* రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో ఏర్పాటు చేసిన ‘రా.. కదలిరా’ సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెదేపాలో చేరారు. ఆయనకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పల్నాడు జిల్లాలో తలపెట్టిన వాటర్‌గ్రిడ్, వరికిపుడిసెల ఎత్తిపోతలను ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధికి తమ వెంట నడవాలని కోరారు. ‘‘కార్యకర్తలను కాపాడుకునేందుకు యరపతినేని ఎన్నో త్యాగాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా ఓటు వేయాలి. వైకాపా ప్రభుత్వం పనైపోయిందని పోలీసులు కూడా గ్రహించాలి. హు కిల్డ్ బాబాయ్ ప్రశ్నకు జగన్ ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. బాబాయ్‌ను ఎవరు చంపారో చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలి. హత్యలు చేసేవారు రాజకీయాలకు పనికిరారని, ఎంతో బాధతో అన్న పార్టీకి ఓటు వేయొద్దని మీ చెల్లే చెప్పింది. సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి.. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా? టిష్యూ పేపర్‌లా వాడుకుంటారు.. జగన్‌ది యూజ్ అండ్ త్రో విధానం. మరో 40 రోజుల్లో జగన్‌ను ఇంటికి పంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. బెంగళూరు, ఇడుపులపాయ, కడప, హైదరాబాద్, తాడేపల్లిలో జగన్‌కు ప్యాలెస్‌లు ఉన్నాయి. అవన్నీ సరిపోక రుషికొండలో మరో ప్యాలెస్ కట్టారు.
* ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకంపై విధివిధానాలు, నిబంధనలు తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. స్థలం ఉన్నవారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లులేని నిరుపేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.
* లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భాజపా (BJP) విడుదల చేసింది. మొత్తం 195 స్థానాలకుగానూ పోటీదారుల పేర్లు ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి 9 మందిని అధిష్ఠానం ఎంపిక చేసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్ స్థానాల్లో గెలుపొందగా.. అందులో ముగ్గురు సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం కల్పించారు. ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావుకు తొలిజాబితాలో అవకాశం లభించలేదు.
సికింద్రాబాద్ – కిషన్‌రెడ్డి (కేంద్రమంత్రి)
కరీంనగర్ – బండి సంజయ్
నిజామాబాద్ : డి.అర్వింద్
చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
మల్కాజిగిరి – ఈటల రాజేందర్
జహీరాబాద్ – బీబీ పాటిల్
హైదరాబాద్ – మాధవీలత
నాగర్ కర్నూల్ – భరత్ ప్రసాద్
భువనగిరి – బూర నర్సయ్యగౌడ్
* జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) గ్యాంగ్‌స్టర్ మహ్మద్ గౌస్ నియాజీని దక్షిణాఫ్రికాలో అరెస్టు చేసింది. నియాజీ 2016లో బెంగళూరులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నేత రుద్రేష్‌ను హత్య చేశాడు. అప్పటినుంచి పోలీసులకు దొరకకుండా విదేశాలకు చెక్కేశాడు. అతడి కదలికలపై ఆరా తీస్తున్న గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అతడు ఆశ్రయం పొందుతున్న లొకేషన్‌ను గుర్తించింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను రుద్రేష్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏకు తెలియజేసింది. దీంతో అప్రమత్తమైన ఎన్‌ఐఏ అధికారులు నిందితుడిని దక్షిణాఫ్రికాలో అరెస్టు చేశారు. అతడిని భారత్‌కు తీసుకురావడానికి అధికారిక చర్యలను వేగవంతం చేశారు. ఆర్‌ఎస్ఎస్ నాయకుడి హత్యలో నిందితుడిగా ఉన్నందున ముందుగా బెంగళూరులో విచారణకు తరలించనున్నారు.
* కేంద్ర ప్రభుత్వం త్వరలో పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలు చేయబోతోందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనికి కారణం కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌ల కార్లకు ఉన్న నంబర్ ప్లేట్లు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన భాజపా ఎన్నికల సంఘం సమావేశానికి హాజరైన హోంమంత్రి అమిత్ షా(Amit Shah), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh)ల కారు నంబరు ప్లేట్లపై ఉన్న సంఖ్యల మధ్యలో CAA అని ఉండడంతో ప్రభుత్వం త్వరలో ఈ చట్టాన్ని అమలు చేయబోతున్నట్లు సంకేతాలు ఇస్తోందా అనే ప్రశ్నలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి.
* సినీనటి వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. మార్చి1న ముంబయి వేదికగా జరిగిన ఈ వేడుకలో కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. తమిళ, తెలుగు చిత్రాల్లో నటిగా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మి. సీనియర్ నటుడు శరత్‌కుమార్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైనా తన వైవిధ్యమైన నటన, పాత్రలతో అలరించారు. ఇక నికోలయ్ సచ్‌దేవ్ ముంబయికి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్ గ్యాలరీలను నిర్వహిస్తుంటారు. ఆన్‌లైన్ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటారు.
* ఇకపై కూటమి మారబోయేది లేదని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish Kumar) అన్నారు. తాను ఎన్డీయే (NDA)లోనే ఉంటానని ప్రధాని మోదీ (PM Modi) సాక్షిగా ఆయన హామీ ఇచ్చారు. ఔరంగబాద్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో మోదీతో పాటు పాల్గొన్న నీతీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో కూటమి (ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ)కి ఆ పేరు పెట్టేందుకు నిరాకరించా. అయినప్పటికీ వారు దాన్నే ఖరారు చేశారు. ఈ కారణాలతో తిరిగి ఎన్డీయే గూటికి చేరా. ఇప్పటికీ సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కిరాలేదు. గతంలో ఎన్నోసార్లు ప్రధాని ఇక్కడికి వచ్చారు. ఈసారి మీతో కలిసి ఉన్నందుకు నేనేంతో అదృష్టవంతుడిని. శాశ్వతంగా కూటమి మారకుండా.. మీతోనే కలిసి నడుస్తా. బిహార్ అభివృద్ధికి కృషి చేస్తా’’ అని ప్రధానితో నీతీశ్ అన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z