద్రన్ ఆరోపించారు.
* సర్వీస్ ఫీజు చెల్లించని కొన్ని యాప్స్‌ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించడం సరి కాదని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. టెక్నాలజీ, స్టార్టప్ కంపెనీల యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ తొలగించింది. దీనిపై ఇరుపక్షాలతో వచ్చేవారం సమావేశమవుతామని అశ్వినీ వైష్ణవ్.. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దేశీయ ఆర్థిక వ్యవస్థకు స్టార్టప్ ఎకో సిస్టమ్ గుండె వంటిదని, అటువంటి సంస్థల తల రాతలను ప్రధాన టెక్నాలజీ కంపెనీలు నిర్ణయించరాదన్నారు. ఈ అంశాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. స్టార్టప్, టెక్ కంపెనీల యాప్స్ తొలగించడాన్ని తాము ఎంత మాత్రమూ అంగీకరించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. స్టార్టప్ సంస్థలకు రక్షణ కల్పించడం ముఖ్యం అన్నారు. ఈ అంశంపై గూగుల్, యాప్ డెవలపర్లతో వచ్చే వారం సమావేశం అవుతామని తెలిపారు. దేశంలో లక్ష స్టార్టప్ సంస్థలు రూపుదిద్దుకోగా, 100 యూనికార్న్‌లు అవతరించాయన్నారు.
* చలామణీలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో 97.62 శాతం తిరిగి బ్యాంకుల్లో జమయ్యాయని రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఈ నోటును ఉపసంహరించుకొని తొమ్మిది నెలలు అయినప్పటికీ ఇంకా ప్రజల వద్ద రూ.8,470 కోట్ల విలువైన 2 వేల నోట్లు ఉన్నాయని పేర్కొంది. గతేడాది మే 19న ఈ నోట్‌ను రిజర్వుబ్యాంక్ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఉపసంహరించుకున్నప్పుడు మార్కెట్లో రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉండగా..ప్రస్తుతం ఇవి రూ. 8,470 కోట్లకు తగ్గాయని సెంట్రల్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. వీటిలో 97.62 శాతం నోట్లు తిరిగి బ్యాంకుల్లో జమయ్యాయని, ఫిబ్రవరి 29, 2024 నాటికి ఇంకా రూ.8,470 కోట్ల విలువైన నోట్లు జమకాలేదని ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.
* స్టాక్ మార్కెట్ ప్రత్యేక సెషన్‌లో సూచీలు రాణించాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కొత్త జీవన కాల గరిష్ఠాలను నమోదు చేశాయి. ఆపై కాస్త స్వల్పంగా క్షీణించాయి. సెన్సెక్స్ 61 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,400 పాయింట్ల ముంగిట ముగిసింది. ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు తొలి సెషన్ జరగ్గా.. ఉదయం 11.30 నుంచి 12.30 మధ్య మరో సెషన్ జరిగింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z